
- వారిలో ఇండియన్సే ఎక్కువ
వాషింగ్టన్: గడిచిన ఒక్క నెలలోనే వెయ్యి మంది విదేశీ విద్యార్థుల వీసాలను ట్రంప్ సర్కారు రద్దు చేసింది. అమెరికా అధ్యక్షుడిగా తాను ప్రమాణం చేసినప్పటి నుంచి అక్రమ వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలో చదువుకుంటున్న ఫారిన్ స్టూడెంట్లపైనా ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు. గడిచిన కొన్ని వారాల్లోనే వెయ్యి మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసా లేదా వారి చట్టబద్ధ హోదాలను తొలగించారు.
దీంతో ట్రంప్ తీరును నిరసిస్తూ బాధిత విద్యార్థులు కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. వీసాల రద్దులో ట్రంప్ సర్కారు సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అసలు తమ వీసాలను రద్దు చేయడానికి ట్రంప్ సర్కారు వద్ద సరైన కారణాలు లేవని పేర్కొంటున్నారు. మరోవైపు వీసాలు రద్దయిన విదేశీ విద్యార్థులకు డిపోర్టేషన్ గండం పొంచి ఉంది.
ముఖ్యంగా హార్వర్డ్, స్టాన్ ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్, ఓహియో వర్సిటీ విద్యార్థులకు ఈ ముప్పు ఎక్కువగా ఉంది. గత నెల చివరి వారం నుంచి ఇప్పటి వరకు 160 కాలేజీల నుంచి 1024 మంది విద్యార్థుల వీసాలు రద్దయినట్లు అసోసియేటెడ్ ప్రెస్ అంచనా వేసింది. కాగా.. వీసాలు రద్దయిన విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది (దాదాపు 50 శాతం) ఇండియన్ స్టూడెంట్లే ఉన్నారు.
గాజాకు వెళ్లివచ్చిన వారిపై ప్రత్యేక నిఘా
2007 జనవరి 1 నుంచి గాజాకు వెళ్లి అమెరికాకు వచ్చిన వారిపై ట్రంప్ సర్కారు ప్రత్యేక నిఘా వేసింది. అలాంటి వారి అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది. అన్ని రకాల యూఎస్ వీసాకు ఈ రూల్ ను వర్తింపజేసింది.