ట్రంప్ యూటర్న్.. ఫోన్లు, ల్యాప్‌‌టాప్‌‌లు, చిప్‌‌లపై టారిఫ్‌‌లు రద్దు

ట్రంప్ యూటర్న్.. ఫోన్లు, ల్యాప్‌‌టాప్‌‌లు, చిప్‌‌లపై టారిఫ్‌‌లు రద్దు

న్యూఢిల్లీ: టారిఫ్‌‌లపై ట్రంప్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. చైనాతో సహా వివిధ దేశాల నుంచి  దిగుమతి చేసుకుంటున్న  స్మార్ట్‌‌ఫోన్‌‌లు, కంప్యూటర్లు, రూటర్లు, స్విచ్‌‌లు, ట్రాన్సిస్టర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌‌ ప్రొడక్ట్‌‌లపై తాజాగా విధించిన టారిఫ్‌‌లను తొలగించింది. అంటే చైనాపై వేసే 125 శాతం టారిఫ్ కూడా వీటిపై పడదు. అలానే చాలా దేశాలపై వేయాలని నిర్ణయించిన 10 శాతం బేస్ టారిఫ్‌‌ కూడా పడదు. టారిఫ్‌‌లను ఎత్తేయడంతో యాపిల్, శామ్‌‌సంగ్ వంటి కంపెనీలు లాభపడతాయి.

 70 కి పైగా దేశాలపై ట్రంప్ ప్రభుత్వం తాజాగా టారిఫ్‌‌లు వేసిన విషయం తెలిసిందే.  ఇన్‌‌ఫ్లేషన్ పెరుగుతుందనే భయంతో యూఎస్‌‌లో ఆందోళనలు నెలకొన్నాయి. చాలా మంది రోడ్ల మీదకి వచ్చి ట్రంప్‌‌కు వ్యతిరేకంగా ర్యాలీలు చేస్తున్నారు. వ్యాపారులు కూడా భయపడుతున్నారు. వీరిని శాంతిపరచడానికి ఎలక్ట్రానిక్స్ గూడ్స్‌‌పై  టారిఫ్‌‌లను ఎత్తేశారని ఎనలిస్టులు భావిస్తున్నారు.

వీటికి మినహాయింపు..

స్మార్ట్‌‌ఫోన్‌‌లు, ల్యాప్‌‌టాప్‌‌లు, హార్డ్ డ్రైవ్‌‌లు, ప్రాసెసర్‌‌లు, మెమరీ చిప్‌‌లు, మెషీన్ పార్టులతో సహా వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులకు టారిఫ్‌‌ల నుంచి మినహాయింపు ఇచ్చారు. వీటిలో చాలా ప్రొడక్ట్‌‌లు యూఎస్‌‌లో తయారు కావడం లేదు. వీటి తయారీ కోసం సప్లయ్ చెయిన్ మెరుగుపరచాలంటే ఏళ్లు పడతాయి. సెమీకండక్టర్ తయారీలో ఉపయోగించే మెషీన్స్‌‌కు కూడా మినహాయింపు ఇచ్చారు. ఈ మినహాయింపు తాత్కాలికం కావొచ్చు.  కానీ, చైనీస్ గూడ్స్‌‌పై టారిఫ్‌‌లు తగ్గొచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి.