ట్రంప్ దూకుడు.. తడబడ్డ బైడెన్

  • అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య వాడీవేడిగా తొలి డిబేట్
  • పరస్పరం ఘాటుగా విమర్శలు చేసుకున్న నేతలు 
  • సీఎన్ఎన్ ఆధ్వర్యంలో జరిగిన చర్చలో ట్రంప్ పైచేయి 
  • పోల్​లో ట్రంప్​కు 67%, బైడెన్​కు 33% మంది ఓటర్ల మద్దతు 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి తలపడుతున్న బైడెన్, ట్రంప్ మధ్య టీవీ డిబేట్ వాడీవేడిగా జరిగింది. ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకున్నారు. డిబేట్​పై పోల్​లో 67% మంది ట్రంప్​కు.. 33% మంది  బైడెన్​కు మద్దతు పలికారు.

అట్లాంటా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి తలపడుతున్న డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య టీవీ డిబేట్ వాడీవేడిగా జరిగింది. అధ్యక్ష ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం ఉండగా ఈసారి సీఎన్ఎన్ మీడియా సంస్థ గురువారం రాత్రి (ఇండియన్ టైం ప్రకారం శుక్రవారం ఉదయం) నిర్వహించిన తొలి టీవీ డిబేట్​లో ఇద్దరు అభ్యర్థులూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నించారు. 90 నిమిషాల పాటు సాగిన డిబేట్​లో 78 ఏండ్ల ట్రంప్ కొంత దూకుడు ప్రదర్శించగా.. 81 ఏండ్ల బైడెన్ కొన్నిసార్లు తడబాటుకు గురయ్యారు. డిబేట్​లో నిర్వాహకుల ప్రశ్నలకు పోగా.. మొత్తంగా ట్రంప్ 23 నిమిషాల 6 సెకన్ల పాటు మాట్లాడారు. బైడెన్ 18 నిమిషాల 26 సెకన్లు తీసుకున్నారు. బైడెన్ చర్చను నెమ్మదిగానే ప్రారంభించారని, కానీ హుందాగా, దీటుగా ముగించారని వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ అభిప్రాయపడ్డారు. అయితే, డిబేట్​లో ట్రంప్ పైచేయి సాధించారని డిబేట్ అనంతరం సీఎన్ఎన్ ప్రకటించింది. డిబేట్​పై నిర్వహించిన పోల్​లో దాదాపు 67% మంది ఓటర్లు ట్రంప్​కు.. బైడెన్​కు 33% మంది ఓటర్లు మద్దతు పలికారని వెల్లడించింది.

బైడెన్ ఫెయిల్యూర్ ప్రెసిడెంట్.. 

బైడెన్, ట్రంప్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఒక దశలో సహనం కోల్పోయి వ్యక్తిగత విమర్శలకు దిగారు. అడ్మినిస్ట్రేషన్​లో బైడెన్ ఫెయిల్ అయ్యారని ట్రంప్​.. ట్రంప్ హష్ మనీ కేసులో దోషిగా తేలారంటూ బైడెన్ విమర్శించారు. ట్రంప్ హయాంలో సంపన్నులకు అనుకూలమైన ఆర్థిక విధానాలు అనుసరించారని, దీంతో ఎకానమీ పతనమైందని విమర్శిస్తూ బైడెన్ చర్చను మొదలుపెట్టారు. ట్రంప్ స్పందిస్తూ.. బైడెన్ హయాంలో అక్రమ వలసదారులకే ఉద్యోగాలు దొరికాయన్నారు. ద్రవ్యోల్బణం పెరిగిందని, పన్ను కోతలతో ఆర్థిక వ్యవస్థ పతనమైందన్నారు. సరిహద్దులను సేఫ్​గా ఉంచడంలో బైడెన్ ఫెయిల్ అయ్యాడని విమర్శించారు.

ట్రంప్ కిరికిరి మనిషి.. 

2020 అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను బైడెన్ ఖండించారు. ఈసారైనా ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తారా? అన్న ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ.. పారదర్శకంగా, న్యాయబద్ధంగా జరిగితే అంగీకరిస్తానని బదులిచ్చారు. అయితే, ట్రంప్ కిరికిరి మనిషి అని, ఓటమిని ఒప్పుకోకుండా కోర్టుల చుట్టూ తిరిగి మొట్టికాయలు తిన్నారని బైడెన్ చురకలు వేశారు.