మీరెంత వేస్తే మేమంత వేస్తం..టారీఫ్ లపై అన్ని దేశాలకు తేల్చి చెప్పిన ట్రంప్

మీరెంత వేస్తే మేమంత వేస్తం..టారీఫ్ లపై  అన్ని దేశాలకు తేల్చి చెప్పిన ట్రంప్
  • టారిఫ్​లపై అన్ని దేశాలకు తేల్చిచెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్​
  • కొన్నిసార్లు శత్రువుల కంటే మిత్రులతోనే నష్టమని కామెంట్
  • వాణిజ్యంలో సమానత్వం కోసమే ‘పరస్పర టారిఫ్​లు’ విధిస్తున్నట్టు వెల్లడి  

వాషింగ్టన్:  తమపై ఏ దేశం ఎంత టారిఫ్​లు వేస్తే తామూ అంతే వేస్తామని అమెరికా అధ్యక్షుడు​ ట్రంప్​ ప్రకటించారు. కొన్నిసార్లు శత్రువుల కంటే మిత్రులతోనే ఎక్కువ నష్టమని, ట్రేడ్​లో సమానత్వం కోసం ‘పరస్పర సుంకాలు’ తప్పవని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్​ వరుసగా పలుదేశాలపై టారిఫ్​లతో దాడిని పెంచారు. తాజాగా అన్ని దేశాలకు టారిఫ్​లు వేస్తామని.. ఏ దేశాలు ఎంత వేస్తే తాము అంత వేయక తప్పదని తేల్చిచెప్పారు. ట్రంప్​ తాజా నిర్ణయం ఇండియాకు కూడా వర్తించనుంది. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్, డోగ్ చీఫ్ ఎలాన్ మస్క్, ఇండియన్ అమెరికన్పొలిటీషియన్ వివేక్ రామస్వామితో మోదీ భేటీ అయ్యారు. 

 

మోదీకి ఇండియన్ల గ్రాండ్ వెల్ కం 

ముందుగా ఎయిర్ పోర్టు నుంచి మోదీ నేరుగా బ్లెయిర్ హౌస్ బంగ్లాకు చేరుకున్నారు. అక్కడ మోదీకి ఇండియన్ కమ్యూనిటీ ప్రజలు ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలతో గ్రాండ్ గా వెల్ కం చెప్పారు. మోదీ బస సందర్భంగా బ్లెయిర్ హౌస్ పై అమెరికా జెండా స్థానంలో భారత జెండాను ఎగురవేశారు. కాగా, గత నెలలో రెండోసారి ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా, జోర్డాన్ రాజు కింగ్ అబ్దుల్లా2ను ట్రంప్ కలిశారు. తాజాగా నాలుగో దేశాధినేతగా మోదీతో  ఆయన భేటీ కానున్నారు.  

తులసి, వివేక్, మస్క్ తో భేటీ.. 

ట్రంప్ తో భేటీకి ముందుగా అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్, ఇండియన్ అమెరికన్ పొలిటీషియన్ వివేక్ రామస్వామి, బిలియనీర్ ఎలాన్ మస్క్ తో మోదీ భేటీ అయ్యారు. ముందుగా ఉదయం 7 గంటలకు తులసీ గబ్బార్డ్ తో మోదీ సమావేశమయ్యారు. భారత్, అమెరికా మధ్య స్నేహపూర్వక సంబంధాలపై వారు చర్చించారు. భారత్ తో మంచి సంబంధాలకు ఎప్పుడూ మద్దతు ఇచ్చే తులసి యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్​గా నియమితులు కావడం పట్ల మోదీ అభినందనలు తెలిపారు. రెండు దేశాల ఇంటెలిజెన్స్ విభాగాల మధ్య సహకారం పెంచుకోవాలని ఇరువురు నేతలు అంగీకరించారు. అలాగే, ఉదయం11 గంటలకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మైకేల్ వాల్ట్జ్ తో మోదీ భేటీ అయ్యారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు (భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 10 గంటలకు) ఎలాన్ మస్క్ తో మోదీ సమావేశమయ్యారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోగ్) చీఫ్ కూడా అయిన మస్క్ తో భేటీ సందర్భంగా ఏఐ పాలసీ, ఇండియాలో స్టార్ లింక్ విస్తరణ, టెస్లా ప్లాంటు ఏర్పాటు వంటి అంశాలపై చర్చించినట్టు విదేశాంగ శాఖ తెలిపింది. ఆ తర్వాత వివేక్ రామస్వామితోనూ మోదీ సమావేశమయ్యారని పేర్కొంది.  

పాక్ మీదుగా పారిస్ కు వెళ్లిన మోదీ

విదేశీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ప్రయాణించిన విమానం ఢిల్లీ నుంచి పాకిస్తాన్ మీదుగా పారిస్ కు చేరుకుందని ఏఆర్ వై వార్తా సంస్థ వెల్లడించింది. ప్రధాని మోదీ ఉన్న విమానం పాక్ గగనతలంలో సుమారు 46 నిమిషాలపాటు, 34 వేల ఫీట్ల ఎత్తులో ప్రయాణించినట్టు తెలిపింది. భారత్ నుంచి లాహోర్ సమీపంలో పాక్ ఎయిర్ స్పేస్ లోకి ప్రవేశించిన విమానం.. షేఖూపుర, హఫీజాబాద్, చాక్వాల్, కోహట్ ల మీదుగా ఆ దేశం దాటినట్టు వెల్లడించింది. అయితే, అఫ్గానిస్తాన్ మీదుగా ఎయిర్ ట్రాఫిక్ ను మూసివేసినందుకే ఈ రూట్లో మోదీ విమానం ప్రయాణించిందని, గతంలోనూ ఆయన పలు సార్లు పాక్ గగనతలం మీదుగా ప్రయాణించారని పేర్కొంది.

మస్క్ తో స్పేస్, టెక్నాలజీపై చర్చలు  

టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. వాషింగ్టన్ లోని బ్లెయిర్ హౌస్ బంగ్లాలో మోదీని మస్క్ కలిశారు. ట్రంప్ సర్కారులో డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డోగ్) చీఫ్ గా వ్యవహరిస్తున్న మస్క్ తో మీటింగ్ బాగా జరిగిందని అనంతరం మోదీ ట్వీట్ చేశారు. స్పేస్, మొబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్ వంటి అంశాలపై తాము చర్చించామని తెలిపారు. కాగా, మస్క్ తోపాటు ఆయన ముగ్గురు పిల్లలు కూడా బ్లెయిర్ హౌస్ కు వచ్చారు. వారితో ప్రధాని మోదీ సరదాగా ముచ్చటించారు. మోదీ వెంట విదేశాంగ మంత్రి జైశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ ఉన్నారు.

వాషింగ్టన్​ డీసీలో టెస్లా, స్పేస్​ ఎక్స్​ సంస్థల అధినేత ఎలాన్​ మస్క్​తో భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోదీ. అంతరిక్షం, మొబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్స్​పై వీరి మధ్య చర్చ జరిగింది.ఈ సందర్భంగా మస్క్​ పిల్లలతో మోదీ సరదాగా గడిపారు.