ఘోరం: చేతులకు.. కాళ్లకు సంకెళ్లు వేసి పంపుతున్నారు.. వలసదారులను తరలిస్తున్న ట్రంప్​ సర్కార్​

ఘోరం: చేతులకు.. కాళ్లకు సంకెళ్లు వేసి పంపుతున్నారు.. వలసదారులను  తరలిస్తున్న ట్రంప్​ సర్కార్​
  • పంజాబ్​లో ల్యాండైన మూడో విమానం
  • మరో 112 మందినితిప్పి పంపిన అమెరికా
  • శనివారం రాత్రి దిగిన రెండో విమానంలో 116 మంది
  • కాళ్లు, చేతులకు సంకెళ్లువేసి డిపోర్టేషన్
  • మర్డర్  కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

చండీగఢ్: అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వలసదారుల తరలింపు ప్రక్రియలో ట్రంప్  సర్కారు వేగం పెంచింది. శనివారం రాత్రి 116 మంది ఇండియన్లను వెనక్కి పంపిన అమెరికా.. ఆ మరుసటి రోజే మరో విమానంలో 112 మంది ఇండియన్లను పంపించింది. ఈ విమానం ఆదివారం అర్ధరాత్రి ల్యాండ్ అయిందని అమృత్ సర్ విమానాశ్రయం అధికారులు తెలిపారు. 

సెకండ్  బ్యాచ్ లో 116 మంది ఇండియన్లు ఉన్న విమానం శనివారం రాత్రి 11.34 గంటలకు పంజాబ్ లోని అమృత్ సర్ లో ల్యాండ్  అయింది. మూడు విమానాల్లో వచ్చిన వారి సంఖ్య 332కు చేరింది. ఈ నెల 5న 104 మందిని ఫస్ట్  బ్యాచ్ లో తరలించారు. ఇక సెకండ్  బ్యాచ్ లో డిపోర్ట్  అయిన వారిలో పంజాబ్ కు చెందిన వారు 65 మంది, హర్యానా నుంచి 33, గుజరాత్  నుంచి 8, ఉత్తరప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి ఇద్దరు చొప్పున, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్  నుంచి ఒకరు చొప్పున ఉన్నారు. 

అలాగే, మూడో బ్యాచ్ లో డిపోర్ట్  అయిన వారిలో చాలామంది హర్యానాకు చెందిన వారు ఉన్నారు. అందరూ 18 నుంచి 30 ఏండ్ల మధ్య వయసు ఉన్నవారే. అక్రమ వలసదారుల కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి అమెరికా ప్రభుత్వం తరలించింది. అమృత్ సర్  ఎయిర్ పోర్టులో దిగాక అధికారులు తనిఖీలు చేసి వలసదారులను పంపించారు. 

వారిని పంజాబ్  పోలీసులు వాహనాల్లో వారి స్వస్థలాలకు తీసుకెళ్లారు. అలాగే, హర్యానా ప్రభుత్వం కూడా వలసదారులు తమ స్వస్థలాలకు చేరుకోవడానికి రవాణా ఏర్పాట్లు చేసింది. కాగా.. పటియాలాలోని రాజ్ పురాకు చెందిన ఇద్దరు యువకులను ఓ మర్డర్  కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని సందీప్  సింగ్  అలియాస్  సన్నీ, ప్రదీప్  సింగ్ గా గుర్తించారు. 2023లో రాజ్ పురాలో ఓ హత్య కేసులో వారి ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు.