పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగాలు.. మంచి జీతం, భార్య పిల్లలతో లైఫ్ హాయిగా సాగిపోతోంది. కానీ.. స్టార్టప్ పెట్టాలనే ఆలోచన బలంగా ఉండేది ఆ ఇద్దరిలో. ఆ టైంలోనే క్రానిక్ డిసీజ్‌తో దగ్గరివాళ్లను కోల్పోయారు. దాంతో ‘హెల్దీ’ స్టార్టప్ ఒకటి పెట్టాలని డిసైడ్ అయ్యారు ఈ ఇద్దరు కజిన్స్. అడుగుముందుకేసి కంపెనీ మొదలుపెట్టారు. కానీ.. అప్పటినుంచి కష్టాలు మొదలయ్యాయి. చివరికి కొడుకు స్కూల్ ఫీజు కట్టడానికి కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి. అన్నింటినీ తట్టుకుని బిజినెస్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కోట్లలో సంపాదిస్తున్నారు ‘ట్రూ ఎలిమెంట్స్’ ఫౌండర్స్ పురు, శ్రీజిత్.
సొంత వ్యాపారం మొదలుపెట్టాలి.. సక్సెస్ కావాలి అని ఎంతోమంది కలలు కంటుంటారు. అవకాశాలు పెరగడంతో గడిచిన దశాబ్ద కాలం స్టార్టప్‌లు విపరీతంగా పుట్టుకొచ్చాయి. వాటిలో ఎన్నో సక్సెస్ అయ్యాయి. అందుకే ఇప్పుడు స్టూడెంట్స్ కూడా చాలామంది స్టార్టప్ పెట్టడం గురించి ఆలోచిస్తున్నారు. దాన్నే కెరీర్ ఛాయిస్‌గా మార్చుకుంటున్నారు కూడా. కానీ.. వాస్తవానికి సక్సెస్ఫుల్ బిజినెస్‌ని బిల్డ్ చేయడం, నడపడం అంత ఈజీగా కాదు. హెల్దీ ఫుడ్ బ్రాండ్ ‘‘ట్రూ ఎలిమెంట్స్”ని మొదలుపెట్టిన కో-ఫౌండర్స్ శ్రీజిత్ మూలయిల్, పురు గుప్తాలకు సరైన సక్సెస్ రావడానికి దాదాపు పదమూడేండ్లు పట్టింది. ఈ పదమూడేండ్ల కాలంలో ఎన్నో ఇబ్బందులు, ఆర్థిక సమస్యలను ఎదుర్కొని వాళ్ల స్టార్టప్‌ని మూడుసార్లు అప్‌గ్రేడ్ చేశారు. వాళ్లలోని పట్టుదలే వాళ్లకు సక్సెస్ దక్కేలా చేసింది.
ఉద్యోగాలు వదిలేసి..
ఈ ఇద్దరూ అన్నదమ్ములు.. క్రానిక్ డిసీజ్‌ల కుటుంబంలో వాళ్లకు బాగా ఇష్టమైన ఇద్దర్ని కోల్పోయారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య జబ్బుల్ని ఎలా గుర్తించాలి? ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి? న్యూట్రిషన్ ఫుడ్స్‌ని ఎలా గుర్తించాలి?.. ఇలాంటి విషయాల మీద చర్చలు జరిగాయి. అప్పుడే వాళ్లకు ఆరోగ్యకరమైన లైఫ్ స్టయిల్ ఇంపార్టెన్స్ తెలిసింది. దాంతో ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పటివరకు హాయిగా చేసుకుంటున్న కార్పొరేట్ ఉద్యోగాలను వదిలేసి... ఒక స్టార్టప్ పెట్టాలి అనుకున్నారు.
దాని ద్వారా హెల్దీ బ్రేక్‌ఫాస్ట్, శ్నాక్ ఫుడ్స్ తెచ్చి ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించాలి అనుకున్నారు. మొదట్లో ఆరోగ్యకరమైన ఫుడ్ కంపెనీల అగ్రిగేటర్‌గా బిజినెస్ మొదలుపెట్టారు. ఆ తర్వాత కార్పొరేట్ వెల్‌నెస్ సొల్యూషన్స్ తీసుకొచ్చారు. కానీ.. చివరకు 2017లో ‘ట్రూ ఎలిమెంట్స్’ రూపంలో సొంత ప్రొడక్ట్స్‌తో తయారీ మొదలుపెట్టారు. 2022లో ఈ స్టార్టప్‌లోని 54శాతం ఈక్విటీ షేర్ని ‘మారికో కంపెనీ’ కొనడంతో శ్నాకింగ్ మార్కెట్‌లో బిగ్ ప్లేయర్‌గా ఎదిగింది. ప్రస్తుతం 50 ఇ-కామర్స్ ఛానెళ్లు, 12,000 అవుట్‌లెట్లు ఉన్నాయి. నెలకు ఏడు లక్షల ప్రొడక్ట్స్ అమ్ముడవుతున్నాయి.
ఎలా మొదలైంది?
శ్రీజిత్ది కేరళ. ఎంబీఏ(మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) హెచ్ఆర్(హ్యూమన్ రిసోర్సెస్) పూర్తయ్యాక ఉద్యోగం చేయడానికి పూణెకు వెళ్లాడు. 2002లో అతని భార్య తరఫు బంధువు పురుతో పరిచయం ఏర్పడింది. పురు వాళ్ల నాన్న ఆర్మీ ఆఫీసర్ కావడం వల్ల దేశమంతా తిరిగేవాళ్లు. మార్కెటింగ్‌లో ఎంబీఏ చేశాడు. ‘ప్రాక్టర్ అండ్ గ్యాంబల్’ కంపెనీలో పనిచేసేవాడు శ్రీజిత్. కాగ్నిజెంట్‌లో మంచి హోదాలో ఉన్నాడు. కానీ.. పురు, శ్రీజిత్‌లు ఇద్దరికీ స్టార్టప్ పెట్టాలనే కోరిక ఉండేది. ఇద్దరూ సరదాగా మాట్లాడుకునేటప్పుడు వాళ్ల ఆలోచనల గురించి మాట్లాడుకున్నారు.
దాంతో.. 2006 నుండి బ్రాండ్ ఏదైనా ఏర్పాటుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే ఏడాది పురు చైనాలో ఇంటర్న్‌షిప్ చేయడానికి వెళ్లాడు. విదేశాల్లో భారతీయ కంపెనీలకు ఉన్న వ్యాపార అవకాశాల గురించి తెలుసుకున్నాడు. అప్పటినుంచి వాళ్లిద్దరు కలిసినప్పుడల్లా ఎలాంటి స్టార్టప్ పెడితే బాగుంటుంది? ఏయే ప్రొడక్ట్స్‌కి డిమాండ్ ఉంది? అని డిస్కస్ చేస్తుండేవాళ్లు.
చైనా టూర్
పురు ఇండియాకు వచ్చాక శ్రీజిత్ని చైనా వెళ్లి రమ్మని చెప్పాడు. వెంచర్ ప్రారంభించడానికి అది బెస్ట్ ప్లేస్ అని చెప్పాడు. దాంతో.. శ్రీజిత్ అతని భార్య 2010లో చైనాకు వెళ్లి ఒక ఏడాది పాటు అక్కడే ఉన్నారు. అయితే అక్కడ వ్యాపారం చేయడం సాధ్యం కాదనుకున్నాడు శ్రీజిత్. దానికంటే కూడా ఇండియాలో స్టార్టప్ పెట్టడమే సేఫ్ అని నమ్మాడు. కానీ.. చైనాలో ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాడు అతను. చైనీయులకు చాలా మంచి ఫుడ్ హ్యాబిట్స్ఉన్నాయి. వాళ్లు ఫుడ్‌ని ఫర్ఫెక్ట్గా వండుతారు. సరిగ్గా తింటారు.
ముఖ్యంగా సరైన టైంలో తింటారు. ఈ మూడింటి విషయంలో చాలామంది ఇండియన్స్ కొన్ని తప్పులు చేస్తున్నారు. దీనివల్లే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అర్థమైంది. అందుకే ఆ రంగంలో మార్పు అవసరం అనుకున్నాడు. అదే టైంలో పురు తండ్రి క్యాన్సర్‌తో చనిపోయాడు. శ్రీజిత్ మామ కూడా గుండె జబ్బుతో చనిపోయాడు. అప్పుడే తమ కుటుంబాలు హెల్దీ లైఫ్ స్టయిల్‌కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని అర్థమైంది. కానీ.. అప్పటికే చాలా ఆలస్యమైంది. ఇకనుంచైనా మార్పు రావాలి అని డిసైడ్ అయ్యారు. ఆ మార్పు వాళ్ల కుటుంబంతోపాటు అన్ని కుటుంబాల్లో వస్తే బాగుంటుంది అనుకున్నారు.
ఐదేండ్ల తర్వాత
బిజినెస్ పెట్టాలనే ఆలోచన వచ్చిన ఐదేండ్లకు 2011లో ఉద్యోగానికి రిజైన్ చేశాడు పురు. ఆరోగ్యం, సరైన ఆహారం తీసుకోవడానికి ఉన్న ఇంపార్టెన్స్‌పై అవగాహన కల్పించేందుకు ఒక స్టార్టప్ మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇద్దరూ కలిసి ‘హెల్దీ వరల్డ్’ పేరుతో ఒక కంపెనీ పెట్టారు. హెల్దీ ఫుడ్ బ్రాండ్స్‌కి ఒక అగ్రిగేటర్ ఇది. హెల్దీ ఫుడ్ బ్రాండ్స్ లిస్ట్ తయారు చేసి, వాటిని కాంటాక్ట్ చేయడం మొదలుపెట్టారు.
వాటి కోసం ఒక డిస్ట్రిబ్యూషన్ ఛానెల్‌ని క్రియేట్ చేసుకున్నారు. పురు ఎఫ్ఎంసీజీ(ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) బ్రాండ్స్‌లో కొన్నింటిని ‘గుడ్ ఫర్ యు’ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చాడు. శ్రీజిత్ తన హెచ్ఆర్ ఎక్స్‌పీరియెన్స్‌తో కార్పొరేట్ కెఫెటేరియాల్లోకి ఆ ప్రొడక్ట్స్ ఎంట్రీ అయ్యేలా చేశాడు. ఐటీ కంపెనీల ఉద్యోగులు వాళ్ల శ్నాకింగ్ ఛాయిస్‌లను మార్చుకోవాలనే లక్ష్యంతో కియోస్క్‌లను ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు.
మారథాన్ ఈవెంట్లకు హెల్దీ హ్యాంపర్లను క్రియేట్ చేశారు. వెంచర్‌ను మొదలుపెట్టిన ఆరు నెలల తర్వాత శ్రీజిత్ కూడా ఉద్యోగాన్ని వదిలేశాడు. అయితే కార్పొరేట్ కియోస్క్ మోడల్ పెద్దగా సక్సెస్ కావడం లేదని అర్థమైంది. దాంతో ఇద్దరూ మొదటి ఫెయిల్యూర్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే.. హెల్దీ శ్నాక్స్ తినేవాళ్ల సంఖ్య చాలా తక్కువ. పైగా.. ఆరోగ్యంగా తినాలనుకునే వాళ్లు ఇంటి నుంచి డబ్బాలు తెచ్చుకుంటున్నారు. కానీ.. వీళ్ల ప్రొడక్ట్స్ తినడం లేదు.
30 లక్షలు లాస్
కంపెనీ పెట్టిన ఆరు నెలల్లో దాదాఫు 30 లక్షల రూపాయల నష్టం వచ్చింది. దాంతో.. ఆర్థికంగా కష్టాలు మొదలయ్యాయి. అందుకే బిజినెస్ మోడల్ని మార్చేశారు. కార్పొరేట్ కియోస్క్‌ల నుండి కార్పొరేట్ వెల్‌నెస్ సొల్యూషన్స్ అందించేందుకు రెడీ అయ్యారు. వాళ్ల పోర్ట్‌ఫోలియోలోకి చాలా ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు. మెడికల్ చెకప్‌ల నుండి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వరకు కార్పొరేట్లకు పూర్తి వెల్‌నెస్ సొల్యూషన్స్‌ని తెచ్చారు. పైగా అమెజాన్ లాంటి ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్స్‌లో కూడా తమ ప్రొడక్ట్స్ అమ్మడం మొదలుపెట్టారు. దాంతో కస్టమర్ బేస్ బాగానే పెరిగింది.
ప్రొడక్ట్స్ పోర్ట్‌ఫోలియో 400 బ్రాండ్స్‌కు పైగా పెరిగింది. కానీ.. అనుకున్న స్థాయిలో లాభాలు మాత్రం రాలేదు. దాంతో.. కొన్ని చిన్న బ్రాండ్స్‌ని సంప్రదించారు. ‘మీ ప్రొడక్ట్స్‌ని ప్రైవేట్ లేబుల్ కింద అమ్ముకోవచ్చా?’ అని అడిగారు. అందుకు కొన్ని కంపెనీలు ఒప్పుకున్నాయి. ఆ ప్రొడక్ట్స్తోనే ‘ట్రూ ఎలిమెంట్స్’ పుట్టింది. రెండేండ్లలో ‘ట్రూ ఎలిమెంట్స్’ హెల్దీ వరల్డ్ కంటే ఎక్కువ అమ్మకాలు చేసింది.
దాంతో.. హెల్దీ వరల్డ్ నుండి ఎక్కువగా అమ్ముడవుతున్న బ్రాండ్స్‌ని కూడా 2016 నుంచి ‘ట్రూ ఎలిమెంట్స్’ లేబుల్‌తో అమ్మడం మొదలుపెట్టారు. కోట్లాది రూపాయల బ్రాండ్‌గా హెల్దీ వరల్డ్‌ని పక్కన పట్టేసి ఏడాదిలోనే ‘ట్రూ ఎలిమెంట్స్’ని కోట్లాది రూపాయల బ్రాండ్‌గా నిర్మించారు. దాంతో.. 2017 జులైలో ‘ట్రూ ఎలిమెంట్స్’ పూర్తిస్థాయి బ్రాండ్‌గా మారింది.
రోల్డ్ ఓట్స్, గ్రానొలా, షేక్స్ లాంటి శ్నాక్స్, చియా, గుమ్మడికాయ, అవిసె, పొద్దుతిరుగుడు, పుచ్చకాయ గింజలు, వేరుశెనగ గింజలు, డ్రై ఫ్రూట్స్, బెర్రీలు, మిల్లెట్స్ లాంటి ప్రొడక్ట్స్‌ని ట్రూ ఎలిమెంట్స్ ద్వారా అమ్ముతున్నారు. 2018 నుంచి ప్రైవేట్ లేబుల్ ప్రొడక్ట్స్ ఆపేసి 100 శాతం సొంత ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. అందుకోసం పూణేలో విశాలమైన ఫ్యాక్టరీ పెట్టారు. అక్కడ ప్రతి నెలా ఏడు లక్షలకు పైగా ప్రొడక్ట్స్ ఉత్పత్తి అవుతున్నాయి. వారి బెస్ట్ సెల్లర్స్ వోట్స్, చియా సీడ్స్.
పదిహేను వేలు మాత్రమే
పురు, శ్రీజిత్లకు సక్సెస్ అంత ఈజీగా రాలేదు. వాళ్ల 13 ఏళ్ల ప్రయాణం అంత సాఫీగా ఏం సాగలేదు. మొదట్లో ఇద్దరూ చాలా కష్టపడ్డారు. కొన్నేండ్ల పాటు అసలు జీతమే తీసుకోకుండా పనిచేశారు. ఆ తర్వాత నెలకు 15,000 రూపాయలు తీసుకోవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా 2016-–-17లో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డారు. అంతెందుకు కొడుకు స్కూల్ ఫీజు కట్టడానికి కూడా డబ్బు లేక శ్రీజిత్ అప్పులు చేశాడు. కానీ.. ఇప్పుడు ట్రూ ఎలిమెంట్స్ ఇచ్చిన సక్సెస్‌తో కోట్లు సంపాదిస్తున్నారు.
చిన్న ఆశ ఉంటే చాలు... ఏదైనా సాధించొచ్చు’ అని బలంగా నమ్మడం వల్లే ఫెయిల్ అయిన ప్రతిసారీ మళ్లీ ప్రయత్నించాం. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పట్టుదలతో అడుగులు ముందుకే వేశాం. కష్టనష్టాలు ఎదురైనప్పుడు లక్ష్యాన్ని వదులుకోవడం సరైన నిర్ణయం కాదు” అని శ్రీజిత్ మూలయిల్ తన సక్సెస్ సీక్రెట్‌ని పంచుకున్నాడు.