
వాషింగ్టన్: గ్రీన్ కార్డు అప్లికేషన్ల ప్రక్రియను ట్రంప్ సర్కారు నిలిపివేసింది. వివిధ దేశాల నుంచి అమెరికాలో ప్రవేశించిన శరణార్థులు గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అలాంటి వారు కొన్ని లక్షల మంది ఉన్నారు. అయితే, అక్రమ వలసదారుల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తున్న ట్రంప్ సర్కారు తాజాగా గ్రీన్ కార్డు ప్రాసెసింగ్‌ను చేపట్టకూడదని నిర్ణయించింది.
అమెరికాలో శాశ్వత నివాసం కోరుతూ శరణార్థి హోదా పొందిన ఇమిగ్రెంట్లు దాఖలు చేసిన అప్లికేషన్లను సస్పెండ్ చేసింది. ఈ నిర్ణయం వేలాది మంది ఇండియన్లపై ప్రభావం చూపనుంది. అమెరికాలో ఆశ్రయం కోసం 2023లో 51 వేల మంది ఇండియన్లు అప్లై చేశారు. 2018లో వారి సంఖ్య 9 వేలు ఉంటే, 2023లో 51 వేలకు చేరింది. అంటే ఐదేళ్లలో 466% పెరిగిందని జాన్ హాప్కిన్స్ వర్సిటీ తెలిపింది.
సరిహద్దుల వద్ద పట్టుబడిన అక్రమ వలసదారులు శరణార్థి హోదా కోసం దరఖాస్తు చేయడానికి అమెరికా ఇమిగ్రేషన్ వ్యవస్థ అనుమతి ఇస్తుంది. అయితే, ట్రంప్ సర్కారు మాత్రం అక్రమ వలసదారుల వ్యవహారంలో కఠిన వైఖరి అవలంబిస్తున్నది. చొరబాటుదారులను తిరిగి వారి స్వదేశాలకు పంపేందుకు, శరణార్థి స్టేటస్ ను నిలిపివేసేందుకు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు.