పహల్గాం దాడి చెత్త పని.. కశ్మీర్ విషయంలో మేం కలగజేసుకోం: డొనాల్డ్ ట్రంప్

పహల్గాం దాడి చెత్త పని.. కశ్మీర్ విషయంలో మేం కలగజేసుకోం: డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: జమ్మూకాశ్మీర్‎లోని బైసరన్‎లో జరిగిన పహల్గాం దాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ట్రంప్​మరోసారి ఖండించారు. ఈ ఉగ్రదాడి చెత్తపని అని వ్యాఖ్యానించారు. దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని అన్నారు. బార్డర్​విషయంలో ఇండియా, పాక్​ మధ్య చాలా ఏండ్లుగా యుద్ధం కొనసాగుతున్నదని చెప్పారు. ఈ సమస్యకు పరిష్కారం వారి చేతుల్లోనే ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఎయిర్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ వన్‌‌‌‌ విమానంలో విలేకరులతో ట్రంప్​ మాట్లాడారు.

 ‘‘నేను ఇండియాకు చాలా దగ్గరగా ఉంటాను. అలాగే, పాకిస్తాన్​తోనూ క్లోజ్‎గానే ఉంటాను. ఆ రెండు దేశాల మధ్య చాలా ఏండ్లుగా వైరం ఉన్నది” అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్లు తీయకుండా.. ఆ ఇద్దరు నాయకులు తనకు బాగా తెలుసని చెప్పారు. ‘‘పాకిస్తాన్, భారత్​మధ్య తీవ్ర ఉద్రిక్తత ఉంది. అది ఎప్పటినుంచో ఉంది’’ అని అన్నారు. ఏండ్లుగా సాగుతున్న సరిహద్దు సమస్యలను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయి అని, ఇంతకంటే చేసేదేమీ లేదని అన్నారు.  

టెర్రరిజం విషయంలో పోరులో భారత్‎తోనే అమెరికా ఉంటుందని గురువారం అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ చేసిన కామెంట్స్​నేపథ్యంలో ట్రంప్​వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంతకుముందు ట్రంప్‌‌‌‌.. ‘‘కశ్మీర్‌‌‌‌ పహల్గాం ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. టెర్రరిజానికి వ్యతిరేకంగా భారత్‌‌‌‌కు అమెరికా మద్దతుగా నిలుస్తుంది. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలి. ప్రధాని మోదీ, భారత ప్రజలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు.