
Trump Citizenship Proof: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రస్తుతం ఫెడరల్ వ్యవస్థలో ఉన్న లోపాలను, జాప్యాలను ఒక్కొక్కటిగా ప్రక్షాళన చేసే పనిలో ఉన్నారు. యూఎస్ ఎన్నికల ప్రక్రియలో లోపాలను సరిదిద్దటంతో పాటు పారదర్శకంగా ఖచ్చితమైన ఓటింగ్ వ్యవస్థను తీసుకొచ్చే క్రమంలో కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ విడుదల చేశారు. అమెరికాలో నిష్పాక్షికంగా ఎన్నికలను నిర్వహించటంతో పాటు చట్టవిరుద్ధమైన జోక్యాలను నివారించాలనే లక్ష్యంతో ఈ ఆర్డర్ వస్తోంది.
వాస్తవానికి ఇండియా, బ్రెజిల్ వంటి దేశాల్లో ఓటర్ల జాబితాను సిద్ధం చేయటం, తప్పులను తొలగించటానికి బయోమెట్రిక్ విధానాన్ని ఉపయోగించటాన్ని ట్రంప్ ఈ సందర్భంగా ఉదహరించారు. ఇలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి ఎన్నికల నిర్వహణలో కొన్ని అంశాలను తీసుకోవాలని ట్రంప్ ఈ సందర్భంగా సంకేతాలు పంపారు. అలాగే ఎన్నికల ప్రక్రియలో అవసరమైన ప్రాథమిక అంశాలతో పాటు సెక్యూరిటీ విషయంలోనూ యూఎస్ విఫలమైందని తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ట్రంప్ పేర్కొనటం సంచలనంగా మారింది.
అమెరికా ఇప్పటికీ ఎన్నికల్లో ఓటు వేసే ఓటర్ల పౌరసత్వాన్ని నిర్థారించటానికి స్వీయ-ధృవీకరణపై ఆధారపడటాన్ని ట్రంప్ తప్పుపట్టారు. ఎన్నికలో పాల్గొన్న ఓటర్ల సంఖ్య నుంచి ఓట్ల ఖచ్చితమైన లెక్కల వరకు ప్రతి విషయంలోనూ జోక్యాలను నివారించాలని అప్పుడే స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలు జరుగుతాయని ట్రంప్ పిలుపునిచ్చారు. ఇందుకోసం అమెరికా ఎన్నికల ప్రక్రియలో ఉన్న అనేక లోపాలను ముందుగా గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు.
సరైన విజేతలను నిర్ణయించటానికి ఓటర్ల జాబితాలో అమెరికా పౌరులు ఉండటం చాలా ముఖ్యమైనదిగా ట్రంప్ అభివర్ణించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఫెడరల్ ఏజెన్సీలతో కలిసి పనిచేయటం అవసరమని ట్రంప్ పేర్కొన్నారు. ఎన్నికల తర్వాతి రోజున రాష్ట్రాలు అందుకునే బ్యాలెట్లను లెక్కించటాన్ని నిరోధించాలని అలాగే పౌరులు కాని వ్యక్తులను ఓటర్ జాబితాలో నమోదును రాష్ట్రాలు అడ్డుకోవాలని ట్రంప్ తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో పేర్కొన్నారు.
అయితే ప్రస్తుతం ట్రంప్ తీసుకొస్తున్న చర్యలతో అమెరికా ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయనే విషయాన్ని పరిశీలిస్తే..
- ఓటర్ల పౌరసత్వం వెరిఫికేషన్
- రాష్ట్ర ప్రభుత్వాలు ఫెడరల్ డిపార్ట్మెంట్లతో కలిసి పనిచేయటం
- అమెరికా పౌరులు కానివారికి ఓటు హక్కు నిరోధించే చట్టాల కఠిన అమలు
- ఓటర్ల నమోదుకు సంబంధించిన జాబితాను చట్టప్రకారం నిర్వహించటం
- ఫెడరల్ డేటాబేస్ వివరాలను రాష్ట్రాలతో పంచుకోవటం ద్వారా ఓటర్లను వెరిఫికేషన్ చేసేందుకు అవకాశం కల్పించటం. దీని ద్వారా సోషల్ సెక్యూరిటీ, చనిపోయిన వారి వివరాలు పంచుకోవటం
- ఎన్నికల నిర్వహణ కమిషన్ నిర్వహణలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టడం
- ఎన్నికల సమయంలో చేసే చట్టవిరుద్ధమైన పనులపై చట్టపరంగా దర్యాప్తు చేసి కఠినంగా చర్యలు తీసుకోవటం
- ఓటింగ్ ప్రక్రియలో భద్రతను మెరుగుపరచటం
- ఎన్నికల రోజున రాష్ట్రాలు ఫెడరల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగటం