స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు కావొస్తున్నా దేశంలో పేదరికం, అసమానతలు ఇంకా తొలగిపోలేదు. దళితులు, అణగారిన, బహుజన వర్గాల్లోనే పేదలు ఎక్కువగా ఉన్నారు. ఏండ్లుగా ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప.. పేదల తలరాతలు మారడం లేదు. పార్టీలేవైనా వీళ్లను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి.. ఎన్నికల ముందు పథకాలు ప్రకటిస్తూ, పైసలు పంచుతూ, మందు, విందులతో మభ్యపెట్టి ఓట్లు దన్నుకుంటున్నాయి. దళిత, బహుజన వర్గాల ప్రజలు ఓటు విలువను గుర్తించనంత కాలం మార్పు రాదు. రాజ్యాధికారంతోనే బహుజనుల బతుకులు మారి నిజమైన స్వేఛ్చా స్వాతంత్ర్యం సిద్ధిస్తాయి.
దేశంలో 85 శాతంగా ఉన్న దళిత, బహుజనులకు స్వాతంత్ర్య ఫలాలు అందడం లేదు. రెండుపూటలా కడుపు నింపుకునే అవకాశం లేని పేదలు ఈ దేశంలో 30 కోట్లకు మించి ఉంటారు. లక్షల మంది నేటికీ రోడ్లు, ఫుట్ పాత్ లపై నిద్రిస్తున్నారు. అధికారికంగా సరైన లెక్కలు లేకపోయినప్పటికీ మన దేశంలో ఇంకా ఆకలిచావులు ఉన్నాయి. దేశజనాభాలో సగం మందికి కనీస వసతులు లేవు. బడిబాట పట్టని చిన్నారులు కోట్ల మంది ఉన్నారు. 85 శాతంగా ఉన్న దళిత, బహుజన వర్గాల ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువ. ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతమైన ఉద్యోగాల్లో చెప్పనక్కర్లేదు. నిమ్నవర్గాల వారికి ఎక్కడా సరైన అవకాశాలు దొరకడం లేదు. అన్ని రంగాల్లో అగ్రవర్ణాలదే పైచేయిగా మిగులుతోంది. ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు గిట్టుబాటు ధర దొరక్క అప్పుల పాలై.. చివరకు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. పేదలైన వృద్ధుల పరిస్థితి మరింత అధ్వానం. ఇండిపెండెన్స్‌డే సంబరాలను ఏటా ఘనంగా జరుపుకుంటున్నం. కానీ ఆ స్వాతంత్ర్య ఫలాలు ఎవరికి అందుతున్నాయనే దాన్ని గమనించడం లేదు. పాలకులు మాత్రం దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని ఊకదంపుడు ఉపన్యాసాలతో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు.
భారత్‌లో ఆకలి కేకలు..
ప్రపంచ ఆకలి సూచి (గ్లోబల్ హంగర్ ఇండెక్స్2019) రిపోర్ట్ ప్రకారం117 దేశాల్లో భారత్ 102వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలో తీవ్రమైన ఆకలి బాధను ఎదుర్కొంటున్న 45 దేశాల్లో ఇండియా కూడా ఉంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారత్ కంటే పాకిస్తాన్ 94వ స్థానంతో కాస్త మెరుగైన స్థితిలో ఉంది. 2014 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ జాబితాలో మొత్తం 77 దేశాల్లో భారత్ 55వ స్థానంలో ఉంది. మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ 88, శ్రీలంక 66వ స్థానాల్లో ఉండటం గమనార్హం. ఇండియాలో 6 నుంచి 23 నెలల వయసున్న చిన్నారుల్లో కేవలం 9.6 శాతం మంది చిన్నారులకు మాత్రమే కనీస పౌష్టిక ఆహారం అందుతోందని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వెల్లడించింది. మిగతా పిల్లల్లో పౌష్టిక ఆహార లోపం వల్ల వయసుకు తగ్గ బరువు, ఎత్తు ఉండటం లేదని తెలిపింది.20.8 శాతంతో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర స్థితిలో భారత్ ఉన్నట్టు రిపోర్ట్తెలిపింది. 75 ఏళ్ల సర్వసత్తాక, సార్వభౌమత్వంతో కూడిన భారతదేశంలో నేటికీ ఆకలి కేకలు వినిపిస్తున్నాయంటే తప్పెవరిది? పేదవారు పేదవారిగానే మిగిలిపోకూడదు. దళితులు, బహుజనులు మారాలి. తమ అభివృద్ధికి పాటు పడే వ్యక్తులు, పార్టీలకు మాత్రమే ఓటు వేయాలి. అప్పుడే దేశంలో
మార్పు వస్తుంది.
ఓటును కరెక్ట్‌గా సంధించినప్పుడే..
చాలా రాష్ట్రాల్లో అభివృద్ధి చెందిన కులాలే ఎక్కువ మొత్తంలో పాలితులుగా కొనసాగుతున్నాయి. అంబేద్కర్ మహాశయుడు దళిత, బహుజన వర్గాలకు ఓటు హక్కు అనే ఆయుధాన్ని చేతికిచ్చినప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే అధికారంలోకి వస్తున్నారు. పనికిరాని పథకాలకు, డబ్బుకు, మద్యం కోసం ఆశపడితే ఎప్పుడూ బానిసత్వంలోనే కొనసాగాల్సి వస్తుంది. ఆయా వర్గాలను తాగుబోతులుగా, ఎప్పుడూ చేయిచాచే వారిగా మార్చి, వారి ఆలోచనా శక్తిని దెబ్బతీయడం ద్వారా పాలకులు వీరిని రాజ్యాధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రల కారణంగానే దళితులు, బహుజనులు అధికారానికి చేరువ కాలేకపోతున్నారు. వీటిని ఛేదించనంత కాలం దళితులు, బహుజనులు అధికారానికి దూరంగానే ఉండిపోవాల్సి వస్తుంది. తద్వారా మనిషిగా కనీస అవసరాలు తీర్చుకో లేక.. ఆర్థికంగా ఎదగలేక ఆకలి మాటున పస్తులతో జీవనం సాగించాలి. మరి ఈ పరిస్థితి మారదా?... అంటే మారుతుంది!. దళితులు, బహుజనులు తమ ఓటు అనే అస్త్రంకు ఉన్న శక్తిని గుర్తించి.. ఆ ఓటును సరిగ్గా సంధించినప్పుడే జీవితాల్లో మార్పు వస్తుంది. దళితులు, బహుజనులు ఆ దిశగా అడుగులు వేయాలి.
పేదలే వెల్త్ క్రియేటర్స్
నిజానికి ఈ దేశ సంపద సృష్టికర్తలు పేదలే. వారి శ్రమతోనే దేశం పారిశ్రామికంగా పురోగమిస్తోంది. తద్వారా ఆర్థిక సంపద పెరుగుతోంది. పొద్దున నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు పేస్టు.. టీ పొడి.. బియ్యం, పప్పులు.. ఇలా నిత్యవసర సరుకులు.. పెట్రోలియం ఉత్పత్తులను వినియోగించడం ద్వారా ప్రభుత్వాలకు లక్షల కోట్ల పన్నులు చెల్లిస్తున్నారు. సంపన్నులైన వ్యాపారులు, ఉద్యోగులు మేము కట్టే పన్నులతోనే దేశానికి సంపద జమ అవుతుందని వాదిస్తుంటారు. కానీ వ్యాపారులు చెల్లించే పన్నులు వినియోగదారుడి జేబులోంచి వసూలు చేసేవే తప్ప వాళ్లు సొంతంగా ఒక్క రూపాయి కూడా కట్టరు. వినియోగదారుల నుంచి వసూలు చేసే పన్నులను పూర్తిగా ప్రభుత్వానికి చెల్లించకుండా ఎగవేసే వ్యాపారులకు ఈ దేశంలో కొదవ లేదు. తమ శ్రమ, సంపాదనతో దేశాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తున్న దళితులు, బహుజనులు మాత్రం అభివృద్ధి చెందడం లేదు.
జంగిటి వెంకటేష్, సీనియర్ జర్నలిస్ట్