21వ శతాబ్దపు ప్రపంచీకరణలో భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు రెండు దేశాలకు అత్యంత ముఖ్యమైనవి. భారత ఆర్థిక వ్యవస్థ, మార్కెట్ పరిమాణం ప్రపంచవ్యాప్తంగా పెరగటం, అమెరికన్ల వ్యాపార, రాజకీయాల్లో ప్రవాస భారతీయుల ప్రభావం కీలకంగా మారింది. చైనాను అడ్డుకోవలసిన ఆవశ్యకత, హిందూ పసిఫిక్ ప్రాంతంలో అమెరికా తన ప్రమేయాన్ని పెంచుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు, అదేవిధంగా భారతదేశం తన ప్రభావాన్ని బలోపేతానికి ఈ రెండు దేశాల మధ్య సహకారం అత్యంత అవశ్యం. భారత్, అమెరికాల మధ్య వాణిజ్య సంబంధాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి.
రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. గత పదేండ్లలో భారత ఎగుమతులు అధిక శాతం పెరిగాయి. 2014 ఆర్థిక సంవత్సరంలో 39.1 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2024 ఆర్థిక సంవత్సరంలో 77.5 బిలియన్ డాలర్లకు పెరిగాయి. స్థిరమైన ఎగుమతి స్థాయిలు అమెరికాతో భారతదేశం దృఢమైన వాణిజ్య సంబంధాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఇంజినీరింగ్ ఉత్పత్తులు, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్ సహా అనేక వస్తువులకు భారత్ కీలక గమ్యస్థానంగా ఉంది.
భారతదేశానికి పర్యాటక, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అమెరికా ప్రధాన వనరు. పలు అమెరికా కంపెనీలు భారత్‌ను కీలక మార్కెట్‌గా భావించి తమ కార్యకలాపాలను విస్తరించాయి. పలు భారతీయ కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెట్టి విలువను పెంచుకుంటున్నాయి. 2023 ఏప్రిల్‌లో విడుదల చేసిన సీఐఐ అధ్యయనం ప్రకారం 163 భారతీయ కంపెనీలు అమెరికాలో 40 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి. 4,25,000 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించాయి. ఏప్రిల్ 2000- సెప్టెంబర్ 2023 మధ్య 62.24 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐ ప్రవాహాలతో యుఎస్ఏ భారతదేశంలో మూడవ అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉంది. ఉన్నత విద్యకు భారతీయ విద్యార్థులు అత్యంత ఇష్టపడే గమ్యస్థానాల్లో అమెరికా ఒకటి. సెప్టెంబర్ 2023 నాటికి 3,20,260 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు, వీరిలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్ (మాస్టర్స్)లో ఉన్నారు. 2023లో భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం, కాన్సులేట్స్ రికార్డు స్థాయిలో 1.4 మిలియన్ల అమెరికా వీసాలను ప్రాసెస్ చేశాయి. 2022తో పోలిస్తే 60 శాతం దరఖాస్తులు పెరగడంతో అన్ని వీసా క్లాసుల్లో డిమాండ్ అనూహ్యంగా ఉంది.
యూఎస్‌కు భారీ ఎగుమతులు
యూఎస్‌కు భారతీయ ఎగుమతులలో ఎలక్ట్రికల్ మెషినరీలు, విలువైన రాళ్లు, ఫార్మాస్యూటికల్స్ ప్రధానమైనవి. 2023 ఆర్థిక సంవత్సరంలో భారత్ అమెరికాకు 7,753 వస్తువులను ఎగుమతి చేసింది. 2022 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ ఎగుమతులు 76.17 బిలియన్ డాలర్ల నుంచి 2023 ఆర్థిక సంవత్సరంలో 78.54 బిలియన్ డాలర్లకు పెరిగాయి. భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి చేయబడే ప్రధాన వస్తువులలో ముత్యాలు, విలువైన రాళ్ళు (9.20 బిలియన్ అమెరికన్ డాలర్లు) ఉన్నాయి.
2023 ఆర్థిక సంవత్సరంలో డ్రగ్ ఫార్ములేషన్స్, బయోలాజికల్స్ (6.77 బిలియన్ డాలర్లు), పెట్రోలియం ఉత్పత్తులు (6.03 బిలియన్ డాలర్లు), బంగారం, ఇతర విలువైన లోహ ఆభరణాలు (3.32 బిలియన్ డాలర్లు), యాక్సెసరీస్ సహా ఆర్ఎంజీ కాటన్ (3.12 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. 2023 ఏప్రిల్-– నవంబర్ మధ్య కాలంలో ఇంజినీరింగ్ వస్తువులు (11.46 బిలియన్ డాలర్లు), జెమ్స్ అండ్ జ్యువెలరీ (6.96 బిలియన్ డాలర్లు), ఎలక్ట్రానిక్ వస్తువులు (5.8 బిలియన్ డాలర్లు), డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ (5.53 బిలియన్ డాలర్లు), పెట్రో ఉత్పత్తులు (4.28 బిలియన్ డాలర్లు) మొదలైనవి.
యూఎస్ నుంచి దిగుమతులు
భారతదేశం యుఎస్ నుంచి ఖనిజ ఇంధనాలు, విలువైన లోహాలు, యంత్రాలను దిగుమతి చేసుకుంటోంది. అమెరికా నుంచి భారత్ దిగుమతుల్లో పెట్రోలియం క్రూడాయిల్ (10.18 బిలియన్ డాలర్లు), ఆ తర్వాత ముత్యాలు, విలువైన, పాక్షిక విలువైన రాళ్లు (5.38 బిలియన్ డాలర్లు), బొగ్గు, కోక్, బ్రికెట్లు మొదలైనవి (3.76 బిలియన్ డాలర్లు), పెట్రోలియం ఉత్పత్తులు (3.18 బిలియన్ డాలర్లు), బంగారం (1.88 బిలియన్ డాలర్లు) ఉన్నాయి.
భారతదేశం, అమెరికా మధ్య మొత్తం ద్వైపాక్షిక వాణిజ్యం (వస్తువులు, సేవలు) 2000లో 20 బిలియన్ డాలర్ల నుంచి 2018లో 142 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2021లో వస్తువులు, సేవలలో మొత్తం యూఎస్. -ఇండియా ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో 157 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత ఎగుమతులు 78.54 బిలియన్ డాలర్లు, భారత్‌కు అమెరికా ఎగుమతులు 50.24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో అమెరికాతో భారత్ 28.30 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులును కలిగి ఉంది.
ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం
బహుముఖ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో పర్యటనల ఫలితాలు కీలకంగా ఉన్నాయి. 2019లో హ్యూస్టన్లో జరిగిన 'హౌడీ మోదీ', 2020లో భారత్‌లో 'నమస్తే ట్రంప్' వంటి హైప్రొఫైల్ ఈవెంట్లు తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేశాయని, అమెరికా- ఇండియా స్ట్రాటజిక్ కాంప్రహెన్సివ్ గ్లోబల్ పార్టనర్షిప్ ఎదగడానికి దోహదపడ్డా యని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్ మధ్య ఉన్నతస్థాయి పరస్పర చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆయా నేతలు పలు ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. క్వాడ్, I2U2 (ఇండియా, ఇజ్రాయెల్, అమెరికా, యూఏఈ), సమ్మిట్ ఫర్ డెమోక్రసీతో సహా అధ్యక్షుడు బైడెన్ ఏర్పాటు చేసిన వర్చువల్ సమ్మిట్‌లలో కూడా ప్రధాని మోదీ పాల్గొన్నారు.
ఐటీ రంగంపై ప్రభావం
అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో సైతం అమెరికా ప్రయోజనాలే తమకు ముఖ్యమని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఈ విధానం భారతీయ నిపుణులపై, ప్రత్యేకించి ఐటీ రంగంలో ప్రభావం చూపుతోంది. అమెరికాలో పనిచేసే భారతీయ సాంకేతిక నిపుణుల సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. నైపుణ్యం కలిగిన భారతీయప్రతిభపై ఆధారపడే భారతీయ టెక్నాలజీ సంస్థల మధ్య ఘర్షణను సృష్టిస్తుంది. అమెరికా స్వేచ్ఛ వాణిజ్యవాదం నుంచి రక్షణ వాణిజ్య విధానం వైపు దూసుకు వెళ్తుంది. అమెరికాకు చైనా పట్ల ఉన్న ప్రతికూల అభిప్రాయంతో ఈ ప్రభావం చైనాకు వ్యతిరేకంగాను భారత్‌కు
అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది.
సవాళ్లు, అవకాశాలు
భారత్‌తో సంబంధాలను పెంపొందించుకోవడానికి ఆసక్తి చూపుతున్న ట్రంప్ ఇరు దేశాల మధ్య గొప్ప భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు బహిరంగ హామీలు ఇచ్చారు. క్వాడ్ (అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా) పునరుద్ధరణ వంటి కార్యక్రమాలతో అమెరికా, -భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలనే ఆకాంక్షను ట్రంప్ వ్యక్తం చేశారు. ప్రాంతీయ భద్రతలో భారత్ ప్రయోజనాలకు అనుగుణంగా చైనాను ఎదుర్కోవడంపై ఈ దృష్టి కొనసాగవచ్చు. అమెరికాకు ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్‌కు, ఐటీ, ఫార్మాస్యూటికల్స్ టెక్స్‌టైల్స్ వంటి కీలక రంగాలపై ఇటువంటి విధానాలు గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. అధిక టారిఫ్‌ల అవకాశం అమెరికాతో భారతదేశ వాణిజ్య సంబంధాలను దెబ్బతీస్తుంది. చైనీస్ ఉత్పత్తికి ప్రత్యామ్నాయాలను కోరుకునే యూఎస్ వ్యాపారాలను ఆకర్షించడం ద్వారా భారతదేశం తనను తాను ప్రపంచ తయారీ కేంద్రంగా ఉంచుకోవడానికి అవకాశాలను సృష్టించగలదు.
- చిట్టెడ్డి కృష్ణారెడ్డి,
అసోసియేట్ ప్రొఫెసర్, హెచ్‌సీయూ