డాలర్ ఆధిపత్యమే ట్రంప్ ​లక్ష్యం!

డాలర్ ఆధిపత్యమే ట్రంప్ ​లక్ష్యం!

ట్రంప్  అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఆయన తీసుకున్న నిర్ణయాలతో ప్రభావితమయ్యాయి.  ట్రంప్​ తన ప్రమాణ స్వీకారోత్సవ ఉపన్యాసంలో  ఏమేమి నిర్ణయాలు తీసుకుంటారో  ముందుగానే అనేక విషయాలు ఉదహరిస్తూ  మాట్లాడారు.  ఆయన ధోరణి  గమనిస్తే వాటి ప్రభావాలు,   ప్రతిఫలాలు,  అభివృద్ధి చెందిన,  అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఎలా ఉండనుందో  పరిశీలించాల్సి ఉన్నది.  

గతంలో  పీవీ నరసింహారావు  ప్రధానమంత్రిగా ఉన్నప్పడు ఆయన మంత్రివర్గంలో  ఆర్థికమంత్రిగా  పనిచేసిన  మన్మోహన్ సింగ్ 1991లో  రూపాయిని  డాలరుతో  సర్దుబాటు చేయడం జరిగింది.  అప్పటి నుంచి  మొదలు  రూపాయి  విలువ  రోజురోజుకూ  పడిపోతూనే ఉన్నది.  సర్దుబాటు అనగానే  మనకి  అర్థమయ్యేది  రాజీపడటం అని తెలుస్తుంది. 

అప్పుడే  దేశంలో  పరిశ్రమల స్థాపన కోసం వివిధ  లైసెన్సుల  జారీని  సరళతరం చేశారు.  ఇటువంటి  మారకం  విషయాల  గురించి  నిపుణులైన  ఆర్థికవేత్తలు  చెపితే  మన దేశ వాణిజ్య, ఆర్థిక వ్యవహారాల పట్ల దేశ ప్రజలకు కూడా  అవగాహన పెరుగుతుంది.  రెండో  ప్రపంచ యుద్ధం తర్వాత  అప్పటివరకు అగ్రరాజ్యంగా కొనసాగిన  బ్రిటన్  స్థానంలోకి  అమెరికా  వచ్చింది.   

రెండో  ప్రపంచ యుద్ధంలో  పరోక్షంగా పాలుపంచుకున్న దేశాలతోపాటు ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్న దేశాలన్నీ  ఆర్థికంగా చితికిపోయాయి. ఈ నేపథ్యం ఇలా ఉంటే.. డోనాల్డ్​ ట్రంప్​ రెండోసారి అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన  పిదప  మాట్లాడిన తీరు చూస్తుంటే ఆయన తెంపరితనం కొట్టొచ్చినట్టు  కనపడింది.  

ట్రంప్​ నిర్ణయాల మొత్తం సారం ఏమంటే  ప్రపంచ దేశాల్లో  తిరుగు లేకుండా  అమెరికన్ డాలర్  ఆధిపత్యాన్ని కొనసాగించడమే ఆయన లక్ష్యంగా తెలుస్తోంది.  అందుకే,  ట్రంప్  ‘అమెరికా ఫస్ట్’​లాంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పవచ్చును.

ఆంక్షల కొరడా

అమెరికా వాణిజ్యం విషయంలో  మొదటి  నుంచి ప్రపంచ దేశాలపై  తన ఆధిపత్యాన్ని  కొనసాగిస్తూ ఉంటుంది. అందుకోసమే  దిగుమతులపై సుంకాలు పెంచుతామని  చెబుతున్నారు.  అమెరికా తయారుచేసే ఉత్పత్తులను  దిగుమతి  చేసుకుంటున్న  ఆయా  దేశాలపై  అనేక రకాల ఒత్తిళ్లను తెచ్చి,  నయాన  భయానా  బెదిరించి ఆయా దేశాలలోకి  దిగుమతి అవుతున్న  తమ సరుకులపై, యంత్రాలు, ఇతర సామగ్రిపై  తక్కువ  సుంకాలు  విధించేలా  అమెరికా వ్యవహరిస్తోంది. 

 తద్వారా  తమ దేశంలో ని ఉత్పత్తిదారులు,  పెట్టుబడిదారులకు లాభాలు   వచ్చేందుకు సహకరిస్తోంది.  ఇది  ట్రంప్  అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత మరింత  బహిరంగంగా స్పష్టమైనది.  ఇకపోతే  డాలరుతో  పోలిస్తే మన కరెన్సీ  విలువ పడిపోతూనే ఉంది.  దేశం నుంచి అమెరికాకు  వెళుతున్న మేధోవలసల పైన,   విద్యార్థుల పైన,  అమెరికాయేతర ఉద్యోగులకు  పుట్టబోయే  బిడ్డలపైనా  ఆంక్షలు  విధించే సూచనలు  కనిపిస్తున్నాయి. 

 డాలర్​ కలలు ఏం కానున్నాయి?

2023  గణాంకాల  ప్రకారం అమెరికా జనాభా సుమారు 34 కోట్లు.  అందులో  దాదాపు 15 శాతం మంది  ఇతర  దేశాల నుంచి వచ్చిన వలసవాదులుగా ఉన్నారు.  వలసవచ్చినవారిలో  అమెరికా గ్రీన్​కార్డు పొందిన కొందరు ఆ దేశ పౌరులుగా  గుర్తింపు పొందినవారు కూడా ఉన్నారు. వీరిపైన  ట్రంప్​ విధించే ఆంక్షల  ప్రభావం ఎలా ఉండబోతున్నదో  త్వరలో  తెలుస్తుంది.  మన దేశంలోని యువత  ఆర్థికంగా బలపడేందుకు  డాలర్  కలలు కంటూనే ఉంటుంది. 

తమ పిల్లల కలలను నిజం చేయడం కోసం అమెరికా యూనివర్సిటీలలో   ఎమ్మెస్ చేయడానికి విద్యార్థులు,  తల్లిదండ్రులు  లక్షలాది రూపాయలు  వెచ్చిస్తూనే ఉంటారు.  అమెరికాలో వినియోగ సంబంధిత వస్తువులు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి వినియోగదారులపై ఆర్థిక భారం పడుతుంది. దీంతో మన దేశం నుంచి వెళ్లి అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న  పిల్లల తల్లిదండ్రులపై  మోయలేనివిధంగా ఆర్థిక భారం పెరుగుతోంది.

డాలర్​ హవా

 వినియోగ వస్తువుల  ధరలు నియంత్రణ లేక పెరుగుతుంటాయి.  తద్వారా దేశం జీడీపీ  రేటు తగ్గుముఖం పడుతుంది.  రిజర్వ్ బ్యాంకు రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి  డాలర్లను  మార్కెట్లో  విక్రయిస్తుంది. అయినప్పటికీ  రూపాయి పతనం ఏమాత్రం ఆగడం లేదు.  స్టాక్ మార్కెట్లు  సున్నితమైన విషయాలకు సైతం ప్రతిస్పందిస్తూ  లక్షల కోట్ల సంపదను  కోల్పోతోంది.  స్టాక్ మార్కెట్లో   మదుపర్ల  పెట్టుబడులు ఊహించనివిధంగా  కొట్టుకుపోతాయి. 

1947లో   డాలరుతో  పోలిస్తే   రూపాయి  విలువ  రూ 3.30 ఉండగా , 1966లో   రూ.7.50,  1975లో   రూ. 8.39 ఉండేది.   అనంతరం 1990వ  సంవత్సరంలో  రూ.17.01 ఉండగా 1995  నాటికి  ఒక్కసారిగా రూ.32 .42కు క్షీణించి  రూపాయి పతనమైనది. ఈ కాలంలోనే మన దేశంలో  గుంభనంగా ఉన్న నూతన ఆర్థిక విధానాలు బహిరంగమయ్యాయి. 

 ప్రధాని స్పందన ఏది?

 ప్రస్తుత  ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా  ఉన్నప్పుడు  మాట్లాడిన  మాటలకు,  ప్రస్తుతం  దేశ ప్రధానిగా ఆయన అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు పొంతన లేకుండా పోయింది. ఇప్పటికీ  ట్రంప్  విధానాల మీద  దేశ ప్రధాని మాట్లాడకపోవడం వలన భారతదేశంలో నుంచి అమెరికా వలసపోయిన విద్యార్థులు,  మేధావులు వారి కుటుంబాలు ఎప్పుడు ఏం జరుగుతుందో అని తీవ్ర మానసిక వేదనకు లోనవుతున్నారు.  

2014వ  సంవత్సరంలో  డాలరుతో  పోలిస్తే రూపాయి విలువ 59.44 కాగా,   ప్రస్తుతం 2025 జనవరి 30 నాటికి  రూ.86.59కు దిగజారింది.  మన దేశానికి  వ్యూహాత్మక భాగస్వామిగా చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు ట్రంప్  ప్రమాణస్వీకారం తర్వాత ఆయన ప్రసంగాలు, చర్యలు,  సుంకాలు,  బెదిరింపుల పర్యవసానాల మూలంగా.. అమెరికా డాలర్ విలువ కళకళలాడుతుంటే మన రూపాయి విలువ వెలవెలపోతోంది.  

ఆర్థిక నిపుణుల  అంచనాల మేరకు  డాలరు విలువ మన కరెన్సీలో 90 రూపాయలకు చేరినా ఆశ్చర్యపడవలసింది లేదు.  స్వేచ్ఛావాణిజ్యం,  ప్రైవేటైజేషన్,  సరళీకరణ,  గ్లోబలైజేషన్ యుగంలో  అభివృద్ధి చెందుతున్న  ప్రపంచ దేశాల భవిష్యత్తు ఊహించుకుంటేనే ఒక విధమైన  జంకు కలుగుతున్నది.

- జూకంటి జగన్నాథం-