న్యూయార్క్: కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్ఏ 51వ రాష్ట్రంగా కెనడా ఉండాలని పిలుపునిచ్చారు. ఈమేరకు ఆయన ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టాడు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 51వ రాష్ట్రంగా కలిసిపోవడం మెజారిటీ కెనెడియన్లకు అంగీకారమేనని చెప్పారు.
కెనడాకు అధికంగా రాయితీలిచ్చి అమెరికా ఇంకా నష్టపోవాల్సిన అవసరంలేదన్నారు. ఇది ఆ దేశ ప్రధాని ట్రూడోకు ముందే తెలుసునని, అందుకే ఆయన రాజీనామా చేశారని తెలిపారు. యూఎస్ఏలో కెనడా భాగమైతే సుంకాల బాధ ఉండదని, రాయితీలు పెరుగుతాయని చెప్పారు. రష్యా, చైనాలకు చెందిన షిప్లనుంచి కెనడాకు ఇక ఎలాంటి ముప్పు ఉండదని అన్నారు. కెనడా ఇంకా ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతుందని ట్రంప్ కామెంట్ చేశారు.