అమెరికా రాజకీయాల్లో ట్రంప్​ దుమారం! : మల్లంపల్లి ధూర్జటి

అ మెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ వార్తల్లోకి ఎక్కారనడం కన్నా వార్తల్లో వ్యక్తిగా కొనసాగుతూనే ఉన్నారనడం సబబు. తాజాగా మాన్ హాటన్ గ్రాండ్ జ్యూరీ చేసిన నేరారోపణతో ట్రంప్ అరెస్టు, ఆయన మరోసారి అధ్యక్ష పదవికి పోటీపడడానికి ఉన్న అవకాశాలపైన చర్చ మొదలైంది. స్టార్మీ డేనియల్స్ అనే యువతితో తనకున్న  లైంగిక బాగోతం వ్యవహారాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు, సూటిగా చెప్పాలంటే ‘యాగీ చేయకుండా నోరు మూసుకుని ఉండేందుకు’ ఆమెకు ట్రంప్ అక్షరాలా లక్ష 30 వేల డాలర్లు చెల్లించారని అభియోగం. ట్రంప్ తన వ్యక్తిగత న్యాయవాది కొహెన్ ద్వారా ఆ నగదును చెల్లించారని ఆరోపణ.

ట్రంప్ ఆదేశం మేరకు తాను ఆ నగదును చేరవేసిన సంగతిని కొహెన్ కూడా అంగీకరించారు. నిజానికి, అమెరికాలో అటువంటి చెల్లింపు జరపడం నేరం కాదు. కానీ, ట్రంప్ దాన్ని వ్యాపార వ్యయంగా పద్దుల పుస్తకాల్లో చూపించారట. న్యూయార్క్ లో అది చట్ట విరుద్ధం. చెల్లింపు అంశాన్ని కప్పిపుచ్చడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని  ప్రాసిక్యూటర్లు వాదించే అవకాశం ఉంది. స్టార్మీతో సెక్స్  ఓటర్లకు తెలియనివ్వకూడదనే ఉద్దేశంతోనే చెల్లింపు లావాదేవీకి వ్యాపార రంగు పులిమారని వారు పేర్కొనవచ్చు.

ట్రంప్​ అరెస్టు? 

నెవాడాలో 2006లో ఒక సెలబ్రిటీ గోల్ఫ్ టోర్నమెంట్ కి ముందు ట్రంప్ తో డేనియల్స్ కి పరిచయమైంది. అది ఇద్దరూ పడక సుఖం పంచుకునేటట్లు చేసింది. సమాచార సాధనాలు చేతిలో ఉన్న  ట్రంప్  ద అప్రెంటిస్ అనే షోలో ఆమెకు గెస్ట్ అప్పియరెన్స్ ఇప్పిస్తానని వాగ్దానం చేశారు. కానీ, కథ అంతటితో కంచికి చేరలేదు. ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడే అంశాన్ని 2011లో తీవ్రంగా పరిశీలిస్తున్న సమయంలో ఆమె ఆ నెవాడా రాసలీలను ఒక మ్యాగజైన్ కు వెల్లడించింది.

దావా వేయగలమనే బెదిరింపు రావడంతో ఆ పత్రిక ఆ కథనాన్ని ప్రచురించలేదు. అల్లరి పెట్టకుండా ఉండేందుకు డేనియల్స్ కు కొహెన్ నగదును ముట్టజెప్పారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యారు. పదవిలో ఉన్న వ్యక్తి రాసలీలను బయటపెడితే ఇంకా మజాగా ఉంటుందని అమెరికా వార్తాపత్రిక ఒకటి జరిగిన సంగతిని 2018లో వెల్లడించింది. ట్రంప్ సంస్థ లెక్కల్లో అసత్య సమాచారాన్ని మాన్ హాటన్ డిస్ట్రిక్ట్ అటార్నీ ఆఫీసు దర్యాప్తు మొదలెట్టింది. ‘రచ్చ చేయనందుకు రొక్కం’ వ్యవహారంలో సాక్ష్యాధారాలను వినేందుకు గ్రాండ్ జ్యూరీ ఈ ఏడాది మార్చి 15న సమావేశమైంది. కొహెన్ ను మూడు గంటలపాటు ప్రశ్నించింది.

దాని పర్యవసానంగానే ట్రంప్ తనను అరెస్టు చేయగల అవకాశం ఉందంటూ మార్చి 15న ట్వీట్ చేశారు. ఈ కేసులో ట్రంప్ విచారణకు హాజరు కాగల అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే, ఈ సందర్భంగా తనను నిర్బంధంలోకి తీసుకోవడం, విచారించడం వంటివి చేస్తారని ట్రంప్ కు తెలుసు. 

అర్హతలు - అనర్హతలు

అమెరికా అధ్యక్షుడు కాగోరే వ్యక్తి అమెరికాలో జన్మించినవారై ఉండాలి. పోటీపడే సమయానికి 35 ఏళ్ళ వయసు కలిగి, అప్పటికి కనీసం 14 ఏళ్ళుగా అమెరికాలో నివసిస్తూ ఉండాలి. ఇక అమెరికా అధ్యక్ష పదవిని రెండుసార్లు చేపట్టినవారు మూడవసారి పోటీ చేయడానికి లేదని 22వ రాజ్యాంగ సవరణ పేర్కొంటోంది. అనర్హత అంశాన్ని 14వ సవరణలో ప్రస్తావించారు కానీ, తిరుగుబాటు, విద్రోహం వంటివాటికి పాల్పడి ఉండాలి.

“రచ్చ చేయనందుకు రొక్కం” వ్యవహారం వాటి కిందకు రాదు. ప్రతినిధుల సభ అభిశంసించి. సెనేట్ కూడా దోషిగా నిర్ధారిస్తే సదరు అభ్యర్థి అనర్హుడవుతారు. ప్రతినిధుల సభ గతంలో ట్రంప్ ను రెండుసార్లు అభిశంసించింది. కానీ, సెనేట్ రెండు పర్యాయాలూ ఆయనను నిర్దోషిగా పేర్కొంది. మొత్తానికి, అమెరికా రాజకీయాలు కొత్త పుంతలు తొక్కబోతున్నాయి. ఆ మార్గ స్వరూప స్వభావాలు రానున్న రోజుల్లో మనకు వెల్లడవుతాయి. 

ఎవరీ లలామ? 

స్టార్మీ డేనియల్స్ అసలు పేరు స్టిఫానీ గ్రెగరీ. ఆమె 1979లో పుట్టారు. చిన్నతనం లూసియానా రాష్ట్రంలోని  బ్యాటన్ రూజ్ లో గడిచింది. తండ్రి పారిశ్రామిక టెక్నీషియన్. వృత్తిరీత్యా ఊళ్ళు తిరుగుతూ ఉండేవారు. కొంతకాలం తర్వాత తండ్రి వీరిని విడిచి వెళ్ళిపోయాడు. స్ట్రిప్ క్లబ్బులలో మిగిలిన అమ్మాయిలు డబ్బు సంపాదించడం చూసి, స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే ఈమె కూడా అదే దారి బట్టింది. యుక్త వయసు వచ్చిన తర్వాత ‘ఎక్స్’  ముద్రపడిన సినిమాల్లో నటించడం ప్రారంభించింది.

ద ఫార్టీ ఇయరోల్డ్ వర్జిన్ అనే చిత్రంలో హాస్య పాత్ర ఆమెకు పేరు తెచ్చిపెట్టింది. చిత్రం నీలిచిత్రాలకు దర్శకత్వం వహించే బాథాలమ్యూ క్లిఫర్డ్ ను పెళ్ళి చేసుకుంది. తర్వాత, భర్తతో విడాకుల అనంతరం, ఆమె పేరు స్టిఫానీ గ్రెగరీ క్లిఫర్డ్ గానే కొనసాగింది. తర్వాత మరో రెండు పెళ్ళిళ్ళు చేసుకుందికానీ, అవీ పెటాకులయ్యాయి. ఆమె 44 ఏళ్ళ వయసులో గత ఏడాది మరో పెళ్ళి చేసుకుని తన పేరును స్టార్మీ డేనియల్స్ బారెట్ గా మార్చుకున్నారు. పేరుకు తగ్గట్లుగానే ఆమె ఇపుడు ట్రంప్ పాలిట ‘దుమారం’ గా మారారు.

సానుభూతిగా మలుచుకోవాలని..

మరోసారి అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడాలని చూస్తున్న ట్రంప్ ఈ సందర్భంగా కొంత సానుభూతిని మూటగట్టుకోవాలని చూస్తున్నారు. ‘ఇది రాజకీయంగా పీడించడమే. చరిత్రలోనే మొదటిసారిగా ఎన్నికల అంశంలో ఉన్నత స్థాయి జోక్యమే’ నని ట్రంప్ అంటున్నారు. గతంలో రిచర్డ్ నిక్సన్ అధ్యక్ష పదవిలో ఉండగా, ఇలాగే విచారణకు సన్నాహాలు మొదలైనపుడు ఆయన పదవి నుంచి వైదొలగారు. కానీ, ట్రంప్ స్వభావం అటువంటిది కాదు.  అమెరికన్ రాజకీయ చరిత్రలో అధ్యక్ష పదవిని చేపట్టినవారిలో  క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మొదటి వ్యక్తిగా అపఖ్యాతిని మూటగట్టుకున్న ట్రంప్  ఎదురు దాడికి దిగడానికి సిద్ధమవుతున్నారు.

ఈ ప్రతికూల పరిస్థితులను ఆయన తనకు అనుకూలంగా మార్చుకున్నా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ట్రంప్ ప్రచారానికి వాడుకోవడానికి తగిన అంశాలు కొన్ని ఇందులో ఇమిడి ఉన్నాయి. ఈ కేసు రాజకీయ, సామాజిక, జాతిపరమైన పర్యవసానాలను కలిగి ఉంది. అందుకే, రాజకీయ కక్షసాధింపు, న్యాయ వ్యవస్థకు ఆయుధాలందివ్వడం, న్యాయం దక్కకుండా చేయడం వంటి వ్యాఖ్యలు ట్రంప్ మద్దతుదారుల నుంచి జోరుగా వినిపిస్తున్నాయి.  

ఇతర కేసులు

డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ 2020లో అమెరికా అధ్యక్షుడైనపుడు ఆ ఓటమిని జీర్ణించుకోలేని ట్రంప్ తన మద్దతుదారులను క్యాపిటోల్ హిల్ పైకి ఉసిగొల్పారు. అల్లర్లు చెలరేగాయి. ట్రంప్ పై వచ్చిన అనేకానేక వ్యాజ్యాల్లో ఇదొకటి. అలాగే, ఫ్లోరిడాలోని మర్ అలాగో ఎస్టేట్ (ట్రంప్ నివాసం) లో ప్రభుత్వానికి చెందిన రహస్య పత్రాలు లభ్యమయ్యాయనే అంశంపై  న్యాయ శాఖ దర్యాప్తు జరుపుతోంది. ఆ నేరం రుజువైతే పదేళ్ళ జైలు శిక్షపడుతుంది.  జార్జియాలో 2020 ఎన్నికల ఫలితాలను వక్రీకరించేందుకు ట్రంప్ చేసినట్లు చెబుతున్న ప్రయత్నాలపై సాగుతున్న ఉన్నత దర్యాప్తులో ఆయనపై నేరారోపణ రావడం అనివార్య మని ప్రాసిక్యూటర్ ఫానీ విలిస్ అంటున్నారు.  

ట్రంప్ ఆస్తుల విషయంలో నికర విలువను అసలు విలువకన్నా కోట్లాది డాలర్లు  ఎక్కువగా చిత్రించారని ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులు ఆర్థిక మోసాలకు పాల్పడ్డారని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెతూష జేమ్   సివిల్ దావా వేశారు. ట్రంప్ తో తనకు కూడా  లైంగిక సంబంధం ఉందంటూ కరెన్ మెక్ డూగల్ అనే మరో వనిత కూడా ముందుకొచ్చారు. ప్లేబాయ్ పత్రిక ఆమెను 1998 సంవత్సరపు ప్లేమేట్ గా ఎంపిక చేసింది. ప్లే బాయ్ మాన్షన్ లో 2006 జూన్ లో తాను ట్రంప్ ను కలిశానని, తమ మధ్య సంబంధం 2007 ఏప్రిల్ వరకు కొనసాగిందని ఆమె చెబుతున్నారు. -

మల్లంపల్లి ధూర్జటి, సీనియర్​ జర్నలిస్ట్​