విదేశీ వాహనాలపై 25 శాతం ట్యాక్స్​..ఏప్రిల్ 2 నుంచి అమలు

విదేశీ వాహనాలపై 25 శాతం ట్యాక్స్​..ఏప్రిల్ 2 నుంచి అమలు
  • ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి తెస్తాం: ట్రంప్
  • అమెరికాలోనే తయారయితే నో ట్యాక్స్
  • దేశీయ ఆటోమొబైల్ ఇండస్ట్రీని బలోపేతం చేస్తామని వెల్లడి
  • టిక్​టాక్ ను అమ్మితే టారిఫ్​లు తగ్గిస్తామని చైనాకు ఆఫర్ 

వాషింగ్టన్: విదేశాల్లో తయారై అమెరికాకు దిగుమతి అయ్యే వాహనాలపై 25 శాతం పన్ను విధిస్తున్నట్లు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ట్యాక్స్ శాశ్వతంగా ఉంటుందని తేల్చి చెప్పారు. అమెరికాలో తయారయ్యే వెహికల్స్​పై మాత్రం ఎలాంటి ట్యాక్స్ ఉండదన్నారు. దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.  ఏప్రిల్‌‌ 2 నుంచి ఈ 25 శాతం ఇంపోర్ట్ ట్యాక్స్ అమల్లోకి వస్తుందన్నాప్పారు. కాగా, ట్రంప్  నిర్ణయంతో గ్లోబల్ సప్లై చైన్​  దెబ్బతింటుందని  నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లు యథావిధిగా కొనసాగితే.. అమెరికాకు ఏడాదికి  రూ.8.50 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని యూఎస్ ఆటో తయారీ సంస్థలు తెలిపాయి. కొనుగోళ్లు భారీగా పడిపోయే అవకాశం ఉందని చెప్పాయి. కాగా,  చైనాపై టారిఫ్‌‌ల విషయంలో ఆ దేశానికి ట్రంప్‌‌ ఓ ఆఫర్‌‌ ప్రకటించారు. షార్ట్‌‌ వీడియో యాప్‌‌ టిక్‌‌టాక్‌‌  ను తమకు అమ్మేస్తే టారిఫ్‌‌లు తగ్గిస్తామన్నారు. అవసరమైతే ఒప్పందం గడువును కూడా పెంచుతామని చెప్పారు. కాగా, టిక్‌‌టాక్‌‌ను నిషేధిస్తున్నట్లు అమెరికా ఇప్పటికే ప్రకటించింది. జనవరి 18న ఆ యాప్‌‌ను ప్లే స్టోర్ల నుంచి గూగుల్, యాపిల్‌‌ తొలగించాయి.  మరోవైపు ట్రంప్ తాజా టారిఫ్​పై కెనడాతోపాటు యూరోపియన్ దేశాలు విమర్శలు గుప్పించాయి. 

ఇండియాను చైనా, కెనడా, మెక్సికోలా ట్రీట్ చేయం 

చైనా, కెనడా, మెక్సికోతో ఇండియాను చూడబోమని అమెరికా పేర్కొన్నది. ట్రంప్ విధించిన పరస్పర సుంకాలు ఏప్రిల్‌‌ 2 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఇండియా, అమెరికా మధ్య వాణిజ్యపరమైన ఒప్పందానికి సంబంధించిన చర్చలు ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. అమెరికా ట్రేడ్ ఆఫీసర్ బ్రెండన్‌‌ లించ్‌‌ తన బృందంతో కలిసి ఇండియా వచ్చారు. ఈ సందర్భంగా ఇండియాను ఉద్దేశిస్తూ ఆయన కీలక కామెంట్లు చేశారు. ‘‘ట్రంప్‌‌ పాలనలో చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాలతో ఇండియాను కలిపి చూడటం లేదు. ఆ దేశాలతో కరెన్సీ అవకతవకలు, అక్రమ వలసలు, ఇతర  సమస్యలు ఉన్నాయి’’అని వివరించారు.