
వాషింగ్టన్: అమెరికాలో చదువుకుంటున్న విదేశీ స్టూడెంట్లపై, ప్రధానంగా లక్షలాది మంది ఇండియన్ స్టూడెంట్లపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సర్కార్ మరో బాంబు పేల్చింది. ఇప్పటికే ఇమిగ్రేషన్ రూల్స్ ను కఠినతరం చేయడంతో తీవ్ర ఆందోళనలో మునిగిన ఫారిన్ స్టూడెంట్లకు ఇప్పుడు వర్క్ వీసాల రద్దు పేరుతో మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) రంగాలలో చదువుతున్న విదేశీ స్టూడెంట్లకు చదువు అయిపోయిన తర్వాత కొన్నేండ్లపాటు అక్కడే పని చేసుకునేందుకు వీలుగా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్(ఓపీటీ) ప్రోగ్రాం అందుబాటులో ఉంది.
ఈ ప్రోగ్రాం కింద ఇచ్చే వర్క్ వీసాలతో ఇండియన్ స్టూడెంట్లు చదువు అయిపోయాక మూడు నాలుగేండ్లు పని చేసి, తమ ఎడ్యుకేషన్ లోన్లను కట్టుకుంటున్నారు. కానీ ఇప్పుడు స్టూడెంట్లకు వర్క్ వీసాలను అందించే ఓపీటీ ప్రోగ్రాంను రద్దుచేయాలని ట్రంప్ సర్కార్ యోచిస్తోంది. ఇందుకోసం అమెరికన్ కాంగ్రెస్లో బిల్లు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ బిల్లు గనక పాస్ అయితే దాదాపు 3 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్ల భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుంది. ‘ఓపెన్ డోర్స్ 2024’ రిపోర్ట్ ప్రకారం.. ఓపీటీ ప్రోగ్రాంను అత్యధికంగా ఇండియన్ స్టూడెంట్లే వినియోగించుకుంటున్నారు. 2023–24లో 97,556 మంది ఓపీటీ ప్రోగ్రాంతో లబ్ధి పొందారు. ఓపీటీ రద్దయితే ఇండియన్ స్టూడెంట్లు కోర్సు పూర్తయిన వెంటనే అమెరికాను విడిచిపెట్టి రావాల్సి ఉంటుంది.
హెచ్1బీ వీసాల కోసం పరుగులు..
అమెరికాలో ఎఫ్1, ఎం1 వీసాలతో ఉంటున్న స్టూడెంట్లు హెచ్1బీ వీసాలు పొందితే పని చేసేందుకు వీలుంటుంది. కానీ ఈ వీసాలు చాలా తక్కువ సంఖ్యలోనే జారీ అవుతుంటాయి. అందుకే కాంగ్రెస్లో ఓపీటీ రద్దుకు బిల్లు పాస్ అయ్యేలోపే హెచ్1బీ వీసా పొందాలని వేలాది మంది ఇండియన్ స్టూడెంట్లు ఇప్పుడు ఉరుకులుపరుగులు పెడుతున్నారు.