డోనాల్డ్​ ట్రంప్​ ఎప్పుడూ ఇంతేనా!

డోనాల్డ్​ ట్రంప్​  ఎప్పుడూ  ఇంతేనా!

బిల్​ క్లింటన్​ తర్వాత ప్రపంచమంతటికీ తెలిసిన మరో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.  క్లింటన్​ తన వ్యక్తిగత జీవితంతో జనం నోళ్లలో నానారు. ట్రంప్​ తన నోటిదురుసుతనంతో అన్​పాపులారిటీ సంపాదించు కున్నారు. బహుశా ట్రంప్​ రికార్డు గతంలో ఎవరికీ లేకపోవచ్చు. తాజాగా ఆయన ప్రతిపక్ష డెమొక్రటిక్​ పార్టీ మహిళా ఎంపీలు నలుగురిపై నోరు పారేసుకున్నారు. ఇదే ఫస్ట్​ టైం కాకపోయినా, ప్రెసిడెంట్​ ఎలక్షన్​ సీజన్​ కావడంతో విమర్శలు పెరిగాయి. 

అమెరికా పార్లమెంట్​(కాంగ్రెస్​)లోని​ దిగువ సభ(హౌజ్​ ఆఫ్​ రిప్రజెంటేటివ్స్)కు చెందిన నలుగురు మహిళా​ సభ్యులను ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ ‘గో బ్యాక్’ అనేశారు. ఇతర దేశాల నుంచి ఇల్లీగల్​గా అగ్రరాజ్యంలోకి వలస వచ్చినవాళ్లను బంధించే కేంద్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలించటానికి ఈమధ్య ఓ కాంగ్రెస్‌ కమిటీని ఏర్పాటు చేశారు. డెమొక్రటిక్​ పార్టీ మహిళా సభ్యులు నలుగురు ఆ కమిటీ వద్ద హాజరై- డిటెన్షన్​ సెంటర్​లోని స్థితిగతుల పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ విషయం మీడియాలోనూ హైలైట్​ అయింది.

దీంతో డొనాల్డ్​ ట్రంప్‌ సీరియస్​గా రియాక్ట్​ అయ్యారు. ‘‘ఈ దేశంలో పరిస్థితులు బాగా లేవనేటోళ్లు ఇంకా ఇక్కడే ఎందుకు ఉండటం?. తక్షణమే వాళ్ల సొంత ప్ర‘దేశాలకు’ వెళ్లిపోవాలి. ఇలాంటి మనుషులను అమెరికా వ్యతిరేకులుగానే పరిగణిస్తాం’’ అంటూ కోపగించుకున్నారు. దీంతో ఆయన ఆ నలుగురినీ పంటి కింద రాయిలా పరిగణిస్తున్నారనే అభిప్రాయం ఏర్పడింది. హిస్పానిక్​లు, అరబ్​లు, ఆఫ్రికన్‌లంటే ట్రంప్​కి ఏమాత్రం పడదనే వాదన మరోసారి తెరపైకి వచ్చింది. వాళ్లను ఆయన ఎప్పుడూ ద్వేషిస్తూనే ఉంటారని పలువురు గుర్తు చేస్తున్నారు.

వందేళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు
ట్రంప్‌ తీరును నిరసిస్తూ ‘హౌజ్​ ఆఫ్​ రిప్రజెంటేటివ్స్​’ 240 అనుకూల ఓట్లు,- 187 వ్యతిరేక ఓట్లతో ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఆయన చేసిన ఈ రేసిస్ట్​ కామెంట్లు కొత్త తరం అమెరికన్లను, నల్ల జాతీయులను భయాందోళనలకు గురిచేస్తోందని దిగువ సభ ఖండించింది. జాత్యహంకారం, ద్వేషం, వివక్ష, సెక్సిజం, యాంటీ సెమిటిజం, గ్జీనోఫోబియా వంటి వాటికి ఈ దేశంలో చోటులేదని తేల్చిచెప్పింది. అగ్రరాజ్యం అధ్యక్షుడిపై హౌజ్​ ఇలా తీర్మానం చేయటం గత వందేళ్లలో ఇదే తొలిసారి. ఈ ఓటింగ్​ చరిత్రలో నిలిచిపోతుందని అంటున్నారు.

నాకు ఆ ఉద్దేశం లేదు

దిగువ సభలో ఆమోదం పొందిన తీర్మానంపై​​ ట్రంప్ స్పందించారు. ‘నా బాడీలో జాత్యహంకారమనే ఎముక భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. నాకు అసలు అలాంటి ఉద్దేశమే లేదు. ఇది వంద శాతం నిజం. సభ మాత్రం దీనికి భిన్నంగా ఏదోదో అనుకుంటోంది’ అని ట్వీట్​ చేశారు. తన ప్రవర్తనకు, రైట్​–వింగ్​ వైట్​ నేషనలిజానికి సంబంధం లేదనేది ఆయన వాదన. దీన్ని డెమొక్రాట్లు ఒప్పుకోవట్లేదు. మేక్​ అమెరికా గ్రేట్​ అగైన్​ అంటే మేక్​ అమెరికా వైట్​ అగైన్ అనే అర్థమంటూ హౌజ్​ స్పీకర్ నాన్సీ పెలోసి ఇటీవలే ట్రంప్​ వైఖరిని ఎండకట్టారు.

గతంలోనూ ఇదే తీరు

లాటిన్​ అమెరికన్ల​ నుంచి ముస్లింలు, ఆఫ్రికన్​ అమెరికన్ల వరకు ప్రతిఒక్కరిపైనా ట్రంప్ జాత్యహంకార భావాలను ప్రదర్శించిన ఉదంతాలు ఉన్నాయి. యూఎస్​ ప్రెసిడెంట్​ అవటానికి పాతికేళ్ల క్రితం నుంచే ఆయనపై ఈ తరహా కేసులు నమోదయ్యాయి. ఫెయిర్​ హౌజింగ్​ యాక్ట్​ని వయొలేట్​ చేశారంటూ 1973లో నిక్షన్​ అడ్మినిస్ట్రేషన్​.. ట్రంప్​పై దావా వేసింది. ఆయన​ ఆధ్వర్యంలోని రియల్​ ఎస్టేట్​ కంపెనీ నల్ల జాతీయులకు ఇళ్లు అద్దెకు ఇవ్వటానికి నిరాకరిస్తోందని ఆఫీసర్లు ఫిర్యాదు చేయటంతో కేసు బుక్కైంది. అది మూడేళ్ల తర్వాత గానీ సెటిల్​ కాలేదు.

ఆ తర్వాత 1992లో ట్రంప్​ ప్లాజాలో, హోటల్​ కాసినోలో నల్ల జాతి మహిళా డీలర్లను తొలగించటంతో ఆ సంస్థల అధిపతిగా డొనాల్డ్​ ట్రంప్​.. ప్రభుత్వానికి జరిమానా కట్టాల్సి  వచ్చింది. ‘బర్తర్​ మూమెంట్​’ బలోపేతం కావటంలో కూడా ఆయన ముఖ్య పాత్ర పోషించారంటారు. బరాక్​ ఒబామా అమెరికా ప్రెసిడెంట్​ అయిన సమయంలో.. యూఎస్​లో పుట్టని వ్యక్తి దేశాన్ని పాలించటమేంటని ప్రశ్నిస్తూ ఈ ఉద్యమం నడిచింది. అగ్ర రాజ్యానికి అధ్యక్షుడైన మొట్టమొదటి ఆఫ్రికన్​ ఒబామా అనే విషయం తెలిసిందే.

దీన్ని బట్టి నల్ల జాతీయులంటే ట్రంప్​కు ఎంత​ ద్వేషమో తెలుస్తోంది. అలాంటి వ్యక్తి దేశానికి ప్రెసిడెంట్​ అవటంతో మరింత రెచ్చిపోతున్నారు. తన సపోర్టర్లలోనూ ఇవే రేసిస్ట్​ ఫీలింగ్స్​ని పెంచి పోషిస్తున్నారని టాక్​. ఫలితంగా అమెరికాలో ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆ దేశంలో గతేడాది జరిగిన ప్రతి అతివాద హత్యకు ఈ ఫార్​–రైట్​ ఐడియాలజీతో లింక్​ ఉన్నట్లు రీసెంట్​ స్టడీలో తేలింది. అగ్రరాజ్యంలో ఇంత భారీ సంఖ్యలో ఇలాంటి మర్డర్లు జరగటం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి.

2045 నాటికి మైనారిటీలు కానున్న అమెరికన్లు

ఎన్ని దేశాల నుంచి ప్రజలు అమెరికాకు వలస వచ్చినా వాళ్లంతా ఒక్కటిగానే, ఆ దేశంలో పుట్టి పెరిగినవాళ్ల మాదిరిగానే కలిసి మెలిసి నివసిస్తుంటారు. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే. మొత్తం పాపులేషన్​లో ప్రస్తుతం వాళ్లదే మెజారిటీ. కానీ.. 2045 నాటికి ఈ లెక్కలు కాస్త అటూ ఇటూగా మారనున్నాయి. తెల్ల జాతీయులు 49.7 శాతానికే పరిమితం కానున్నారు.  స్పానిష్‌ మాట్లాడే దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చే ఉత్తర, దక్షిణ అమెరికా దేశాల వాళ్ల సంఖ్య 2045 నాటికి 24.6 శాతానికి, నల్ల జాతీయుల జనాభా 13.1 పర్సంటేజీకి, ఆసియన్లు 7.9 శాతానికి, ఇతరుల పాపులేషన్​ 3.8 పర్సంటేజీకి చేరుతుంది. వీళ్లందరి వాటా 49.4 శాతానికి పెరుగుతుంది. దీంతో యూఎస్​లోని తెల్ల జాతీయులు మైనారిటీలుగా, స్వదేశంలోనే విదేశీయులుగా ఫీలవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సిచ్యువేషన్ రాకుండా ఉండేందుకే ట్రంప్​ నల్ల జాతీయుల జనాభాను తగ్గించేందుకు ఇలా ఇన్​డైరెక్ట్​గా రెచ్చగొడుతున్నారు.

 

ట్రంప్ కోపానికిదేనా కారణం
ట్రంప్​ ప్రత్యేకించి మహిళా ఎంపీల పేర్లు చెప్పకపోయినా… ఈ నలుగురిని ఉద్దేశించే కామెంట్​ చేశారని అక్కడి మీడియా, పొలిటికల్​ సర్కిల్స్​లో ప్రచారమవుతోంది. వీళ్లు నలుగురూ ‘ది స్క్వాడ్​’ గ్రూప్​కి చెందినవారు. పర్యావరణం, మెడికేర్​ వంటి అంశాలపై ట్రంప్​ విధానాలను ఏకిపారేస్తుంటారు.

ఐలాన్​ అబ్దుల్లాహి ఒమర్​

మిన్నేసోట నుంచి ఎన్నికైన సోమాలి–అమెరికన్​ ముస్లిం మహిళ

 

రషీదా తైబ్​

మిషిగాన్​ నుంచి ఎన్నికైన పాలస్తీనియన్​– అమెరికన్​ ముస్లిం మహిళ

 

అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్​

న్యూయార్క్ నుంచి 29 ఏళ్లకే ఎన్నికైన లాటిన్​ అమెరికన్​  మహిళ

 

అయనా సాయిని ప్రెస్లీ

మసాచ్యుసెట్స్​ నుంచి ఎన్నికైన తొలి ఆఫ్రికన్​–అమెరికన్​ మహిళ