
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అమెరికా సిటిజన్ షిప్ కావాలనుకునే సంపన్నుల కోసం గోల్డ్ కార్డ్ ను డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టారు. ఎవరైనా దీన్ని కొనుగోలు చేసి ఆ దేశ పౌరసత్వాన్ని పొందవచ్చు. శుక్రవారం (April 4) ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకరులతో మాట్లాడే సమయంలో ఆయన దీన్ని చూపించారు. గోల్డ్ కార్డ్ ను 5 మిలియన్ డాలర్లతో ఎవరైనా సొంతం చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
దీన్ని తానే మొదట కొనుగోలు చేసినట్టు చెప్పారు. రెండోది ఎవరు కొంటారనేది తనకు తెలియదని పేర్కొన్నారు. ఈ గోల్డ్ కార్డ్ రెండు వారాల్లో అమ్ముడైపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విదేశీ ఇన్వెస్టర్లు గ్రీన్ కార్డు పొందేందుకు ఉద్దేశించిన ఈబీ–5 వీసాకు ప్రత్యామ్నాయంగా ఈ గోల్డ్ కార్డ్ ను తీసుకొస్తున్నట్లు ట్రంప్ ఇటీవల ప్రకటించారు.
ఐదు మిలియన్ డాలర్లు(సుమారు రూ.43.5 కోట్లు) వెచ్చించేవారికి ఈ కార్డ్ ను అందిస్తామని చెప్పారు. గోల్డ్ కార్డుకు భారీగా గిరాకీ ఉందని, ఒక్కరోజే 1000 కార్డులను విక్రయించామని వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 3.7 కోట్ల మందికి
ఈ కార్డు కొనే సామర్థ్యం ఉందని వెల్లడించారు.