వాషింగ్టన్: అమెరికా పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని వచ్చే వారంలో కలుస్తానని ఆ దేశ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. బుధవారం మిచిగాన్‌లో నిర్వహించిన ఎన్నికల క్యాంపెయిన్‌లో ఆయన ఈ విషయం ప్రకటించారు. త్వరలోనే మోదీ తనను కలుస్తారని చెప్పారు. మోదీ ఓ అద్భుతమైన వ్యక్తి అని కొనియాడుతూనే, మన దేశ వాణిజ్య విధానాన్ని ట్రంప్ తప్పు పట్టారు.
దిగుమతులపై భారత్ భారీగా ట్యాక్స్‌లు విధిస్తోందని అన్నారు. నిజానికి ట్రంప్ దేశాధ్యక్షుడు కానప్పటికీ, ఇతర దేశాల అధినేతలు అమెరికాకు వచ్చినప్పుడల్లా కలుస్తూనే ఉన్నారు. 2020 ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడి హోదాలో ట్రంప్ మనదేశానికి వచ్చినప్పుడు ఆయన మోదీతో చివరిసారిగా భేటీ అయ్యారు.
మోదీ మూడ్రోజుల పర్యటన
ప్రధాని మోదీ సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటిస్తారు. మొదటిరోజు డెలావర్‌లో క్వాడ్ సమిట్‌లో పాల్గొంటారు. న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లో జరిగే కార్యక్రమంలో ఎన్ఆర్ఐలతో భేటీ అవుతారు.