
F1 Visa News: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎంట్రీ నాటి నుంచి భారతీయ విద్యార్థులతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు అమెరికాలో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఏ రోజు తమ వీసాలు క్యాన్సిల్ చేస్తారో అనే భయం వారిని వెంటాడుతూనే ఉంది. ఇటీవల చాలా మంది యూనివర్సిటీ విద్యార్థులకు అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు సెల్ఫ్ డిపోర్టేషన్ అవ్వాలంటూ మెయిల్స్ పంపిన సంగతి తెలిసిందే.
గడచిన కొన్ని రోజులు అమెరికాలోని డజన్ల మంది భారతీయ విద్యార్థుల ఎఫ్-1 వీసాలను అధికారులు తిరస్కరిస్తున్నారు. వారు చేసిన చిన్న తప్పులను కారణాలుగా చూపుతూ సెల్ఫ్ డిపోర్టేషన్ కావాలంటున్నారు. దీంతో అమెరికాలోని మిస్సోరీ, టెక్సాస్, నెబ్రాస్కా విశ్వవిద్యాలయాల్లోని స్టూడెంట్స్ ప్రభావితం అయ్యారు. దీనికి ముందు గతవారం అధికారులు కాలేజీల్లో చేపట్టిన కొన్ని నినాదాలకు సపోర్ట్ చేసినందుకు ఇలాంటి మెయిల్స్ అందుకున్నారు.
Also Read : అమెరికాలో రెండు నెలలకే తిరగబడ్డ జనం
ట్రాఫిక్స్ రూల్స్ పాటించనందుకు, ఓవర్ స్పీడింగ్, లైసెన్స్ సూపర్వైజర్ లేకుండా లెర్నర్స్ పర్మిట్ పై కారు నడిపటం వంటి చిన్న తప్పులకు సైతం విద్యార్థుల వీసాలను అమెరికాలోని అధికారులు క్యాన్సిల్ చేయటం ఆందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. డిజైన్డ్ స్కూల్ అఫీషియల్స్ చాలా మంది విద్యార్థుల పేర్లను విద్యార్థి అండ్ ఎక్స్‌ఛేంజ్ విజిటర్ సమాచార వ్యవస్థ నుంచి తొలగించినట్లు మెయిల్స్ పంపటం కలకలం రేపింది. దీంతో వారు అమెరికాలో నివసించటం చట్టరీత్యా కుదరదు. సదరు విద్యార్థుల వీసా నిరాకరణకు గురైనందున వారు తిరిగి స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం అమెరికాలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జంప్ అయిన చిన్న కేసుల వల్ల కూడా వీసా కోల్పోయిన భారతీయ విద్యార్థులు చాలా మంది తనను సంప్రదిస్తున్నారని టెక్సాలోని ఒక లాయర్ వెల్లడించారు. సుమారు 30 వరకు ఇలాంటి కేసులను తాను చూస్తున్నట్లు పేర్కొన్నారు. పైగా ఇండియాకు చెందిన విద్యార్థుల నుంచి ఎక్కువగా ఇలాంటి కేసులు తన వద్దకు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వీరిలో చాలా మంది దాదాపు ఏడాది కింద అవి జరిగాయని ఇప్పటివి కాదని చెబుతున్నారు. ఒక విద్యార్థి వాల్ మార్ట్ నుంచి సరకులు దొంగించిన కేసులో క్లీన్ చిట్ వచ్చినప్పటికీ ప్రస్తుతం డిపోర్టేషన్ కి గురైనట్లు వెల్లడైంది. ఈ క్రమంలో యూనివర్సిటీలు సైతం విద్యార్థులను వెంటనే లీగల్ హెల్ప్ తీసుకుని ముందుకు సాగాలని సూచిస్తున్నారు. ఇలా అయితే అమెరికా కల కష్టమేనని చాలా మంది భారతీయ యువత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.