
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నిర్ణయాలు ప్రపంచ దేశాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వంలోని కొన్ని శాఖలనే ఎత్తేయటం.. ఆయా శాఖల్లోని ఉద్యోగులను పీకేయటం కలకలం రేపుతోంది. మొన్నటికి మొన్న ఫెడరల్ వ్యవస్థలోని ఉద్యోగులను ఇంటికి పంపించిన ట్రంప్.. ఇప్పుడు అమెరికా ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ (USAID)లోని 16 వందల మంది ఉద్యోగులను తొలగించారు. వీళ్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని.. వీళ్లను పీకేయటం ద్వారా ప్రభుత్వానికి చాలా డబ్బు ఆదా అవుతుందని ప్రకటించారు ట్రంప్.
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. ప్రభుత్వంపై ఆర్ధిక భారాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా ఉద్యోగుల ఏరివేత కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. రెండోసారి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టిన ట్రంప్ ఇప్పటి వరకు వివిధ విభాగాల్లోని దాదాపు 20 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించేశాడు. ఇదిలా ఉండగానే.. తాజాగా మరో 16 వందల మంది మంది ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చాడు ట్రంప్. అమెరికా ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ (USAID)లోని 16 వందల మంది ఉద్యోగులకు ట్రంప్ ఉద్వాసన పలికాడు.
మీరు ఇక ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదని.. ఇక మీ సేవలు చాలంటూ 1600 మందిని ఉద్యోగాలను తొలగించాడు ట్రంప్. మరికొందరిని సెలవులపై వెళ్లాలని ఆదేశించారు. ఈ మేరకు 2025, ఫిబ్రవరి 23న ఉద్యోగులకు ప్రభుత్వం మెయిల్ పంపినట్లు రాయిటర్స్ నివేదించింది. ‘‘బలగాల తగ్గింపు చర్యల్లో భాగంగా మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగించామని మీకు తెలియజేయడానికి నేను చింతిస్తున్నాను’’ అని ఉద్యోగులకు పంపిన మెయిల్లో పేర్కొన్నారు అధికారులు. ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జాబ్‌లను తొలగించబడ్డ ఉద్యోగులకు స్పష్టం చేశారు.
అమెరికా ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ అనేది అమెరికా విదేశీ సహాయం, అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సంస్థ. యూఎస్ఏఐడీ అమెరికా విదేశాలకు చేసే ఆర్థిక సహయాన్ని పర్యవేక్షిస్తోంది. 1961లో యూఎస్ఏఐడీని ఏర్పాటు చేశారు. ట్రంప్ రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యూఎస్ఏఐడీపై పలు ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగానే 2025, జనవరి 20న సెకండ్ టైమ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ విదేశీ సహాయాన్ని 90 రోజుల పాటు నిలిపివేస్తూ ఆదేశించారు. ఆకలి, ప్రాణాంతక వ్యాధులపై పోరాడే కార్యక్రమాల నుంచి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కల్పించడం వరకు ప్రతిదానికీ నిధులను నిలిపివేశారు ట్రంప్. యూఎస్ ఏఐడీ కార్యక్రమాలకు100 మిలియన్ల డాలర్ల కంటే తక్కువ మినహాయింపులు లభించాయి.
యూఎస్ఏఐడీ ఉద్యోగుల తొలగింపుకు వ్యతిరేకంగా పిటిషన్లను దాఖలు అయ్యాయి. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ తాత్కలికంగా వాయిదా వేయాలని పలువురు యూఎస్ఏఐడీ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను యూఎస్ జిల్లా న్యాయమూర్తి కార్ల్ నికోలస్ తిరస్కరించారు. యూఎస్ఏఐడీ ఉద్యోగుల తొలగింపుకు ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కోర్టులో ఊరట దక్కిన గంటల వ్యవధిలోనే ట్రంప్ 1600 మంది యూఎస్ ఏఐడీ ఉద్యోగాలను తొలగించారు. కేవలం ముఖ్యమైన, అత్యంత క్లిష్టమైన మిషన్లలో ఉన్న ఉద్యోగులను మాత్రమే విధుల్లో ఉంచి.. మిగిలిని కింది స్థాయి ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారు.