వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పీఠం కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ నుంచి జో బైడెన్ పోటీపడుతున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. 2020 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్‌లోనూ వీరిద్దరే పోటీపడగా.. బైడెన్ విజయం సాధించారు. కాగా, ఈసారి కూడా ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ తమదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. బైడెన్ కిచెన్, రెస్టారెంట్లు, సెలూన్స్ అడ్డాగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ట్రంప్ మాత్రం తనపై నమోదైన నాలుగు కేసుల విచారణలో భాగంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. కాగా, ప్రచారంలో భాగంగా బైడెన్ వయస్సు గురించి ట్రంప్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. దీనికి బైడెన్ గట్టి కౌంటరే ఇస్తున్నారు. ట్రంప్ తనకంటే నాలుగేండ్లు మాత్రమే చిన్నోడని, ఇద్దరికీ వయస్సులో పెద్ద తేడా ఏం లేదంటూ ట్రంప్ విమర్శలను కొట్టిపారేస్తున్నారు. ప్రజా సేవ చేసేందుకు వయస్సు అనేది పెద్ద అడ్డంకి కాదని అంటున్నారు.
భారీ సభలకు దూరంగా బైడెన్
జో బైడెన్ ప్రచారశైలి అక్కడివాళ్లను ఆకట్టుకుంటున్నది. ఓటర్లతో ప్రవర్తిస్తున్న తీరు ట్రంప్‌కు మైనస్ అయితే.. అందరినీ కలుపుకుని పోవడం, సాధారణ వ్యక్తిలా వ్యవహరించడం బైడెన్‌కు ఎంతో ప్లస్ అవుతున్నది. భారీ సభలు, సమావేశాలకు వెళ్లకుండా చిన్న చిన్న షాపులు, రెస్టారెంట్లు, సెలూన్స్‌లో ఓటర్లతో బైడెన్ భేటీ అవుతున్నారు.
కిచెన్ టేబుల్ చుట్టూ యువతతో ముచ్చటిస్తూ తనదైనశైలిలో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ట్రంప్ ప్రజల్లోకి వెళ్లకుండా.. ప్రజలకు దూరంగా.. ఇంటర్నేషనల్, నేషనల్ మీడియాకు దగ్గరగా ఉంటారనే విమర్శలు ఉన్నాయి. ట్రంప్ పై నాలుగు కేసులు నమోదుకావడంతో కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నాడు. బాధితుడి పాత్ర పోషించడం ట్రంప్‌కు చాలా కష్టమంటూ పలువురు సెటైర్లు వేస్తున్నారు.