ఫ్లోరిడా: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ టార్గెట్గా మరోసారి కాల్పులు జరిగాయి. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్లోని గోల్ఫ్ కోర్ట్లో ట్రంప్ గోల్ఫ్ ఆడుకుంటున్న సమయంలో ఓ దుండగుడు ఏకే-47 రైఫిల్ తో కాల్పులు జరిపేందుకు యత్నించాడు. సుమారుగా 400 గజాల దూరం నుంచి ట్రంప్ ను కాల్చేందుకు దుండగుడు ప్రయత్నించినట్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు తెలిపారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే అలర్ట్ అయి దుండగుడిపై కాల్పులు జరపడంతో ట్రంప్ సురక్షితంగా బయటపడ్డారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఎస్ యూవీలో పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఎట్టకేలకు పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ట్రంప్పై కాల్పులు జరపడానికి కారణమేంటనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
నిందితుడు పక్కా ప్లాన్ ప్రకారం ట్రంప్ పై కాల్పులు జరపాలని డిసైడ్ అయినట్లు అతని దగ్గర ఉన్న గోప్రో కెమెరా, రెండు బ్యాక్ప్యాక్స్ గమనిస్తే స్పష్టమైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ట్రంప్పై రెండోసారి కాల్పులు జరగడం గమనార్హం. జులై 13న ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయనపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బుల్లెట్ ఆయన చెవి మీదుగా దూసుకెళ్లడంతో ఆయన చెవికి కూడా గాయమైంది. సరిగ్గా.. ట్రంప్ పై కాల్పులు జరిగిన 8 రోజుల తర్వాత జో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచారు. నవంబర్ 5, 2024న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.