డాలర్​ను రీప్లేస్ చేయాలని చూస్తే 100 శాతం టారిఫ్.. బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్

డాలర్​ను రీప్లేస్ చేయాలని చూస్తే 100 శాతం టారిఫ్..  బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్

వాషింగ్టన్: బ్రిక్స్ దేశాలకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్  ట్రంప్ గట్టి వార్నింగ్  ఇచ్చారు. అమెరికా డాలర్​ను రీప్లేస్ చేయడానికి యత్నిస్తే, బ్రిక్స్ దేశాల నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే సరుకులపై 100% టారిఫ్  విధిస్తానని ఆయన హెచ్చరించారు. డాలర్​కు ప్రత్యామ్నాయ కరెన్సీ దిశగా ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ‘‘బ్రిక్స్ దేశాలు సొంతంగా వాటి కరెన్సీ తయారు చేయకుండా చూడాలి. శక్తివంతమైన మన అమెరికా డాలర్​ను ఏ ఇతర కరెన్సీతో కూడా ఆ దేశాలు భర్తీ చేయరాదు. 

ఒకవేళ అలాంటి ప్రయత్నంచేస్తే, ఆ దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై బరాబర్ 100 శాతం సుంకాలు విధిస్తా. అలాగే, ఆ దేశాలు అమెరికాకు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి కల్పిస్తా” అని ట్రంప్ పేర్కొన్నారు.  మరోవైపు, ప్రైమరీ రిజర్వ్  కరెన్సీగా అమెరికా డాలర్​పై అంతర్జాతీయంగా నమ్మకం ఉందని అట్లాంటిక్  కౌన్సిల్​కు చెందిన జియో ఎకనామిక్స్  సెంటర్  2024లో నిర్వహించిన సర్వేలో తేలింది. అమెరికా డాలర్ కు ప్రత్యామ్నాయం కనుగొనడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని పేర్కొంది.