ఇజ్రాయెల్​కు అమెరికా వెపన్స్​:బైడెన్ ​విధించిన నిషేధాన్ని ఎత్తేసిన ట్రంప్​

ఇజ్రాయెల్​కు అమెరికా వెపన్స్​:బైడెన్ ​విధించిన నిషేధాన్ని ఎత్తేసిన ట్రంప్​
  • 2000 పౌండ్ల బరువైన బాంబులు పంపుతున్నామని వెల్లడి

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టాక డొనాల్డ్​ ట్రంప్​ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గాజాలోని రఫాలో  విధ్వంస తీవ్రతను తగ్గించేందుకు గత బైడెన్‌‌ సర్కారు తీసుకొన్న నిర్ణయాన్ని తాజా ప్రెసిడెంట్​ ట్రంప్‌‌ ఎత్తేశారు. ఇజ్రాయెల్‌‌కు బంకర్‌‌ బస్టర్‌‌ బాంబుల సరఫరాను పునరుద్ధరించాలని  నిర్ణయించారు.

2,000  పౌండ్ల బరువున్న బాంబులను సరఫరా చేసేందుకు ట్రంప్ గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చినట్టు వైట్​హౌస్​ వర్గాలు వెల్లడించాయి. రాబోయే రోజుల్లో దాదాపు 1,800 ఎంకే 84 బాంబులను ఇజ్రాయెల్​కు సరఫరా చేయనున్నట్టు తెలిపాయి. అలాగే, ట్రంప్​ నిర్ణయాన్ని ఇజ్రాయెల్​కు చేరవేసినట్టు పేర్కొన్నాయి.

ఇజ్రాయెల్​కు బాంబులు పంపిస్తున్నాం: ట్రంప్​

ఇజ్రాయెల్​ చాలా వస్తువులను అమెరికానుంచి ఆర్డర్​ చేసిందని, వాటికోసం డబ్బులు కూడా చెల్లించిందని ట్రంప్​ పేర్కొన్నారు. కానీ.. వాటిని బైడెన్​ ఆపేశారని, ప్రస్తుతం వాటిని తాము పంపిస్తున్నామని ట్రూత్​ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం 2000 పౌండ్ల బరువున్న బాంబులు ఇజ్రాయెల్​కు బయలుదేరాయని వెల్లడించారు.

గాజా స్ట్రిప్​ను క్లీన్​ చేసేందుకు ఎక్కువ సంఖ్యలో పాలస్తీనా శరణార్థులను ఈజిప్ట్​, జోర్డాన్, ఇతర అరబ్​ దేశాలు తమ దేశాల్లోకి అంగీకరించాలని ఆయన కోరారు. ఇప్పటికే ఆయా దేశాలతో మాట్లాడానని చెప్పారు.