చాలామంది భారతీయులు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రతికూలంగా అంచనా వేస్తున్నారు ఎందుకంటే వారు అమెరికాను ఇమ్మిగ్రేషన్ కోణం, వర్క్ వీసాలు, స్టూడెంట్ వీసాలు, గ్రీన్ కార్డులు, పౌరసత్వం దిశగా మాత్రమే చూస్తారు. ఇది చైనీస్ ఆహార రుచి ఆధారంగా చైనాను అంచనా వేసినట్టే అవుతుంది. భారతీయులు అధిక అర్హత కలిగి ఉన్నందున వారు మెరిట్ ఆధారంగా మాత్రమే అమెరికాకి వెళతారు.
ట్రంప్ వలసలను, ముఖ్యంగా అక్రమ వలసలను, అమెరికాకి వచ్చే నైపుణ్యం లేని కార్మికులను వ్యతిరేకిస్తున్నారని స్థిరమైన అభిప్రాయంతో భారతీయులు ఉన్నారు. ట్రంప్ గురించి మనవారిలో సహజమైన ఆందోళన ఉంది. అయితే, అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, బరాక్ ఒబామా పట్ల భారతీయులకు గొప్ప ఇమేజ్ ఉంది. అయినప్పటికీ వారు అన్ని రంగాలలో భారతదేశానికి గరిష్టస్థాయిలో నష్టాన్ని కలిగించారు.
1952కు ముందు భారతీయులను అమెరికా పౌరసత్వం నుంచి నిషేధించారు. 1952లోనే యూఎస్ఏలో చట్టాలు ఆమోదం పొందాయని గుర్తుంచుకోవాలి. ఈ పరిణామం ఆసియన్లు అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించింది. అప్పటివరకు, జాతిప్రాతిపదికన ఆసియన్లు అమెరికా పౌరసత్వం నుంచి ఎక్కువగా నిషేధానికి గురయ్యారు. ఇటీవల వరకు అమెరికాలోని భారతీయులు శ్వేతజాతి ప్రాంతాలలో గృహాలను పొందలేరనే విషయాన్ని ప్రజలు మర్చిపోయారు.
భారతీయులపై ఒబామా వ్యతిరేకత..ట్రంప్ సానుకూలత 2008-2016 మధ్య.. ఒబామా అమెరికాలో ‘బెంగళూరు’ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. అమెరికన్లు బాగా చదవకపోతే, వారి ఉద్యోగాలన్నీ బెంగళూరుకే వెళ్తాయని ఒబామా చెప్పేవారు. ఎందుకంటే వారు అత్యంత విద్యావంతులు కాబట్టి అని భారతీయులపై ఒబామా ద్వేషాన్ని సృష్టించారు. సందర్శన కోసం భారత దేశానికి వచ్చిన వారికి తిరిగి వీసాలు నిరాకరించే విధానాన్ని కూడా ఒబామా తీసుకువచ్చారు.
కాగా, 2017లో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైనప్పుడు, ఆయన వలసలపై కఠినమైన చట్టాలను అమలు చేశారు. ఇది భారతీయులను కూడా ప్రభావితం చేసింది. 2020లో ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, ట్రంప్ అమెరికాలో పనిచేసే భారతీయుల గురించి తన మనసు మార్చుకున్నారు. అమెరికన్ టెక్నాలజీ కంపెనీలకు భారతీయులు పెద్ద పునాది అని ట్రంప్ తెలుసుకున్నారు.
ఎస్టీఈఎం (అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ డిగ్రీలు) చదివితే భారతీయులకు గ్రీన్ కార్డులు ఇవ్వాలని తరచుగా ట్రంప్ చెబుతూ ఉండేవారు. అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైనప్పటి నుంచి ట్రంప్ చేసిన ప్రకటనలు పరిశీలిస్తే.. 2021లో జో బైడెన్ అధ్యక్షుడైనప్పటి నుంచి అమెరికాలోకి ప్రవేశించిన 50 లక్షల మంది అక్రమ వలసదారులను తాను బహిష్కరిస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, ఇది భారతీయులను ప్రభావితం చేయదు, ఎందుకంటే భారతదేశం అక్రమ వలసలను ప్రోత్సహించదు.
ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తరువాత...
2025 జనవరి 20న తాను అధ్యక్షుడైన మొదటి రోజున ‘జన్మహక్కు పౌరసత్వం’ను అనుమతించే చట్టాన్ని నిలిపివేస్తానని ట్రంప్ చెప్పారు. కాగా, 1862లో అమెరికా ‘సహజ జన్మ పౌరసత్వం’ అనే చట్టాన్ని ఆమోదించింది. ఇది అమెరికాలో జన్మించిన బానిసలు ఆఫ్రికాకు సహాయపడటానికి, ప్రపంచవ్యాప్తంగా తెలివైన వ్యక్తులు పర్యాటకులుగా అమెరికాకి వెళ్లి పిల్లలకు జన్మనివ్వడంతో వారు అమెరికా పౌరసత్వం పొందారు.
ట్రంప్ ఈ కార్యకలాపాన్నిఆపాలనుకుంటున్నారు. ట్రంప్ ఇప్పుడు అన్ని టెక్నాలజీ కంపెనీలకు దగ్గరగా ఉన్నారు. భారతదేశం నుంచి మానవశక్తి లేకపోతే వారి కంపెనీలు తమ ప్రయోజనాన్ని కోల్పోతాయని ఎలాన్ మస్క్, గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, యూట్యూబ్ తదితర ఇతర టెక్నాలజీ కంపెనీలు ట్రంప్‌కు వివరించాయి. ట్రంప్ విధానాలు భారతీయులను ప్రోత్సహిస్తాయనేది కాదనలేని వాస్తవం.
ట్రంప్ తన మొదటి పదవీకాలంలో పాలనపై ఆందోళన చెందడం ప్రస్తుతం అనవసరమనే చెప్పాలి. ట్రంప్ మిగతా ప్రపంచానికి ఏమి చేయాలని ప్రతిపాదిస్తున్నారో దానిపట్ల భారతీయులకు ఆందోళన అనవసరం. భారత ప్రధాని మోదీకి ట్రంప్‌తో మంచి స్నేహ బంధం ఉంది. ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో వలస విధానాల కారణంగా భారతదేశం పట్ల కొంచెం ప్రతికూలంగా ఉన్నారు.
రెండోసారి తన పాలనకాలంలో ట్రంప్ అదే విధానాన్ని కొనసాగించవచ్చని చాలామంది అంటున్నారు. అయినప్పటికీ భారతీయుల పట్ల ఆయన సానుకూలంగానే మాట్లాడతారు. ట్రంప్ తనను కలిసే వ్యక్తులు వినడానికి ఇష్టపడే విషయాలను చెబుతారని కొందరు పరిశీలకులు అంటున్నారు.
వాణిజ్య ఆందోళనలు
భారతదేశం అమెరికాతో తన వాణిజ్య అసమతుల్యతను తగ్గించుకోవాలని ట్రంప్ డిమాండ్ చేస్తారు. ఎందుకంటే భారతదేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకునే దానికంటే చాలా ఎక్కువగా ఎగుమతి చేస్తోంది. భారతదేశం అమెరికా నుంచి ఎక్కువగా చమురు, గ్యాస్‌ను దిగుమతి చేసుకోవలసి ఉంటుంది. దీనివల్ల భారత్‌కు ఎటువంటి ఇబ్బంది లేదు.
భారతదేశం తీసుకోవలసిన బెస్ట్ స్టెప్ ఏమిటంటే, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), అన్ని ఇతర సాంకేతిక విషయాల వంటి సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యను పెంచాలి. మనం పాత విద్యావ్యవస్థపై ఆధారపడలేం. భారతదేశం సాంకేతిక విద్యలో మిగిలిన ప్రపంచం కంటే ముందుండాలి. అప్పుడే భారతీయులకు డిమాండ్ కొనసాగుతుంది. భారతీయులకు ఎడ్యుకేషనల్ అడ్వాంటేజ్ ఉన్నప్పుడే భారతదేశంలోనే కొత్త కంపెనీలు స్థాపించడం జరుగుతుంది.
డోనాల్డ్ ట్రంప్.... భారతదేశం పట్ల మంచిగా ఉన్నా లేకపోయినా దాన్ని పట్టించుకోనవసరం లేదు. భారతదేశం తన సాంకేతిక విద్యా ప్రయోజనాన్ని నిలుపుకోవాలి. భారతదేశ గొప్ప నాగరికత ఎవరి దయతోనూ లేదు. సమాజం, ప్రభుత్వం విద్య అత్యున్నత ప్రమాణాలను ప్రోత్సహిస్తే భారతీయులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మొత్తం ప్రపంచానికి భారతీయులకు ఉన్న నైపుణ్యాలు అవసరం. భారతదేశం తన విద్యా ప్రయోజనాలను పెంచుకుంటే ఆందోళన అవసరమే లేదు.
ట్రంప్ ఖచ్చితంగా చేసే పనులు
అమెరికాలో జన్మించిన విదేశీయులకు పౌరసత్వం నిరాకరించే అవకాశం ఉంది. మీరు అమెరికాలో జన్మించినట్లయితే మీరు యూఎస్ఏ పౌరసత్వం పొందుతారని చట్టం చెబుతోంది. అయితే, 20 జనవరి 2025న ఈ చట్టాన్ని మారుస్తానని ట్రంప్ చెప్పారు. కొంతమంది భారతీయులు ఈ చట్టం ద్వారా ప్రయోజనం పొందారు. ఇప్పుడు ట్రంప్ దానిని రద్దు చేయనున్నారు. హెచ్1బీ వీసాలపై, ట్రంప్ టెక్నాలజీ కంపెనీల మాట వింటే, భారతీయులు గతంలో కంటే ఎక్కువ మేలు పొందుతారు. కానీ, ట్రంప్ ఎలా వ్యవహరిస్తారో మనం చూడాలి.
ప్రతి టెక్నాలజీ కంపెనీ చీఫ్ ట్రంప్‌తో తమకు భారతదేశం నుంచి మేధో శక్తి అవసరమని ఇప్పటికే తెలిపారు. కాగా, ట్రంప్ మాత్రమే కాదు, అమెరికాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులంతా చైనాను దాని టెక్నాలజీని నియంత్రించాలనుకుంటున్నారు. అమెరికా చైనాకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎగుమతి చేయడాన్ని నిషేధిస్తోంది. అమెరికా కంపెనీలు చైనాను విడిచి వెళ్ళేలా చేయడానికి కూడా ఒక విధానం పాటిస్తోంది. అందుకే భారతదేశం కొన్ని ‘ఆపిల్’ ఫ్యాక్టరీలను పొందుతోంది.
- పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్-