
- డ్రాగన్ కంట్రీపై సుంకాలు
- 104 నుంచి 125 శాతానికి పెంపు
- అంతకుముందు ప్రతీకారంగా అమెరికాపై చైనా 84% టారిఫ్ విధించడంతో యాక్షన్
- ట్రంప్ ప్రకటనతో భారీగా పెరిగిన యూఎస్ స్టాక్ మార్కెట్లు
వాషింగ్టన్: ప్రపంచ దేశాలపై వరుసగా టారిఫ్‌ల మీద టారిఫ్‌లు ప్రకటిస్తూ బెంబేలెత్తించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా చైనా మినహా అన్ని దేశాలకూ ఊరటనిచ్చారు. అన్ని దేశాలపై ప్రకటించిన టారిఫ్ ల అమలును 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. చైనాపై ఇప్పటికే 54% టారిఫ్ లను విధించగా.. బుధవారం నుంచి మరో 50% కలిపి 104% సుంకాలు అమలు చేస్తున్నామని ట్రంప్ మంగళవారమే ప్రకటించారు. కానీ చైనా ప్రతీకారంగా అమెరికాపై తామూ 50% సుంకాలు పెంచి 84% అమలు చేస్తామని బుధవారం ప్రకటించింది. దీంతో చైనా ప్రకటన తర్వాత ట్రంప్ మరింత తీవ్రంగా స్పందించారు. చైనాపై 104 శాతం కాదు.. 125% టారిఫ్‌లు విధిస్తున్నామని, ఇవి తక్షణమే అమలులోకి వస్తున్నాయని తేల్చిచెప్పారు. ‘‘75కు పైగా దేశాలు అమెరికాపై ప్రతీకార చర్యలకు దిగలేదు. డీల్స్ కుదుర్చుకునేందుకు చర్చలు జరుపుదామని మమ్మల్ని సంప్రదించాయి. కానీ ఒక్క చైనా మాత్రమే మమ్మల్ని ప్రతిఘటిస్తూ ప్రతీకార సుంకాలు ప్రకటించింది. అందుకే ఆ ఒక్క దేశం మినహా మిగతా అన్ని దేశాలపై టారిఫ్‌ల అమలును 90 రోజుల పాటు వాయిదా వేయాలని నిర్ణయించాను” అని బుధవారం ఆయన తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ప్రకటన చేశారు. చైనాపై 125 శాతం సుంకాలు వెంటనే అమలులోకి వచ్చాయని, మిగతా అన్ని దేశాలపై మాత్రం 10% బేస్ లైన్ టారిఫ్ లు యథావిధిగా అమలవుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. ‘‘అమెరికా, ఇతర దేశాలను ఆర్థికంగా విచ్ఛిన్నం చేయడం ఇక ఎంత మాత్రం సాధ్యం కాదని చైనా త్వరలోనే గ్రహిస్తుందని ఆశిస్తున్నా” అని ఆయన పేర్కొన్నారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు గ్రీన్‌లోకి
అమెరికా విధిస్తున్న టారిఫ్‌లకు ప్రతీకారంగా ఆ దేశంపై చైనా 50 శాతం నుంచి 84శాతానికి సుంకాలను పెంచడంతో బుధవారం కాస్త పడిన యూఎస్ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా గ్రీన్‌లోకి వచ్చా యి. చైనా తప్ప అన్ని దేశాలపై తాము విధించే టారిఫ్‌లను 90రో జులు నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో భారీ లాభాల బాట పట్టాయి. అక్కడి కీలకమైన ఇండెక్స్ డోజోన్స్ 6 నుంచి 7 శాతం.. నాస్డాక్ అయితే ఏకంగా 10 శాతం పెరిగింది. ఈ నెల 2న ట్రంప్ టారిఫ్‌ల విధింపు ప్రకటన చేసిన మరుసటి రెండు రోజు లు 10 శాతం వరకు పడిన యూఎస్ స్టాక్ మార్కెట్లు ఇప్పుడు అదే స్థాయిలో పైకి లేచాయి. యూఎస్‌లో ట్రేడ్ అయ్యే ఇండియా నిఫ్టి (గిఫ్ట్ నిఫ్టి) కూడా 3 నుంచి 4 శాతం పాజిటివ్‌లో కొనసాగుతున్నది.