చైనాను అడ్డుకోకుంటే .. పనామా కాల్వను తీస్కుంటం : ట్రంప్​ వార్నింగ్​

చైనాను అడ్డుకోకుంటే .. పనామా కాల్వను  తీస్కుంటం : ట్రంప్​ వార్నింగ్​
  • అమెరికా ప్రెసిడెంట్​ ట్రంప్​ వార్నింగ్​
  • పనామా ప్రెసిడెంట్ ములినో​తో  యూఎస్​ విదేశాంగ మంత్రి  భేటీ  

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక పొరుగు దేశాలతో దూకుడుగా వ్యవహరిస్తున్న డొనాల్డ్​ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలతో విరుచుకుపడిన ఆయన.. తాజాగా పనామా కాలువపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పనామా కాలువపై కీలక నిర్ణయాలుంటాయని హెచ్చరించారు. ఆ కాలువను బలవంతంగా తీసుకుంటామని సంకేతాలిచ్చారు. ‘అట్లాంటిక్, పసిఫిక్​ మహా సముద్రాలను కలిపే కీలకమైన జలమార్గమైన పనామాను మేం చైనాకు ఇవ్వలేదు. అయినా.. చైనా దీన్ని పరోక్షంగా నిర్వహిస్తున్నది. ఒప్పందాన్ని పనామా ఉల్లంఘిస్తున్నది. అందుకే మే కాలువను వెనక్కు తీసుకుంటాం.  త్వరలోనే దీనిపై పవర్​ఫుల్​ నిర్ణయం ఉంటుంది” అని చెప్పారు. అయితే, ఇందుకు సైనిక బలగాల అవసరం ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 

పనామాపై చర్యలు తీసుకుంటాం: రుబియో

పనామా ప్రెసిడెంట్​ జోస్​రౌల్​ ములినోతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో భేటీ అయ్యారు.  పనామా కాలువపై చైనా జోక్యాన్ని, నియంత్రణను అడ్డుకోవాలని సూచించారు. లేకుంటే పనామా విషయంలో అమెరికా తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. కాగా, మీటింగ్​ అనంతరం పనామా అధ్యక్షుడు ములినో మీడియాతో మాట్లాడారు. రుబియోతో సమావేశం గౌరవప్రదంగా, స్నేహపూర్వకంగా జరిగిందని చెప్పారు. అమెరికా బెదిరింపులు, దురాక్రమణలకు తాము భయపడబోమని తేల్చిచెప్పారు. పనామా విషయంలో తాము చర్చలకు ప్రతిపాదించినట్టు చెప్పారు.

చైనాతో ఒప్పందంపై పనామా వెనక్కి

చైనా బెల్ట్​ అండ్​ రోడ్​ ఇన్షియేటివ్ ​నుంచి తప్పుకోవాలని పనామా నిర్ణయించింది. 2017లో చైనాతో చేసుకున్న ఒప్పందాన్ని తాము పునరుద్ధరించబోమని పనామా ప్రెసిడెంట్​ ములినో ప్రకటించారు.

మెక్సికోపై టారిఫ్​లు నెల నిలిపివేత 

మెక్సికో వస్తువులపై అమెరికా విధించిన 25% టారిఫ్ ల అమలుకు నెల రోజులు బ్రేక్ పడింది. మంగళవారం నుంచి టారిఫ్ లు అమలులోకి రావాల్సి ఉండగా.. ఇరుదేశాల ప్రెసిడెంట్లు క్లాడియా షేన్ బామ్, ట్రంప్ సోమవారం చర్చలు జరిపారు. టారిఫ్​ల అమలును నెల రోజులు నిలిపివేస్తున్నట్టు వేర్వేరుగా ప్రకటించా రు. కెనడాపై టారిఫ్​ల విషయంలోనూ ట్రూడో తో మాట్లాడానని, సోమవారం మధ్యాహ్నం మరోసారి మాట్లాడతానని ట్రంప్ చెప్పారు.