US News: ఆందోళనలో 3 లక్షల భారత స్టూడెంట్స్.. వర్క్ వీసాలకు ట్రంప్ గుడ్ బై..

US News: ఆందోళనలో 3 లక్షల భారత స్టూడెంట్స్.. వర్క్ వీసాలకు ట్రంప్ గుడ్ బై..

Optional Practical Training: ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల మారుతున్న పరిస్థితులతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ట్రంప్ రాకతో ఇమ్మిగ్రేషన్ పాలసీల నుంచి వీసాల వరకు అన్నింటిలోనూ కీలక మార్పులు చోటుచేసుకోవటం వారిని గందరగోళానికి గురిచేస్తోంది. పైగా చిన్న తప్పు చేసినా వీసాలను క్యాన్సిల్ చేస్తూ స్వదేశానికి వెళ్లిపోవాలంటూ అధికారులు మెయిల్స్ పంపటం విద్యార్థులకు నిద్ర లేకుండా చేస్తోంది.

ఈ క్రమంలోనే అమెరికా కాంగ్రెస్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రద్దు చేసేందుకు బిల్ తీసుకురావాలని చూస్తోంది. దీంతో అమెరికాలోని వివిధ దేశాల విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ చర్యలు దాదాపు 3 లక్షల మంది ఇండియన్ విద్యార్థులను నేరుగా ప్రభావితం చేస్తుందని వెల్లడైంది.  ఈ ఓపీటీ విధానం కింద ఎక్కువగా ప్రయోజనం పొందుతున్న వారి ఇండియన్ స్టూడెంట్స్ ఉండటంతో వారి కుంటుంబ సభ్యులు కూడా ఆవేదన చెందుతున్నారు. కేవలం 2023-24 అకెడమిక్ సంవత్సరంలో 97వేల 556 మంది భారతీయులు దీనివల్ల ప్రయోజనం పొందారు. అయితే ట్రంప్ సర్కార్ ఓపీటీ విధానాన్ని రద్దు చేస్తే దీనిపై ఆధారపడిన విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే అమెరికా వదిలి వెళ్లిపోవాల్సి ఉంటుంది.

అసలు ఓపీటీ ప్రోగామ్ ఏంటి..?
ఓపీటీ ప్రోగ్రామ్ అనేది అమెరికాలోని విదేశీ విద్యార్థులకు.. ముఖ్యంగా F-1 వీసాపై ఉన్నవారు చదువు పూర్తయ్యాక తమ ఫీల్డ్‌లో అనుభవం సంపాదించడానికి అనుమతిని అందించే ఒక ప్రోగ్రామ్. దీని ద్వారా విద్యార్థులు రీసెర్చ్ స్టడీ సంబంధం ఉన్న పనిలో పనిచేయవచ్చు. ఉదాహరణకు ఒక కంప్యూటర్ సైన్స్ విద్యార్థి తన బ్యాచిలర్ లేదా పీజీ డిగ్రీని పూర్తిచేసిన తర్వాత ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేయడానికి ఈ ఓపీటీ ప్రోగ్రామ్ ద్వారా అనుమతించబడతారు. ఇది విద్యార్థికి కోర్సు ముగిశాక కొన్ని నెలల వరకు అక్కడే పనిచేయటానికి వీలు కల్పిస్తుంది. ప్రధానంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ వంటి రంగాల్లోని విద్యార్థులకు ఇది దోహదపడుతుంది. 

అయితే ప్రస్తుతం ట్రంప్ సర్కార్ దీనిని ఎత్తేయాలని చూస్తోంది. ఇది విద్యార్థులపై ఆర్థికంగా ఒత్తిడిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఓపీటీ ప్రోగ్రామ్ కింద ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తర్వాత హెచ్1బీ వీసా పొందటానికి ప్రయత్నించటానికి ఉండే గడువును ట్రంప్ తొలగించాలనుకుంటున్న వేళ ఆందోళనలు మెుదలయ్యాయి. ఇది విద్యార్థులు అమెరికా రావటానికి చేసిన ఎడ్యుకేషన్ లోన్ రీపేమెంట్స్ కూడా కష్టతరంగా మార్చుతుందని నిపుణులు చెబుతున్నారు. పైగా పరిమిత సంఖ్యలో ఉండే హెచ్1బీ వీసాలు పొందటం అసాధ్యంగా మారుతుందని వారంటున్నారు. ఓపీటీ ద్వారా ఉద్యోగం సంపాదించి అమెరికాలో స్థిరపడాలనే విదేశీ విద్యార్థుల కల చెదిరిపోనుంది.