- 205 మందితో అమెరికా నుంచి బయలుదేరిన విమానం
- పంజాబ్లోని అమృత్‌సర్‌కు చేరుకుంటుందని మీడియా కథనాలు
- ఇమిగ్రేషన్చట్టాలను కఠినతరం చేసిన ట్రంప్సర్కారు.. 18వేల మంది ఇండియన్స్తో లిస్ట్ రెడీ..
- ఒక్కొక్కరినీ క్షుణ్నంగా తనిఖీ చేశాకే తరలిస్తున్నట్టు అధికార వర్గాల వెల్లడి
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక తాను చెప్పినట్టే చేసి చూపిస్తున్నారు. అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. అమెరికా ఇమిగ్రేషన్ చట్టాలను ట్రంప్ సర్కారు కఠినతరం చేయడంతో అమెరికా హిస్టరీలోనే అతిపెద్ద డిపోర్టేషన్ ఆపరేషన్ మొదలైంది. ఈ క్రమంలో అమెరికాలో ఎలాంటి పత్రాలు లేకుండా ఉంటున్న భారతీయులను వెనక్కి పంపిస్తున్నారు.
సోమవారం 205 మంది ఇండియన్ మైగ్రేంట్స్తో కూడిన విమానం భారత్‌కు బయలుదేరినట్టు మీడియా కథనాలు వెలువడ్డాయి. సీ17 అనే ఎయిర్‌క్రాఫ్ట్‌లో సాంట్ఆంటోనియా నుంచి విమానం బయలుదేరిందని, పంజాబ్లోని అమృత్‌సర్‌కు చేరుకుంటుందని పేర్కొన్నాయి. మైగ్రేంట్స్ను వెనక్కి పంపే ముందు ఒక్కొక్కరినీ క్షుణ్నంగా తనిఖీ చేసినట్టు అమెరికా అధికార వర్గాల సమాచారం.
అయితే, ఈ ప్రక్రియపై యూఎస్ ఎంబసీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ‘‘యూఎస్ తన సరిహద్దును బలోపేతం చేస్తున్నది. ఇమ్మిగ్రేషన్చట్టాలను కఠినతరం చేస్తున్నది. సరైన పత్రాలు లేకుండా ఉంటున్న వారిని అరెస్టు చేసి వెనక్కిపంపుతున్నది. అక్రమ వలసలు ప్రమాదకరం అనే మెసేజ్ పంపుతున్నది” అని ఓ ప్రతినిధి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, త్వరలోనే ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఉన్న నేపథ్యంలో ఇండియన్ల తరలింపు ప్రాధాన్యత సంతరించుకున్నది. తన పర్యటనలో మోదీ ఈ అంశంపై మాట్లాడే అవకాశం ఉన్నదని తెలుస్తోంది.
7.5 లక్షల మంది ఇండియన్లు..
అమెరికాలో సరైన పత్రాలు లేకుండా 7.50 లక్షల మంది భారతీయ వలసదారులు ఉంటున్నట్టు ప్యూ రీసెర్చ్‌సెంటర్ అంచనా. మెక్సికో, ఎల్ సాల్వడార్తర్వాత భారతీయుల సంఖ్యే అధికమని తేల్చింది. అయితే, వీళ్లందరినీ వెనక్కి పంపే ప్రక్రియ కొనసాగుతున్నదని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే 18వేల మంది ఇండియన్స్తో కూడిన ఫస్ట్ లిస్ట్‌ను యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ రూపొందించినట్టు సమాచారం.
కాగా, ఇల్లీగల్ మైగ్రేంట్స్పై అమెరికా తీసుకున్న నిర్ణయంపై భారత్ ఇప్పటికే తన స్పందన తెలియజేసింది. అక్రమ వలసలకు తాము కూడా వ్యతిరేకమని తెలిపింది. ఎలాంటి పత్రాలు లేని, వీసా గడువు ముగిసిన ఇండియన్స్ అమెరికాసహా ఎక్కడున్నా భారత్‌కు వచ్చేందుకు తాము వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ తెలిపింది.