ట్రంప్ లేఆఫ్స్:1600 మంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై తొలగింపు 

ట్రంప్ లేఆఫ్స్:1600 మంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై తొలగింపు 
  • యూఎస్ఎయిడ్​ఉద్యోగులపై ట్రంప్ వేటు
  • 1600 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలు
  • మరో 4600 మందికి లాంగ్ పెయిడ్ లీవ్​నోటీసులు

వాషింగ్టన్: ప్రభుత్వ ఖర్చుల నియంత్రణలో భాగంగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్(యూఎస్ఎయిడ్) ఉద్యోగులపై వేటు వేశారు. ఏకంగా 1600 మంది ఉద్యోగులను తొలగించారు. ప్రపంచవ్యాప్తంగా యూఎస్ ఎయిడ్ తరఫున పనిచేస్తున్న మరో 4600 మంది ఉద్యోగులకు లాంగ్ పెయిడ్ లీవ్ పై వెళ్లాలంటూ నోటీసులు జారీ చేశారు.

సంస్థ నిర్వహణకు సంబంధించిన అత్యవసర సిబ్బంది మినహా మిగతా అందరికీ ఈ నోటీసులు అందినట్లు సమాచారం. ఆదివారం రాత్రి ఈ విషయాన్ని యూఎస్ ఎయిడ్ వెబ్ సైట్ నిర్ధారించింది. తొలుత 2 వేల మంది ఉద్యోగులను తొలగిస్తారంటూ ప్రచారం జరిగింది. దీనిపై అమెరికా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కోర్టులను ఆశ్రయించాయి. ప్రభుత్వ ఉత్తర్వులపై తాత్కాలికంగానైనా స్టే విధించాలని అభ్యర్థించాయి.

అయితే, విచారణకు నిరాకరిస్తూ ఫెడరల్ జడ్జి ఈ పిటిషన్ ను కొట్టేశారు. దీంతో ఉద్యోగుల తొలగింపు విషయంలో ప్రభుత్వానికి అవాంతరాలు తొలగినట్లైంది. ఈ క్రమంలోనే ట్రంప్ సర్కారు ఆదివారం రాత్రి యూఎస్ ఎయిడ్ ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులను జారీ చేసింది.

అయితే, చివరి నిమిషంలో 2 వేల మందిని కాకుండా 1600 మందిని తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికాలో కేవలం 600 మంది ఉద్యోగులను మాత్రమే కొనసాగిస్తున్నట్లు యూఎస్ ఎయిడ్ డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ పీటె మారాకో మీడియాకు తెలిపారు.