
వాషింగ్టన్: జమ్మూ కాశ్మీర్ పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో శుక్రవారం (ఏప్రిల్ 25) ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. బహిరంగంగా తొలిసారి ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడిని ఒక దుశ్చర్యగా అభివర్ణించిన ట్రంప్.. ఈ టెర్రర్ ఎటాక్‌ను తీవ్రంగా ఖండించారు. కశ్మీర్ విషయంలో భారత్, పాక్ మధ్య ఏళ్ల తరబడి కొనసాగుతోన్న వివాదంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రెండు దేశాలు సామరస్యపూర్వకంగా కశ్మీర్ సమస్యలను పరిష్కరించుకుంటాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. దాదాపు 1000 సంవత్సరాలుగా కశ్మీర్ విషయంలో భారత్, పాక్ మధ్య వివాదం నడుస్తోందన్నారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పాకిస్థాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడ్డదే 1947లో అలాంటప్పుడు.. 1000 సంవత్సరాలుగా కశ్మీర్ వివాదం ఎలా నడుస్తోందని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అంతకముందు.. పహల్గాం టెర్రర్ ఎటాక్ జరిగిన వెంటనే ట్రంప్ స్పందించారు. ప్రధాని మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. హేయమైన దాడికి పాల్పడిన వారిని శిక్షించేందుకు భారత్‌కు పూర్తిగా అండగా ఉంటామన్నారు. ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు లేదన్నారు.
కాగా, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ఏరియా బైసారన్ మైదాన ప్రాంతంలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. ఉగ్రమూకలు కురిపించిన తుటాల వర్షానికి 28 మంది పర్యాటకులు బలయ్యారు. ఈ ఉగ్రదాడి వెనక పాక్ హస్తం ఉన్నట్లు గుర్తించిన భారత్.. దాయాది దేశంపై తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలోనే పాక్‌తో పూర్తిగా దౌత్య సంబంధాలు తెంచుకుని.. పలు ఆంక్షలు విధించింది. సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుని పాక్‌ను దెబ్బకొట్టింది.