
- ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నం: ట్రంప్
- ఇండియా, చైనా, బ్రెజిల్‌పై దిగుమతి సుంకాలు పెంచుతం
- ఇక నుంచి అమెరికన్ల ప్రయోజనాలే ముఖ్యమని కామెంట్
- ఫిబ్రవరిలో మోదీ వైట్‌హౌస్‌కు వస్తారని వెల్లడి
వాషింగ్టన్: అమెరికన్లకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి విముక్తి కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీంతో వ్యక్తులు, కుటుంబాల ఆదాయం పెరుగుతుందన్నారు. ప్రతి అమెరికన్ తన కనీస అవసరాలు, ఈఎంఐలు వంటి వాటి కోసం ఖర్చు చేశాక మిగిలిన ఆదాయాన్ని (డిస్పోజబుల్ ఇన్కమ్) పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. దీని కోసం వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై సుంకాలు పెంచనున్నట్లు ప్రకటించారు. ప్రజలంతా తమ చేతిలో ఉన్న డబ్బును స్వేచ్ఛగా ఖర్చు పెట్టాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో నిధుల ప్రవాహాన్ని పెంచేందుకు సహకరించాలని కోరారు. ప్రధానంగా ఇండియా, చైనా, బ్రెజిల్‌పై అత్యధిక పన్నులు విధిస్తామని ప్రకటించారు. పలు దేశాలు తమపై వేసే పన్నుల కారణంగా అమెరికన్లు శ్రమ దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. అమెరికాను అడ్డం పెట్టుకుని చాలా దేశాలు లాభాలు పొందుతున్నాయన్నారు. ఫ్లోరిడా రిట్రీట్‌లో రిపబ్లికన్లను ఉద్దేశిస్తూ ట్రంప్ మాట్లాడారు. ‘‘అత్యధిక పన్నులు విధించే దేశాల నుంచి అమెరికాను కాపాడుకోవాల్సిన టైమ్ వచ్చింది. ఇతర దేశాలను సంపన్నులను చేసేందుకు అమెరికన్లపై పన్నులు వేయడం సరికాదు. ఇక నుంచి మన అమెరికన్లను ధనవంతులను చేస్తా. దీని కోసం కొన్ని దేశాలపై పన్నులు విధిస్తాను. అమెరికన్లను మరింత ధనవంతులు, శక్తివంతులుగా చేసే ఆర్థిక వ్యవస్థను తిరిగి తీసుకొస్తాను’’అని ట్రంప్ ప్రకటించారు.
ఫిబ్రవరిలో మోదీ అమెరికా వస్తరు!
ఇండియా ప్రధాని నరేంద్ర మోదీ.. ఫిబ్రవరిలో అమెరికాకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. సోమవారం ఉదయం మోదీతో ఫోన్లో మాట్లాడినట్లు వివరించారు. ఫ్లోరిడా నుంచి జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు తిరిగి వస్తుండగా.. ఎయిర్‌ఫోర్స్ వన్‌లో జర్నలిస్టులతో ట్రంప్ మాట్లాడారు. ఇండియాతో తమకు మంచి అనుబంధం ఉందన్నారు. మోదీ మంచి వ్యక్తి అని.. ప్రపంచం మొత్తం ఆయన్ను ఇష్టపడుతుందన్నారు. ఇండియా ఓ అద్భుతమైన దేశమని కొనియాడారు. ఫిబ్రవరిలో మోదీ వైట్‌హౌస్‌కు వస్తారన్నారు. మోదీ అమెరికాకు వచ్చినప్పుడు అక్రమ వలసదారులుగా వచ్చిన ఇండియన్ల గురించి చర్చిస్తానన్నారు. చట్టబద్ధంగా స్వదేశానికి రప్పించే విషయంలో ఇండియా సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు వెల్లడించారు.
‘ఎక్స్‌టర్నల్ రెవెన్యూ సర్వీస్’ సంస్థ ఏర్పాటు
అమెరికాపై చైనా భారీగా పన్నులు వసూలు చేస్తున్నదని ట్రంప్ అన్నారు. ఇండియా, బ్రెజిల్‌తో పాటు మరికొన్ని దేశాలు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయని తెలిపారు. ఇక నుంచి దీన్ని అడ్డుకుంటామని, అమెరికన్ల ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఇన్ కమ్ ట్యాక్స్, టారిఫ్ వంటి అంశాలు చూసుకునేందుకు ‘ఎక్స్‌టర్నల్ రెవెన్యూ సర్వీస్’ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘1870–1913 మధ్య కాలంలో అమెరికా స్పెషల్ టారిఫ్ లను ప్రవేశపెట్టి వాటి ఆదాయంపై ఆధారపడింది. తర్వాత ఆ స్పెషల్ టారిఫ్‌లను క్రమంగా తొలగించారు. ఈ వ్యూహం అమెరికా ఆర్థిక వ్యవస్థను మరోసారి బలోపేతం చేస్తుంది. అమెరికా ఫస్ట్ మోడల్ కింద.. ఇతర దేశాలపై సుంకాలు పెంచే కొద్దీ.. మన కార్మికులు, వ్యాపారులపై పన్నులు తగ్గుతాయి’’ అని ట్రంప్ తెలిపారు.