బంగ్లాదేశ్కు ఊహించని షాక్ ఇచ్చిన అమెరికా.. ట్రంప్ దెబ్బకు విలవిల..

బంగ్లాదేశ్కు ఊహించని షాక్ ఇచ్చిన అమెరికా.. ట్రంప్ దెబ్బకు విలవిల..

ప్రభుత్వ అస్థిరత కారణంగా తలెత్తిన సంక్షోభ పరిస్థితులతో బంగ్లాదేశ్ దయనీయ స్థితిలో ఉంది. ముహమ్మద్ యూనస్ నాయకత్వంలో మధ్యంతర ప్రభుత్వంతో నెట్టుకొస్తున్న బంగ్లాదేశ్ మరింత గడ్డు పరిస్థితులను చవిచూడబోతోంది. బంగ్లాదేశ్కు అమెరికా అందిస్తున్న ఆర్థిక సాయాన్ని తక్షణమే నిలిపివేయాలని ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయమే ఇందుకు కారణం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో బంగ్లాదేశ్ పరిస్థితి మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టయింది. USAID ద్వారా బంగ్లాదేశ్కు అందుతున్న కాంట్రాక్టులు, గ్రాంట్లు, సహకార ఒప్పందాలు.. అన్నింటినీ తక్షణమే తాత్కాలికంగా నిలుపుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు. ఈ మేరకు USAID ఒక లేఖను తాజాగా విడుదల చేసింది.

అమెరికా తన వంతుగా బంగ్లాదేశ్లో పరిస్థితులు చక్కదిద్దే పనుల్లో నిమగ్నమై కొన్ని ప్రాజెక్టులను భుజానికెత్తుకుని ముందుకెళుతుంది. ఈ ప్రాజెక్టులన్నింటినీ సస్పెండ్ చేస్తున్నట్లు USAID లేఖలో స్పష్టం చేసింది. ట్రంప్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం పలువురిని విస్మయానికి గురిచేసింది. మరీ ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఆర్థిక సంక్షోభం నెలకొన్న ఈ సమయంలో అమెరికా ఆర్థిక సాయాన్ని నిలిపివేయాలని డిసైడ్ అవడం కీలక పరిణామమనే చెప్పక తప్పదు.

1971 బంగ్లాదేశ్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లను కల్పించడాన్ని నిరసిస్తూ 2024, జులైలో సాగిన విద్యార్థి ఉద్యమం తీవ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలు ఎంత తీవ్ర రూపం దాల్చాయంటే.. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచిపెట్టి పారిపోయి ప్రస్తుతం భారత్లో తలదాచుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం పాలిస్తున్న యూనస్ నేతృత్వంలోని  మధ్యంతర  ప్రభుత్వం ఆ దేశంలో మైనార్టీలుగా ఉన్న హిందువుల రక్షణలో విఫలమైందని, హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమయ్యాయి.