అధికార మార్పిడికి ట్రంప్ నో..
లీగల్ పోరుపైనే ఫోకస్
పవర్ ట్రాన్సిషన్ ప్రాసెస్‌ను షురూ చేయని జీఎస్ఏ
సహకరించాలంటూ బైడెన్ టీమ్ ప్రెజర్
లేట్ చేస్తూ డెమొక్రాట్లను ఇబ్బందిపెట్టనున్న ట్రంప్?
విల్మింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో బైడెన్ గెలిచి రెండు రోజులవుతున్నా.. ఇప్పటి ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం ‘నేను ఓటమిని ఒప్పుకోను.. కుర్చీ దిగిపోను’ అని అంటున్నడు. ఎన్నికల్లో గెలిచిన బైడెన్ కు అధికార మార్పిడి చేసేందుకు సహకరించాలంటూ ఆయన టీమ్ పై ఒత్తిడి తెస్తున్నా ఫలితం కన్పిస్తలేదు. జనవరి 20న బైడెన్ ప్రమాణం చేయాల్సి ఉన్నందున.. అధికార మార్పిడిని సజావుగా పూర్తి చేసి, కొత్త ప్రభుత్వానికి ఆఫీసులను అప్పగించేందుకు సహకరించాలని కోరుతున్నా.. ఇటు నుంచి పెద్దగా స్పందన వస్తలేదు. అధికార మార్పిడి ప్రాసెస్ వెంటనే మొదలుపెట్టాల్సి ఉన్నందున.. పవర్ ట్రాన్సిషన్ కు సహకరించాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కు నాన్ పార్టిసన్ సెంటర్ అడ్వైజరీ బోర్డు కూడా విజ్ఞప్తి చేసింది. మరోవైపు ట్రంప్ ఇప్పటివరకూ బైడెన్ గెలుపును ఒప్పుకొంటూ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఎలక్షన్ లో ఫ్రాడ్ జరిగిందని, న్యాయ పోరాటం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. దీంతో అధికార మార్పిడిని లేట్ చేయడం ద్వారా డెమొక్రాట్లను ట్రంప్ ఇబ్బంది పెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి.
అధికార మార్పిడి షురూ కాలే
ప్రెసిడెన్షియల్ ట్రాన్సిషన్ యాక్ట్ ప్రకారం కొత్త ప్రెసిడెంట్ కు అధికారాన్ని అప్పగించే ప్రాసెస్ జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్(జీఎస్ఏ), నాన్ పార్టిసన్ సెంటర్ ఫర్ ప్రెసిడెన్షియల్ ట్రాన్సిషన్ ఆధ్వర్యంలో జరగాల్సి ఉంటుంది. అయితే ట్రంప్ గతంలో నియమించిన జీఎస్ఏ అడ్మినిస్ట్రేటర్ ఎమిలీ మర్ఫీ ఇంకా పవర్ ట్రాన్సిషన్ ప్రాసెస్ ను మొదలుపెట్టలేదు.
కుర్చీ అప్పగింత ఇలా..
అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 270 ఎలక్టోరల్ ఓట్లను గెలుచుకున్న క్యాండిడేట్ ను ప్రెసిడెంట్ ఎలక్ట్ గా గుర్తిస్తారు. ఓడిపోయిన క్యాండిడేట్ తన ఓటమిని ఒప్పుకొంటూ ప్రకటన చేస్తారు. ఓడిన వ్యక్తి అధికారంలో ఉన్న ప్రెసిడెంట్ అయితే.. ఆ వెంటనే కొత్త ప్రెసిడెంట్ కు అధికారాన్ని అప్పగించే ప్రాసెస్ ను జీఎస్ఏ మొదలుపెడుతుంది. అయితే ఇప్పటివరకూ అమెరికా ఎన్నికలు అధికారికంగా పూర్తి కాలేదు. నవంబర్ 3 ఎలక్షన్లలో గెలిచే ఎలక్టర్లందరూ డిసెంబర్ 14న సమావేశమై కొత్త ప్రెసిడెంట్ ను అధికారికంగా ఎన్నుకోవాలి. ఎలక్టోరల్ కాలేజ్ రిజల్ట్స్‌ను అమెరికన్ కాంగ్రెస్ జనవరి 6న అధికారికంగా ఆమోదించాలి. ఆ తర్వాతే కొత్త ప్రెసిడెంట్ వచ్చే ఏడాది జనవరి 20న మధ్యాహ్నం ప్రమాణం చేస్తారు.
లీగల్ పోరుపైనే ట్రంప్ దృష్టి
ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమిని ఒప్పుకోరని, ఆయన న్యాయపోరాటం చేస్తారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. రిపబ్లికన్ పార్టీ నేతల్లో కొందరు ఓటమిని ఒప్పుకోవాలని సూచిస్తుండగా.. చాలా మంది మాత్రం లీగల్‌గా ఫైట్ చేయాలంటున్నారు. అలాగే ట్రంప్ మీడియా సంస్థను ప్రారంభించనున్నారని, అందుకే కుర్చీ అప్పగింతను ఎక్కువ కాలం సాగదీయాలని చూస్తున్నారని అనలిస్టులు చెప్తున్నారు.
ఓటమిని ఒప్పుకోకుంటే ట్రంప్‌ను గెంటేస్తరా?
ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లో జో బైడెన్ అధికారికంగా గెలిస్తే.. ఆయనను కొత్త ప్రెసిడెంట్‌గా అధికారికంగా గుర్తిస్తారు. ఆ తర్వాతే బైడెన్ ప్రమాణం చేస్తారు. వచ్చే ఏడాది జనవరి 20న ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం సాఫీగా సాగేందుకు ఇప్పటి నుంచే అధికార మార్పిడి ప్రక్రియ మొదలెట్టాలి. అధికారం అప్పగింతకు ట్రంప్ ఒప్పుకోకుంటే.. జనవరి 20న ఆయనను ‘చొరబాటుదారు’ గా గుర్తిస్తారు. మిలిటరీ లేదా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ సాయంతో వైట్‌హౌస్ నుంచి ట్రంప్‌ను బలవంతంగా గెంటేస్తారని అనలిస్టులు చెప్తున్నారు.
For More News..