Trump 26% Tariff: కలిసొచ్చిన ట్రంప్ టారిఫ్స్.. ఇండియాలో ఆ 2 రంగాలకు గెయిన్..

Trump 26% Tariff: కలిసొచ్చిన ట్రంప్ టారిఫ్స్.. ఇండియాలో ఆ 2 రంగాలకు గెయిన్..

Textile Sector: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తీసుకున్న సుంకాల నిర్ణయం వల్ల భారత్ పెద్దగా ప్రభావితం కాలేదని అసోచామ్ అధ్యక్షుడు సంజయ్ నాయర్ వెల్లడించారు. ఇప్పటికే ఫార్మా రంగంపై పెద్దగా ప్రభావం కనిపించకపోవటంతో ఫార్మా స్టాక్స్ ఊరటను పొందాయి. ఇక్కడ ట్రంప్ తన స్నేహితుడైన భారతదేశంపై ఇతర దేశాలకంటే తక్కువగా పన్నులు విధించటం కూడా కొన్ని రంగాలకు కలిసొస్తోంది. 

ట్రంప్ చాలా దేశాలపై ఇండియా కంటే అధిక రేటుతో పరస్పర పన్నులను ప్రకటించటం ప్రపంచ వాణిజ్యం, తయారీలో భారత్ బలం పుంజుకునేందు వ్యూహాత్మకంగా అవకాశాలను కల్పించిందని నిపుణులు చెబుతున్నారు. ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ఫార్మా ఉత్పత్తులు, సెమీకండక్టర్లు, రాగి, ఇంధన ఉత్పత్తులు టారిఫ్స్ నుంచి రిలీఫ్ పొందగా.. ఉక్కు, ఎల్యూమినియం, ఆటో సంబంధించి రంగాల వస్తువులు 25 శాతం సుంకాన్ని ఎదుర్కోనున్నాయి. మిగిలిన ఉత్పత్తులకు 27 శాతం పన్ను  వర్తించనుంది. 

కలిసొస్తున్న పరస్పర సుంకాలు..
అమెరికా ఇతర దేశాలపై విధించిన పన్నులను గమనిస్తే చైనాపై 54 శాతం, వియత్నాంపై 46 శాతం, బంగ్లాదేశ్ పై 37 శాతం, థాయిలాండ్ పై 36 శాతం సుంకాలను ప్రకటించింది. ఇది కొన్ని రంగాల్లో ఇండియా ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లో పోటీతత్వాన్ని ప్రదర్శించటానికి వీలు కల్పించనుంది. ముఖ్యంగా టెక్స్‌టైల్ రంగం పెద్ద ప్రయోజనాన్ని పొందనుంది. ఇప్పటికే ఆధిపత్యం చెలాయిస్తున్న చైనా, బంగ్లాదేశ్ వస్తువులు అమెరికా పన్నులతో మరింత ప్రియం కావటం భారత వస్త్ర పరిశ్రమలోని కంపెనీలకు వరంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది భారతీయ వస్త్ర ఎగుమతులకు అమెరికాలో డిమాండ్ పెంచేందుకు మార్గం సుగమం చేస్తోంది. 

సెమీకండక్టర్ పరిశ్రమకు లాభం..
ఇప్పటికే ఇండియా తన సెమీకండక్టర్ తయారీ ప్రయాణాన్ని మెుదలుపెట్టింది. ఇందుకోసం భారత ప్రభుత్వం ప్రొకడ్షన్ లింక్డ్ ప్రోత్సాహకాలను కూడా అందిస్తోంది. వియత్నాం, థాయిలాండ్, తైవాన్ వంటి దేశాలు అమెరికా నుంచి అధిక సుంకాలను చూస్తున్నందున భారత సెమీకండక్టర్ల పరిశ్రమ దీని నుంచి వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలుస్తోంది. పైగా తైవాన్ దేశంపో ట్రంప్ 32 శాతం సుంకాలు అక్కడి కంపెనీలు తమ ఉత్పత్తి కార్యకలాపాలను భారతదేశానికి తరలించటానికి అనుకూలమైన పరిస్థితులను కల్పించిందని, ఇక్కడి భాగస్వాములతో సెమీకండక్టర్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటును ఇది వేగవంతం చేయవచ్చు. మెుత్తం మీద ట్రంప్ దూకుడు భారత్‌కు కొత్త వ్యాపార అవకాశాలను కల్పిస్తోంది.