చైనాపై యుద్ధం ప్రకటించిన ట్రంప్.. 104 శాతం ప్రతీకార సుంకాలు విధించి పెద్ద షాకే ఇచ్చాడు..!

చైనాపై యుద్ధం ప్రకటించిన ట్రంప్.. 104 శాతం ప్రతీకార సుంకాలు విధించి పెద్ద షాకే ఇచ్చాడు..!

వాషింగ్టన్ డీసీ: చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై104 శాతం ప్రతీకార సుంకాలు(టారిఫ్స్) విధిస్తున్నట్లు వైట్ హౌస్ వర్గాలు ధ్రువీకరించాయి. ఈ టారిఫ్స్ ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ తెలిపింది. ఇటీవలే చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 34 శాతం అదనపు టారిఫ్ వేసిన సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్గా చైనా కూడా అమెరికాపై 34 శాతం ప్రతీకార సుంకాలు విధించింది.

చైనా తమపై విధించిన ఈ 34 శాతం టారిఫ్ను ఏప్రిల్ 8 లోపు వెనక్కి తీసుకోవాలని, లేకపోతే అదనంగా 50 శాతం టారిఫ్లు వేస్తానని.. ఈ నెల 9 నుంచే కొత్త టారిఫ్లు అమల్లోకి వస్తాయని ట్రంప్ చేసిన హెచ్చరికను చైనా లెక్కచేయలేదు. దీంతో.. ట్రంప్ చైనాపై 104 శాతం టారిఫ్స్ విధించారు. ఏప్రిల్ 9 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.

చైనా నుంచి అమెరికాకు ఏటా సుమారు రూ.38 లక్షల కోట్లు విలువ చేసే వస్తువులు ఎగుమతి అవుతుంటాయి. అన్ని దేశాలపై సుంకాలు వేస్తున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ లెక్కలతో ముందుకు రాగా.. దీనికి రివేంజ్గా చైనా కూడా టారిఫ్ యుద్ధంలో వెనక్కి తగ్గేదేలే అని ప్రకటించడంతో వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది.

Also Read : రూల్స్ మార్చేసి మన స్టూడెంట్స్‌కు నరకం

చైనాకు ట్రంప్ చేసిన హెచ్చరిక ఏంటంటే..
‘‘అమెరికాపై ఏదైనా దేశం అదనపు టారిఫ్లు వేస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించినా చైనా లెక్క చేయలేదు. చైనాకు ఈ నెల 8 వరకు గడువు ఇస్తున్నా. అమెరికాపై విధించిన 34 శాతం టారిఫ్​ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేదా ఈనెల 9 నుంచి అదనంగా మరో 50 శాతం టారిఫ్లను భరించాల్సి ఉంటుంది” అని ట్రంప్  స్పష్టం చేశారు.

కాగా, ఇదివరకే చైనాపై ఆయన 34 శాతం అదనపు టారిఫ్​ వేశారు. అంతకుముందు 20 శాతం సుంకం ఉంది. దీంతో మొత్తం టారిఫ్లు 54 శాతానికి చేరాయి. అదనంగా మరో 50 శాతం టారిఫ్​ విధించడంతో చైనాపై అమెరికా మొత్తం సుంకాలు 104 శాతానికి పెరిగాయి.