అమెరికా ఎన్నికల ప్రాసెస్​ మొత్తం మార్చేస్తా: ట్రంప్

అమెరికా ఎన్నికల ప్రాసెస్​ మొత్తం మార్చేస్తా: ట్రంప్
  • ఎగ్జిక్యూటివ్ ఆర్డర్​పై సంతకం చేస్తూ ట్రంప్​ కామెంట్​
  • ఇండియా, ఇతర దేశాల్లోలాగా పక్కాగా జరగాలి
  • పోలింగ్ టైంలో ఓటర్లు అమెరికన్లేనని ప్రూఫ్ చూపించాలి
  • ఎలక్షన్ డే తర్వాత వచ్చే మెయిల్ బ్యాలెట్లను లెక్కించొద్దు
  • విదేశీయుల డొనేషన్లపై నిషేధం విధించాలని ఉత్తర్వులు

వాషింగ్టన్: అమెరికా ఎన్నికల ప్రక్రియలో కీలక సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందని ఆ దేశ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఎలక్షన్ ప్రాసెస్ లో మార్పులను ప్రవేశపెట్టడం కోసం మంగళవారం ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. ఇండియా, తదితర దేశాల్లో ఎన్నికల ప్రక్రియ పకడ్బందీగా కొనసాగుతోందని, అమెరికా ఎన్నికల వ్యవస్థలో మాత్రం పలు లోపాలు ఉన్నాయని ఆయన అన్నారు. పోలింగ్ సమయంలో ఓటర్లు తాము అమెరికన్ పౌరులమేనని తగిన ప్రూఫ్ చూపించడాన్ని తప్పనిసరి చేయాలని ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో పేర్కొన్నారు. ఎలక్షన్ డే తర్వాత అందే మెయిల్, ఆబ్సెంటీ బ్యాలెట్లను లెక్కించవద్దన్నారు. 

అలాగే అమెరికా ఎన్నికలకు విదేశీయుల డొనేషన్లపై నిషేధం విధించాలని స్పష్టం చేశారు. ‘‘ఇండియా, ఇతర కొన్ని దేశాలను మనం ఉదాహరణలుగా తీసుకోవాలి. పలు అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలతో పోలిస్తే.. యూఎస్ ఎన్నికల వ్యవస్థలో కనీస, అవసరమైన రక్షణలు కరువయ్యాయి” అని ట్రంప్ పేర్కొన్నారు. ‘‘ఇండియా, బ్రెజిల్ ఓటర్ ఐడెంటిఫికేషన్ ను బయోమెట్రిక్ డేటాబేస్ తో అనుసంధానం చేస్తున్నాయి. అమెరికా మాత్రం ఓటర్లు తాము అమెరికన్ పౌరులమేనంటూ ఇచ్చే సెల్ఫ్ అటెస్టేషన్ పైనే ఆధారపడుతోంది. అలాగే జర్మనీ, కెనడా బ్యాలెట్ పేపర్ల నిర్వహణ, ఓట్ల లెక్కింపు సమర్థంగా నిర్వహిస్తున్నాయి. అమెరికా మాత్రం బ్యాలెట్ల నిర్వహణ, ఓట్ల లెక్కింపులో ప్యాచ్ వర్క్ మెథడ్స్ పాటించడం వల్ల సరైన కస్టడీ ప్రొటెక్షన్లు కరువయ్యాయి” అని ఆయన వివరించారు.

ఓటర్లు ప్రూఫ్ చూపాలి.. 

ఫెడరల్ ఓటర్ రిజిస్ట్రేషన్ ఫారమ్ ను సవరించాలని, పోలింగ్ సమయంలో ఓటర్లు యూఎస్ పాస్ పోర్ట్ లేదా బర్త్ సర్టిఫికెట్ చూపడం తప్పనిసరి చేయాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్​లో ట్రంప్ పేర్కొన్నారు. ‘‘రాష్ట్రాలు ఓటర్ లిస్టుల నిర్వహణను హోంల్యాండ్ సెక్యూరిటీ, గవర్నమెంట్ ఎఫిషియెన్సీ శాఖలకు అప్పగించాలి. ఓటర్ లిస్టులో విదేశీయులను గుర్తించేందుకు ఫెడరల్ ఏజెన్సీల డేటాను వినియోగించుకోవాలి. ఒకవేళ ఇందుకు ఏవైనా రాష్ట్రాలు సహకరించకపోతే, వాటికి ఫెడరల్ గ్రాంట్లను నిలిపివేయాలి” అని స్పష్టం చేశారు. 

లేట్ గా వచ్చే బ్యాలెట్లు లెక్కించొద్దు.. 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్యూర్టారికో, వర్జిన్ ఐల్యాండ్​, వాషింగ్టన్ డీసీ సహా 18 రాష్ట్రాలు ఎలక్షన్ డే తర్వాత వచ్చే బ్యాలెట్ ఓట్లను కూడా లెక్కిస్తున్నాయి. ‘‘డెన్మార్క్, స్వీడన్ వంటి దేశాలు వ్యక్తిగతంగా వచ్చి ఓటు వేయలేని వారికి మాత్రమే మెయిల్ ఇన్ ఓట్లను పరిమితం చేస్తున్నాయి. మెయిల్ ఇన్ ఓట్లు ఎప్పుడు పోస్ట్ చేసినా.. ఎలక్షన్ డే తర్వాత అందే ఓట్లను కౌంట్ చేయడంలేదు. అమెరికా ఎన్నికల్లో మాత్రం పెద్ద ఎత్తున మెయిల్ ఇన్ ఓట్లు వేస్తున్నారు. చాలామంది అధికారులు పోస్టల్ ముద్రలు లేకపోయినా మెయిల్ ఇన్ బ్యాలెట్లను అంగీకరిస్తున్నారు. ఎలక్షన్ డే తర్వాత అందే బ్యాలెట్లను కూడా లెక్కిస్తున్నారు” అని ట్రంప్ పేర్కొన్నారు. అందుకే అన్ని రాష్ట్రాలు ఎలక్షన్ డే నాటికి అందే ఓట్లను మాత్రమే లెక్కించాలని ట్రంప్ స్పష్టం చేశారు. అలాగే, ఓట్ల లెక్కింపు సందర్భంగా బ్యాలెట్లపై ఉండే బార్ కోడ్లు, క్యూఆర్ కోడ్లపై ఆధారపడకూడదని, ఇందుకోసం నిబంధనలను సవరించాలని ఎలక్షన్ అసిస్టెన్స్ కమిషన్ కు ట్రంప్ సూచించారు. ఎన్నికల వ్యవస్థను రివ్యూ చేసి, ఎన్నికల సమగ్రతను కాపాడేందుకు 6 నెలలలోపు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 

విదేశీయుల డొనేషన్లను నిషేధించాలి.. 

అమెరికా ఎన్నికలకు విదేశీయులు, విదేశీ ఎన్జీవోల డొనేషన్లను అంగీకరించొద్దని  ట్రంప్ తన ఆర్డర్ లో పేర్కొన్నారు. చట్టంలో ఉన్న లూప్ హోల్స్​ను వాడుకుంటూ విదేశీయులు, విదేశీ సంస్థలు డాలర్లు కుమ్మరిస్తూ అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. దీనివల్ల అమెరికన్లు తమ ఓటు హక్కును, తమ రిపబ్లిక్ దేశాన్ని పాలించుకునే హక్కును కోల్పోతున్నారన్నారు. కాగా, 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి బైడెన్ చేతిలో ట్రంప్ ఓడిపోయిన తర్వాత అమెరికా ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని, అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు తేవాలని డిమాండ్ చేశారు.