వాషింగ్టన్: అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను యూఎస్ ప్రెసిడెంట్ జోబైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ పట్టించుకోవడంలేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. మత వ్యతిరేక అజెండా నుంచి హిందూ అమెరికన్లకు రక్షణ కల్పిస్తానని, హిందువుల స్వేచ్ఛ కోసం పోరాడతానని హామీ ఇచ్చారు. దీపావళి సందర్భంగా ఇండియన్స్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ గురువారం సోషల్ మీడియా ‘ఎక్స్’లో ట్రంప్ పోస్టు పెట్టారు.
అందులో తన ప్రత్యర్థి, డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌పై విమర్శలు చేశారు. ‘‘బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రైస్తవులు, ఇతర మైనార్టీలపై జరుగుతున్న అనాగరిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీనివల్ల ఆ దేశంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. నా హయాంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను బైడెన్, కమల పట్టించుకోవడం లేదు.
ఇజ్రాయెల్, ఉక్రెయిన్ మొదలుకొని అమెరికా దక్షిణ సరిహద్దు వరకు విపత్తులు ఎన్నో ఉన్నాయి. మేం అధికారంలోకి వచ్చాక అమెరికాను మళ్లీ బలంగా తయారు చేస్తాం” అని చెప్పారు. భారత్‌తో అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. ‘‘నా పాలనలో భారత్‌తో, నా మిత్రుడు ప్రధాని మోదీతో భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తాను. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక” అని పేర్కొన్నారు.
బంగ్లాదేశ్‌లో 18 మంది హిందువులపై దేశద్రోహం కేసు..
బంగ్లాదేశ్‌లో 18 మంది హిందువులపై దేశద్రోహం కేసు పెట్టారు. బంగ్లాదేశ్ జాతీయ జెండాను తొలగించి, కాషాయ జెండాను ఎగరవేశారనే ఆరోపణలతో వాళ్లపై కేసు నమోదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 25న చిట్టగ్యాంగ్‌లో హిందువులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ టైమ్‌లో న్యూ మార్కెట్ ఏరియాలోని సర్కిల్లో కాషాయ జెండాను ఎగరవేశారు. అయితే బంగ్లాదేశ్ జాతీయ జెండాను తొలగించి, కాషాయ జెండాను ఎగరవేశారని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ లీడర్ ఫిరోజ్ ఖాన్ ఫిర్యాదు చేయడంతో అక్టోబర్ 31న పోలీసులు 18 మంది హిందువులపై దేశద్రోహం కేసు నమోదు చేశారు.