దేవుడి దయవల్లే మీ ముందున్నా..ఇక నన్నెవరూ ఆపలేరు: ట్రంప్​

దేవుడి దయవల్లే మీ ముందున్నా..ఇక నన్నెవరూ ఆపలేరు: ట్రంప్​
  • అక్రమ వలసలను ఆపేస్తా.. అంతరాల్లేని సమాజాన్ని నిర్మిస్తానని కామెంట్​

వాషింగ్టన్​: దేవుడి దయవల్లే మళ్లీ మీ ముందున్నానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ అన్నారు. ఏ మాత్రం పొరపాటు జరిగినా తాను ఇక్కడ ఉండేవాడిని కాదని పేర్కొన్నారు. తనపై జరిగిన కాల్పుల ఘటనను గుర్తుచేసుకున్నారు.4 రోజుల రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ లో చివరి రోజు ట్రంప్​ కీలక ప్రసంగం చేశారు. అంతకంటే ముందు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన మాజీ అగ్నిమాపక సిబ్బంది కోరీ కంపెరాటోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ట్రంప్​ మాట్లాడుతూ..  “నేను విశ్వాసం, బలం, ఆశతో కూడిన సందేశంతో మీ ముందు నిలబడ్డా.. ఇక నన్ను ఎవరూ ఆపలేరు’’ అని పేర్కొన్నారు. ప్రజలకు సేవచేయాలనే తన సంకల్పం ఏమాత్రం సడలలేదని అన్నారు. ప్రజల కోసం మాత్రమే పనిచేసే ప్రభుత్వాన్ని అందిస్తానని చెప్పారు. 

ప్రత్యర్థిని ప్రజాస్వామ్యానికి శత్రువంటరా..

రాజకీయ ప్రత్యర్థిని ప్రజాస్వామ్యానికి శత్రువుగా ముద్ర వేయడం ఆపాలని అధికార పక్షానికి సూచించారు. న్యాయవస్థను ఆయుధాలుగా మార్చొద్దని అన్నారు. సరిహద్దులను మూసేసి అమెరికాలో అక్రమ వలసల సంక్షోభాన్ని అంతం చేస్తానని చెప్పారు. మీ పన్నులను 4 రెట్లు పెంచుతామంటూ ముందే చెప్పే ఏకైక పాలన బైడెన్​దేనని చురకలంటించారు. 4 నెల్లలో తాను అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోబోతున్నట్టు చెప్పారు. సమాజంలోని అంతరాలన్నీ తొలగించేందుకు కృషిచేస్తానని తెలిపారు. అమెరికన్లందరూ ఒకే ఉమ్మడి విధికి కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. కాగా, ట్రంప్​ ప్రసంగిస్తుండగా.. రిటైర్డ్​ రెజ్లర్​ హల్క్​ హోగన్​ తన చొక్కా చింపి, లోపల టీ షర్ట్​పై ట్రంప్, వాన్స్ పేరును చూపిస్తూ.. ట్రంప్​ అమెరికా​హీరో అంటూ అరవడం అందరినీ ఆకట్టుకున్నది.

బైడెన్​ తప్పుకుంటేనే మేలు మిత్రులతో ఒబామా కామెంట్స్​!

బైడెన్​ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారని.. ఆయన అధ్యక్ష రేసునుంచి తప్పుకోవాలని పలువురు అధికార పార్టీ నేతలే కోరుకుంటున్నారు. పార్టీలోనే కాక బహిరంగంగానూ డిమాండ్​ చేస్తున్నారు.  వీరికి ఇప్పుడు మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా కూడా తోడయ్యారు. 81 ఏండ్ల జో బైడెన్​ విజయావకాశాలు తగ్గిపోయాయని, పోటీపై పునరాలోచించుకుంటే మంచిదని తన మిత్రులతో అభిప్రాయం వ్యక్తపరిచారని అమెరికన్​ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. బైడెన్​ అభ్యర్థిత్వంపై ఒబామా అనుమానం వ్యక్తంచేసినట్టు పేర్కొంది.