డాన్స్ బాగా చేస్తాడు. ఫైట్స్ చేయడంలో ఎదురులేదు. యాక్టింగ్ అమేజింగ్. ‘కానీ... అవన్నీ తెరపై చూపించడానికి, నేను మంచి నటుడ్ని’ అని ప్రూవ్ చేసుకోవడానికి పదిహేనేండ్లు పట్టింది. ఇప్పటివరకు పడిన కష్టానికి, ఎదురుచూపులకు రిజల్ట్ రావడం మొదలైంది. అనుకోకుండా చివరి నిమిషంలో ‘సార్పట్టా’లో డాన్సింగ్ రోజ్ క్యారెక్టర్‌కి ఎంపికయ్యాడు. పర్ఫార్మెన్స్తో ఆడియెన్స్‌ని అలరించాడు. లేటెస్ట్గా ‘కింగ్ ఆఫ్ కొత’లో గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో నటించి.. మెప్పించాడు షబీర్ కల్లరక్కల్. అతని గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ సంగతులు..
‘‘నేను పుట్టి, పెరిగింది చెన్నైలో. మా పేరెంట్స్‌ది కోజికోడ్‌లోని వడకర అనే ఊరు. చిన్నప్పుడు క్రికెటర్ అవ్వాలనుకున్నా. చెన్నైలో క్రికెట్ లీగ్స్‌లో ఆడా. ఆ టైంలోనే తమిళ ‘ఆయత ఎజుతు’ (తెలుగు ‘యువ’) సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్‌గా కనిపించే ఛాన్స్ వచ్చింది. క్లైమాక్స్ సీన్ అది. సెట్స్‌కి వెళ్లి, హీరోయిన్ పక్కన ముందు వరసలో నిల్చున్నా. అందులో ఐదు సెకన్లు కనిపిస్తుందేమో నా ఫేస్. కొందరు సినిమా చూసి నన్ను గుర్తు పట్టారు. అలా నన్ను గుర్తుపట్టడం హ్యాపీగా అనిపించింది. దాంతో నాటకాలని ప్రొఫెషన్‌గా మార్చుకోవాలనుకున్నా. ఆ తర్వాత నా దృష్టి సినిమా వైపు మళ్లింది.
యాక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యాక మొదట డాన్స్ నేర్చుకున్నా. తర్వాత జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నా. ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయాలనే అవన్నీ నేర్చుకున్నా. 2009 నుంచి స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇచ్చా. అయితే రకరకాల స్కిల్స్ కలిపి ఒకే క్యారెక్టర్లో ఉండడం అనేది అరుదు. అలా నాకు ‘డాన్సింగ్ రోజ్’ వచ్చింది.
డాన్సింగ్ రోజ్
‘సార్పట్టా’ సినిమాలో డాన్సింగ్ రోజ్ క్యారెక్టర్లో చేశా. కాస్టింగ్ డైరెక్టర్ నిత్య ఫోన్ చేసి ఆ రోల్ గురించి చెప్పింది. ఆమె నాకు ‘అడంగ మరు’ సినిమా చేసేటప్పుడు పరిచయం. నాకు ఫైట్స్, సింగింగ్, డాన్సింగ్ స్కిల్స్ ఉన్నాయని తనకి తెలుసు. అందుకే ఆ క్యారెక్టర్ నాకు సరిపోతుందని ఆడిషన్‌కి పంపించింది. ఆడిషన్‌కి వెళ్లేటప్పటికి కథ, క్యారెక్టర్ గురించి పూర్తిగా తెలియదు. ‘ఈ క్యారెక్టర్‌కి ఫైట్ ఉంటుంద’ని మాత్రమే చెప్పారు. తీరికగా కూర్చుని స్క్రిప్ట్ చదివేంత టైం లేదు అప్పుడు. ఎందుకంటే నా కంటే ముందే ఆ రోల్‌కి వేరే వాళ్లని అనుకున్నారు. కానీ, అతనితో వర్కవుట్ కాలేదు. దాంతో వేరే వాళ్లు దొరుకుతారేమోనని చూస్తున్నారు. అప్పుడు నిత్య నాకు ఫోన్ చేసి ఆడిషన్‌కి వెళ్లమని చెప్పింది. షూటింగ్ మొదలయ్యే ముందు నేను ఆడిషన్‌కి వెళ్లా. చెప్పాలంటే ఆ మూవీ టీంలో చివరిగా యాడ్ అయింది నేనే.
ఈ సినిమాలో నా రోల్‌కి మేకప్, కాస్ట్యూమ్ చాలా హెల్ప్ అయ్యాయి. డైరెక్టర్ రంజిత్ క్యారెక్టర్ అప్పియరెన్స్‌లో చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. ఆయన అనుకున్నట్లే కనిపించాలి. అప్పుడే పర్ఫార్మెన్స్కి ప్లస్ అవుతుందని తెలిసింది నాకు. అలాగే సినిమా చూసేటప్పుడు నా క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా ఆడియెన్స్ ఇరిటేట్ ఫీలవుతారు. ‘ఎందుకు వచ్చాడ్రా వీడు? ఏం చేస్తున్నాడు?’ అని. అయితే, అలాంటి వ్యక్తి రింగ్‌లోకి దిగి ఫైట్ చేస్తుంటే అందరు షాక్ అయిపోయారు.
ఆ సీన్ థియేటర్లో చూసిన నాకే ఒళ్లు జలదరించింది. ఒక్క నిమిషం అక్కడున్నది నేనే అని మర్చిపోయా. థియేటర్లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి.. ఎగ్జైటింగ్‌గా అనిపించింది. చాలా హ్యాపీగా ఫీలయ్యా. నేను నాటకాల్లో నటించేవాడిని. కాబట్టి.. ఆడియెన్స్ ముందు లైవ్ పర్ఫార్మెన్స్ చేయడం నాకేం కొత్త కాదు. ‘సార్పట్టా’ సినిమాలో ఫైట్ సీన్ జనాల మధ్యలో తీశారు. ఆడియెన్స్ రెస్పాన్స్ కూడా పర్ఫార్మెన్స్ మీద రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ సినిమాలో నేను, ఆర్య ఫైట్ చేసే సీన్ లైవ్ ఆడియెన్స్ మధ్య తీయడం నాకు చాలా హెల్ప్ అయింది. అలాగే స్పాట్లో మూమెంట్స్, స్టయిల్ విషయంలో ఇంప్రువైజేషన్స్ చేశాం.
బాక్సింగ్ సీన్ పూర్తిగా కొరియోగ్రఫీ చేయలేదు. ఆర్య చాలా మంచి బాక్సర్. నేను కూడా కిక్ బాక్సింగ్‌లో ట్రైనింగ్ తీసుకున్నా. కాబట్టి ఆ సీన్స్ బాగా వచ్చాయి. ఇదంతా ఒక ఎత్తయితే... ‘సార్పట్టా’లో ఒక ఎమోషనల్ సీన్ ఉంది. అది ఫైనల్ ఎడిటింగ్‌లో కట్ చేశారు. ‘సీన్ బాగుంది. కానీ, సినిమా లెంగ్త్ దృష్టిలో పెట్టుకుని కట్ చేయాల్సి వచ్చింది’ అని చెప్పారు. డైరెక్టర్ నా క్యారెక్టర్ని బాగా డిజైన్ చేశారు. అందువల్ల ఆ సీన్ లేకపోయినా ఆడియెన్స్‌కి నా రోల్ గుర్తుండిపోయింది.
మెయిన్ విలన్ అవకాశం..
‘సార్పట్టా’ ఛాన్స్ రాకముందు నేను వేరే ప్రాజెక్ట్‌కి సైన్ చేశా. అయితే, ఆ తర్వాత సినిమా పది రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుంటుంది అనగా నాకు ఈ అవకాశం వచ్చింది. దీనికి సైన్ చేయడంతో ముందు ‘ఓకే’ చేసిన మూవీ నుంచి తప్పుకోవాలని ఒక మెసేజ్ వచ్చింది. అది చూసి చాలా అప్సెట్ అయ్యా. ఎందుకంటే ఆ మూవీలో నేను మెయిన్ విలన్. ‘సార్పట్టా’లో పని మొదలుపెట్టేవరకు నా క్యారెక్టర్ ఏంటో నాకు పూర్తిగా తెలియదు. కానీ ఈ రోజున డాన్సింగ్ రోజ్ నా ఐడెంటిటీ అయింది.
పాత్ర కోసం పన్ను తీయించుకున్నా!
ఈ సినిమా కోసం పన్ను తీయించుకున్నా. యాక్టర్‌గా నేను నా బెస్ట్ ఇవ్వాలనుకుంటా. నాకంటే మంచి యాక్టర్స్ ఉన్నారు. టాలెంట్ ఉన్నవాళ్లు చాలామందే ఉన్నారు. కానీ, అవకాశం నా దగ్గరకి వచ్చింది. అలాంటప్పుడు నేను దానికోసం నాకు చేతనైనంత చేయాలి అనుకున్నా. ఈ సినిమా కోసం ఫుట్‌బాల్ నేర్చుకున్నా. నాకు ఫుట్‌బాల్ ఆడడం రాదు.. కానీ ‘కన్నన్’ క్యారెక్టర్ ఆట ఆడాలి. అందుకని రోజూ రాత్రి పదిగంటల తర్వాత ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేశా. ఇదే కాదు.. ‘సార్పట్టా’లో కూడా బాక్సింగ్ ప్రాక్టీస్ చేసే సెట్‌కి వెళ్లా. ఇదంతా పక్కన పెడితే.. సినిమాలో క్యారెక్టర్ గురించి పన్ను తీయించుకోవడం పెద్ద విషయమే. కాకపోతే ఇకపై అలాంటి పనులు చేయను.
ఆ పాత్రల్లో చేయాలని ఉంది
ఈ సినిమా ద్వారా మలయాళంలో నా జర్నీ మొదలైంది. ఇప్పటికే మరో రెండు పెద్ద ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యా. ఈ సినిమాకి నెగెటివ్ రిజల్ట్ వచ్చిన మాట వాస్తవమే. కానీ, అందుకని మిగతా సినిమాలు చేయకుండా ఉండడం కరెక్ట్ కాదు. రివ్యూలు వస్తుంటాయి. ఆ రివ్యూలు చూసి ఆగిపోవడం సరికాదు. ఒకవేళ వాళ్లు నిజంగా మంచి విషయాలు సజెస్ట్ చేస్తే, వాటిని ఇంప్రూవ్ చేసుకోవడంలో తప్పు లేదు.
నేను స్ట్రాంగ్ విలన్ కాదని చాలామంది రాశారు. అయితే విలన్ అనేవాడు చూడ్డానికి భయంకరంగా ఉండక్కర్లేదు అనేది నా అభిప్రాయం. రియల్ లైఫ్‌లో కొందరు చాలా సింపుల్‌గా, నార్మల్‌గా ఉంటారు. కానీ వాళ్లు నిజంగా చాలా డేంజరస్. అలాంటి విలన్ని ఇందులో చూపించాలనుకున్నాం. విలన్స్ అనగానే భయంకరంగా కనపడక్కర్లేదు. ఒకవేళ ప్రేక్షకులు విలన్ అంటే అలానే కనిపించాలి అంటే అలానే చేస్తా.
అలాంటి రోల్ కూడా ఇప్పుడు కన్నడలో చేస్తున్నా. ‘కింగ్ ఆఫ్ కొత’ సెట్స్ చూసి నాటకాలు వేసిన రోజులు గుర్తొచ్చాయి నాకు. ఇందులో నాది గ్రే షేడ్స్ ఉన్న రోల్. ఇకపై కూడా అలాంటి క్యారెక్టర్స్ చేయాలనుంది. ఎందుకంటే రియల్ లైఫ్‌లో మనుషులు అలానే ఉంటారు. సినిమా రిలీజ్ అయిన రాత్రి నాకు నిద్ర పట్టదు. తెల్లవారగానే బీచ్‌కి వెళ్లి వాకింగ్ చేస్తా. టైం గురించి పట్టించుకోకుండా సముద్రాన్ని చూస్తూ గంటల తరబడి అక్కడే కూర్చుంటా. అప్పుడు నా మైండ్‌లో బోలెడు విషయాలు తిరుగుతుంటాయి. ఆ టైంలో నాలో కలిగే ఫీలింగ్స్ మాటల్లో చెప్పడం కష్టం’’ అని సినిమా ప్రయాణం గురించి చెప్పాడు.
‘కింగ్ ఆఫ్ కొత’ విషయాలు..
ఈ సినిమా స్టోరీ లైన్ నాకు చెప్పగానే బాగా నచ్చింది. దాంతో ఈ ప్రాజెక్ట్ ‘ఓకే’ అన్నా. ఆ తర్వాత ఇందులో దుల్కర్ సల్మాన్, గోకుల్ సురేశ్ ఉన్నారని తెలిసి మంచిగా అనిపించింది. దుల్కర్ ఎప్పుడూ థీమ్స్ గురించి డిస్కస్ చేస్తుంటాడు. సీన్ చేస్తున్నప్పుడు ‘నేను కంఫర్టబుల్‌గా ఉన్నానా? లేదా?’ అని అడిగేవాడు. గోకుల్ సురేశ్ చాలా మంచివ్యక్తి. ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది.
నేను మలయాళంలో చేసిన ఫస్ట్ మూవీ అదే. అయినా కూడా కొత్తగా చేస్తున్నట్టు అనిపించలేదు. నేను ఆ ఇండస్ట్రీలో వాడినే అనిపించింది. ఈ సినిమా ద్వారా నాకు, దుల్కర్‌కి మంచి స్నేహం ఏర్పడింది. సినిమాలో ఉన్న డైలాగ్, లుక్ వంటి చిన్న విషయాల గురించి కూడా మాట్లాడుకునేవాళ్లం. క్లైమాక్స్ డైలాగ్ గుర్తుచేసుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి నాకు. ఆ సీన్స్ అంత బాగా రావడానికి కారణం మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదరడమే.
అమ్మకి ఇష్టం లేదు
ఇండస్ట్రీలో నాకు గాడ్ ఫాదర్ ఎవరూ లేరు. మా అమ్మకి సినిమాలు చూడటం చాలా ఇష్టం. కానీ, నేను సినిమాల్లో యాక్టింగ్ చేయడం ఆమెకి ఇష్టం లేదు. ఇప్పటివరకు నేను నటించిన ఒక్క సినిమా కూడా అమ్మ చూడలేదు. అది ఆమె ఇష్టం.. దాన్ని నేను గౌరవిస్తాను. మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం. నాకోసం ఏమైనా చేస్తుంది. నా సినిమాలు చూడటం తప్ప. అందుకే మేం సినిమాల గురించి మాట్లాడుకోం. నాన్నకి సినిమాలు చూడటమంటే ఇష్టం. ఆయన నా సినిమాలు చూస్తారు. కానీ, ఎలా చేశానో చెప్పరు. వాళ్ల కొలీగ్స్‌తో చెప్తుంటారు.
సినిమా కెరీర్
2004లో వచ్చిన మణిరత్నం ‘యువ’ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించా. పదేండ్ల తర్వాత 2014లో ‘నెరుంగి వా ముత్తమిడాతే’ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ చేశా. తర్వాత ‘54321’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో నటించా. కానీ, వీటితో పెద్దగా గుర్తింపు రాలేదు. మంచి క్యారెక్టర్ కోసం పదిహేనేండ్లు ఓపికగా ఎదురుచూశా. ఆ టైంలో ఆక్రోబాట్, డాన్స్, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. తమిళ, తెలుగు, మలయాళం సినిమాల్లో మంచి రోల్స్ చేయాలని ఎదురుచూస్తున్నా.