ఐఫోన్ లవర్స్‌కి టారిఫ్స్ షాక్.. రూ.2 లక్షలు కానున్న ఆపిల్ ఫోన్..!!

ఐఫోన్ లవర్స్‌కి టారిఫ్స్ షాక్.. రూ.2 లక్షలు కానున్న ఆపిల్ ఫోన్..!!

Tariffs Effect on iPhones: ప్రపంచ వ్యాప్తంగా కొత్తకొత్త ఫోన్ బ్రాండ్లు రోజురోజుకూ పుట్టుకొస్తూనే ఉన్నాయి. అవి ఎన్ని ఫీచర్లు అందిస్తున్నప్పటికీ ఆపిల్ ఉత్పత్తి చేసే ఐఫోన్ల ముందు అదంతా దిగదుడుపే. దీనికి కారణం ఐఫోన్లకు మార్కెట్లో ప్రజల నుంచి ఉన్న ఆదరణగా చెప్పుకోవచ్చు. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్స్ ఐఫోన్ కొనుగోలును ఖరీదైన లగ్జరీ వస్తువుగా మార్చేస్తోంది.

అనేక దశాబ్ధాలుగా అమెరికా ప్రపంచ టెక్ ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా కొనసాగింది. ప్రధానంగా ఆపిల్ ఉత్పత్తుల విక్రయంతో యూఎస్ టాప్ స్థానాన్ని కొనసాగిస్తూ వచ్చింది. వాస్తవానికి ఐఫోన్ల డిజైన్ అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్నప్పటికీ వాటి ఉత్పత్తి మాత్రం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో జరుగుతోంది. ప్రధానంగా ఐఫోన్ల తయారీ ఎక్కువగా చైనాలో జరుగుతుండగా గడచిన కొన్నేళ్లుగా ఇండియాలో కూడా వీటి ఉత్పత్తి కొనసాగుతోంది. అయితే ట్రంప్ కొత్త టారిఫ్స్ పాలసీ కింద అమెరికా ప్రజలకు ఐఫోన్లు అందుబాటులో లేని ధరలకు పెరగొచ్చని తెలుస్తోంది.

అయితే పెరిగిన సుంకాల భారాన్ని ఆపిల్ సంస్థ తన కస్టమర్లకు పాస్ చేస్తే ఐఫోన్ల రిటైల్ విక్రయ ధరలు భారీగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. చైనాపై ట్రంప్ విధించిన 34 శాతం సుంకాలతో ఏదైనా వస్తువును చైనా నుంచి దిగుమతి చేసుకోవాలంటే మెుత్తంగా 54 శాతం వరకు వాటిపై సుంకాలు అమలు అవుతాయి. ఈ పరిస్థితుల్లో ఐఫోన్ టాప్ మోడల్ ధర 2వేల 300 వందల డాలర్లకు చేరుకోవచ్చని తెలుస్తోంది. భారత కరెన్సీ లెక్కల ప్రకారం అమెరికా మార్కెట్లలో రిటైల్ ఐఫోన్ రేటు రూ.2 లక్షలకు చేరుకుంటుందని వెల్లడైంది.

ప్రస్తుతం భారతదేశం కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన కొత్త పన్ను టారిఫ్స్ కింద ప్రభావితం అయినందున ఇక్కడి ఐఫోన్ విక్రయ ధరల్లో కూడా మార్పులకు ఆపిల్ సంస్థ వెళ్లొచ్చని తెలుస్తోంది.  2024లో ఇండియాలో తయారైన ఐఫోన్ల ఎగుమతుల విలువ 1 ట్రిలియన్ రూపాయల మార్కును అధిగమించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఆపిల్ తన సేల్స్ దెబ్బతినకుండా చూసుకోవాలంటే వాటి ఉత్పత్తి వ్యయాలను పెరగకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. దీంతో తయారీని చైనా, ఇండియా వంటి దేశాల నుంచి అమెరికాకు మార్చాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ALSO READ : ట్రంప్ ఎఫెక్ట్.. గ్రీన్​ కార్డున్నా.. హెచ్​1బీపై వెళ్లినా కఠినమే

అయితే ప్రస్తుతం ట్రంప్ ప్రకటించిన టారిఫ్స్ ప్రభావం కేవలం ఆపిల్ కంపెనీకి మాత్రమే వర్తించదని.. ఇతర టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, హెచ్ పి, డెల్ వంటి సంస్థల ఉత్పత్తుల రేట్లపై కూడా ఈ ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ దేశాలు సైతం తమ ఉత్పత్తుల అసెంబ్లింగ్ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో నిర్వహించటమే దీనికి కారణంగా వారు చెబుతున్నారు. ఏప్రిల్ 9 నుంచి అమలులోకి వస్తున్న కొత్త టారిఫ్స్ ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన టెక్ ఉత్పత్తుల ధరలను సగటు అమెరికన్ కొనుగోలుదారులకు అందుబాటులో లేకుండా చేయెుచ్చని తెలుస్తోంది. వీటి వల్ల ఎక్కువగా అమెరికా ప్రజలపైనే ఎక్కువ ప్రభావం ఉండొచ్చని అది ద్రవ్యోల్బణం పెరుగుదలను ప్రేరేపించొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.