కశ్మీర్​కు ‘సాయం’ ఎందుకు?

ఇండియా, పాకిస్తాన్ మధ్య నెలకొన్న కాశ్మీర్ వివాదానిది 70 ఏళ్ల చరిత్ర. కాశ్మీర్ పూర్తిగా రెండు దేశాలకు సంబంధించిన అంశం. అమెరికా లేదా యునైటెడ్ నేషన్స్ వంటి వాటికి ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు.ఈ విషయాన్ని మన దేశ నాయకులు చాలాసార్లు తెగేసి చెప్తున్నారు.అయినా మూడో దేశం మధ్యవర్తిత్వం కోరడం, అంతర్జాతీయంగా తన పరువు తానే తీసుకోవడం పాకిస్తాన్​కు అలవాటే. లేటెస్ట్​గా అమెరికా నోటి వెంట మళ్లీ పాత పాట పాడించింది పాకిస్తాన్.

ప్రపంచమంతా ఇండియా వైపే

కాశ్మీర్ ఇష్యూపై ప్రపంచ దేశాలన్నీ ఇండియాకే అండగా నిలిచాయి. ఇండియా వైఖరికి ప్రపంచం  ఆమోదం కూడా లభించింది. ఒక్క టర్కీ మినహా మరే దేశమూ పాకిస్తాన్ వెంట లేవు.అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఏకాకి అయింది. అమెరికా కూడా ఈ విషయాన్ని గుర్తించింది. అందుకే ‘మధ్యవర్తిత్వం ’ అనే మాటను పక్కన పెట్టి ‘సాయం’ అనే మాట వాడింది. కాశ్మీర్​ అంశంలో ప్రపంచ దేశాల ఆమోదం పొందడం తప్పకుండా ఇండియా ఘనవిజయంగానే భావించాలి.

కాశ్మీర్ విషయంలో అమెరికా అనవసర ఆసక్తి చూపడం ఇప్పటికీ మానడం లేదు. ఇది నూటికి నూరుశాతం రెండు దేశాలకు సంబంధించిందని, మూడో దేశం జోక్యం అనవసరమని  మన దేశ నాయకులు  ఇప్పటికే అనేకసార్లు చెప్తున్నా పరిస్థితి మారట్లేదు.  ఈ మాట చెప్పగానే అమెరికా సైలెంట్ అయిపోతుంది. మళ్లీ  కొన్ని వారాలకు లేదా కొన్ని  నెలలకు ‘రెండు దేశాలు అంగీకరిస్తే మధ్యవర్తిత్వానికి రెడీ’ అంటూ పాత పాట అందుకుంటుంది. అయితే, ఈసారి అమెరికా  ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్  రూట్ మార్చారు. ‘ మధ్యవర్తిత్వం (మీడియేషన్​)’ లేదా ‘జోక్యం (ఇంటర్వీన్​)’ అనే మాటలను ఎక్కడా ప్రస్తావించలేదు. కొత్తగా ‘సాయం (హెల్ప్​)’ అనే పదం   వాడారు. ఇండియా, పాకిస్తాన్ ల మధ్య 70 ఏళ్లుగా  ఉన్న కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించడానికి అవసరమైతే అమెరికా ‘సాయం’ చేస్తుందన్నారు. “అది కూడా రెండు దేశాలు అంగీకరిస్తేనే ” అనే ట్యాగ్ లైన్ వాడారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య టెన్షన్​ లేదని ఒప్పుకున్నారు. రెండు వారాల కిందట బాగా టెన్షన్ వాతావరణం ఉండేదన్నారు ట్రంప్. అప్పటి పరిస్థితితో పోల్చితే చాలామేరకు టెన్షన్లు తగ్గాయన్నారు. సమస్యను పరిష్కరించడానికి ‘సాయం’ మాత్రమే తాను అందిస్తానని ట్రంప్ చెప్పారు.

ఈ ఏడాది జూలై 22న  కూడా ‘‘మధ్యవర్తిత్వానికి రెడీ” అంటూ ట్రంప్  ఓ ప్రకటన చేశారు.ప్రధాని మోడీ కోరితే, తాను రంగంలోకి దిగుతానన్నారు. పాక్​ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన అమెరికా టూర్​లో భాగంగా ట్రంప్​తో సమావేశమయ్యాక… కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవడానికి ఆసక్తి చూపుతూ ట్రంప్ ఆ ప్రకటన చేశారు. దీనికి మనదేశం  వెంటనే రియాక్టయింది. డొనాల్డ్ ట్రంప్ స్టేట్​మెంట్​ కరెక్ట్ కాదని ఓపెన్ గానే చెప్పింది. దీంతో అమెరికా హడావిడిగా దిద్దుబాటుకు దిగింది.

నెల రోజుల తర్వాత మళ్లీ అదే పాట

కాశ్మీర్​పై మధ్యవర్తిత్వం చేసే ప్రసక్తే లేదని జూలైలో కుండబద్దలు కొట్టిన ట్రంప్, ఆగస్టు వచ్చే నాటికి మళ్లీ పాత పాటే అందుకున్నారు. ఆగస్టు నెలలో బియారిట్జ్​ (ఫ్రాన్స్)లో జరిగిన జి 7 సమ్మిట్ సందర్భంగా మోడీతో ట్రంప్ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. ‘ఇండియా, పాక్​ల మధ్య ఏళ్ల తరబడి ఉన్న కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది’ అన్నారు. ఈసారి కూడా ట్రంప్ కు మోడీ గట్టిగానే జవాబిచ్చారు.

అమెరికాపై  పాక్ ఒత్తిడి?

అమెరికా అత్యుత్సాహాన్ని చూస్తే  ఆ దేశంపై పాకిస్తాన్ ఒత్తిడి తీసుకు వస్తున్నట్లు అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ పాలనపై  ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని అక్కడి ఎనలిస్టులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజల దృష్టిని వేరే అంశాలపైకి మరల్చడం పాక్​ పాలకులకు కొత్త కాదు. అందుకే కాశ్మీర్ అంశాన్ని పాక్‌ ప్రభుత్వం తెరమీదకు తీసుకువచ్చిందంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు.