![కార్మికులు పనిచేయడానికి ఇష్టపడట్లే: ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రమణియన్ వివాదాస్పద కామెంట్](https://static.v6velugu.com/uploads/2025/02/truly-disheartening-l-and-t-hr-head-defends-chairman-amid-90-hour-workweek-row_92LNyiHdSO.jpg)
న్యూఢిల్లీ: ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పనిచేయాలని కామెంట్ చేసి విమర్శల పాలైన ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణియన్ తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతీయ కార్మికులు పనిచేయడానికి ఇష్టపడడం లేదని, తమ ప్రాంతం నుంచి వేరే చోటుకు వెళ్లడం లేదని అన్నారు. ముఖ్యంగా నిర్మాణ రంగంలో కార్మికులు దొరకడం కష్టంగా మారిందన్నారు. ఉపాధి హామీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్, జన్ ధన్ ఖాతాలు తదితర సంక్షేమ పథకాలే ఇందుకు కారణం కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళవారం చెన్నైలో నిర్వహించిన సీఐఐ మిస్టిక్ సౌత్ గ్లోబల్ లింకేజెస్ సమిట్లో ఆయన మాట్లాడారు.
‘‘ఉద్యోగ, ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ వేరే ఊళ్లకు వెళ్లేందుకు జనం ఇష్టపడడంలేదు. బహుశా వారికి స్థానికంగా మంచి ఉపాధి అవకాశాలు దొరుకుతుండొచ్చు, లేదా ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ ఫథకాలు కారణమై ఉండొచ్చు. దీని వల్ల వర్క్ ఫోర్స్ దొరకడంలేదు. దేశ మౌలిక, నిర్మాణ రంగంలో కార్మికుల కొరత నెలకొంది. దీని ప్రభావం భవిష్యత్తులో తీవ్రంగా ఉండనుంది.
విదేశాల్లో ఉద్యోగాలు, ఉపాధి కోసం జనం వలస వెళుతుంటారు. మన దేశంలో మాత్రం వేరే ప్రాంతాలకు వెళ్లడం లేదు” అని సుబ్రమణియన్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా జీతాలను సవరించాల్సిన అవసరం ఉందని అంగీకరించారు. మన దగ్గర తక్కువ వేతనాలు ఉండడం వల్లే కార్మికులు పశ్చిమాసియా దేశాలకు వలస వెళుతున్నారని, ఇక్కడ పొందే జీతం కన్నా అక్కడ మూడున్నర రెట్లు ఎక్కువ పొందుతున్నారని సుబ్రమణియన్ చెప్పారు.