ప్రబలుతున్న ట్రంప్​ వ్యాపారతత్వం

ప్రబలుతున్న ట్రంప్​ వ్యాపారతత్వం

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవ లేదనే సామెత వర్తమాన ప్రపంచంలో వాస్తవ రూపం దాల్చింది.  మొండివాడే రాజైతే ఎలా ఉంటుందో... ప్రస్తుత అమెరికా సారథి డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిని చూస్తే అర్థమౌతుంది. శత్రు దేశాలను మిత్ర దేశాలుగా మార్చుకోవడం,  తమకు ఇప్పటివరకు వెన్నుదన్నుగా నిలిచిన దేశాలతో  గిల్లికజ్జాలు పెట్టుకుని, విమర్శించడం  ట్రంప్ అహంభావానికి నిదర్శనం.   వ్యాపారవేత్త  పాలకుడుగా మారితే ఎలా ఉంటుందో డొనాల్డ్ ట్రంప్  ప్రపంచానికి పరిచయం చేశాడు.

ట్రంప్ వ్యాపార దృక్ఫథంతో  ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి.  ఒకవైపు అక్రమ వలసదారులంటూ ఏదో  ఘోరమైన నేరం చేసినట్టు సంకెళ్లువేసి యుద్ధ విమానాల్లో పంపిస్తున్న ట్రంప్,  మరోవైపు అమెరికాలో  పౌరులుగా గుర్తింపు పొందగోరేవారంతా 43.5 కోట్లు చెల్లించి (భారత్  కరెన్సీ ప్రకారం)  గోల్డ్ కార్డు వీసా పొందాలని ఆదేశించడం,  గోల్డ్ కార్డు వీసాతో  కోటి మంది ధనిక వలసదారులను  అమెరికా పౌరసత్వం ఇవ్వజూపడం  ట్రంప్​లోని వ్యాపారవేత్తను బహిర్గతం చేస్తున్నది.

సోవియట్ యూనియన్ విచ్ఛిన్నానికి ముందు తీవ్రమైన శత్రుత్వంతో రగిలిపోయిన అమెరికా నేడు రష్యాతో  చెలిమి చేయడం విడ్డూరం.  గోర్బచెవ్ అనాలోచిత నిర్ణయాల ఫలితంగా అప్పటి సోవియట్ యూనియన్  చిన్న చిన్న స్వతంత్ర  దేశాలుగా విడిపోయింది.  చిన్నాభిన్నమైన  భూభాగాల్లో  ఒకటైన రష్యాపట్ల కూడా ఇప్పటివరకు అమెరికా పాలకులు  శత్రుత్వ  వైఖరినే  ప్రదర్శించారు.  

నాటోలో   చేరాలని  ఆచరణ  సాధ్యంకాని  కోరికతో ఉబలాటబడిన ఉక్రెయిన్​ను  రష్యాపైకి ఎగదోసి ఆయుధ సహాయం,  ఆర్థిక సహాయం చేసి  మూడేళ్లపాటు యుద్ధం చేయించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు జో  బైడెన్,  అమెరికాకు  తోకలా మారిన నాటో కూటమి అమెరికాలో ట్రంప్  రాకతో నివ్వెరపోవడం జరిగింది.  

ట్రంప్ పునః ప్రవేశం వలన  ప్రపంచంలో  రాజకీయ  పరిణామాలు ఆకస్మికంగా  మారిపోయాయి.  అమెరికా అండతో  ధీమాగా ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ,  ట్రంప్ ధిక్కార స్వరంతో కుదేలయ్యాడు. ఉక్రెయిన్   లో  లభ్యమయ్యే సుమారు  43 లక్షల కోట్ల రూపాయల విలువైన అరుదైన టైటానియం, లిథియం, యురేనియం, గ్రాఫైట్ వంటి అపారమైన భూగర్భ ఖనిజ సంపదను కొల్లగొట్టడానికి  అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో జెలెన్ స్కీ  ఒక పావులా మారిపోయాడు.  

ఉక్రెయిన్ ఖనిజ సంపదపై  ట్రంప్​ నజర్​

మూడేళ్లుగా ఉక్రెయిన్​కు  అందించిన  యుద్ధ సహాయానికి  బదులుగా ఉక్రెయిన్ నుంచి ఖనిజ సంపదను దోచుకోవడానికి ట్రంప్ పాచికలు విసురుతున్నాడు.  ఒంటరిగా మిగిలిన జెలెన్ స్కీ కి  రష్యా బూచి చూపించి,  భయపెట్టి, బలవంతంగా  ఉక్రెయిన్ లోని సంపదను లాక్కుంటున్నాడు. 

చిరకాల శతృవైన రష్యాతో స్నేహం నటిస్తూ, ఉక్రెయిన్ నుంచి రష్యా ఆక్రమించిన 20 శాతం భూభాగాలు ఇక రష్యా అధీనంలోనే ఉండేలా ఒప్పుకుంటూ, ఆయా భూభాగాల నుంచి కూడా  ఖనిజ సంపదను  కొల్లగొట్టాలని అమెరికా ఉవ్విళ్ళూరుతున్నది. ఇప్పటివరకు అమెరికా కనుసన్నల్లో  మెలిగిన నాటో దేశాలు ట్రంప్ చేష్టలతో నిశ్చేష్టంగా మారి, అమెరికా ఆటలో అరటి పండులా  మిగిలిపోయాయి.  

తనకు అండదండగా నిలుస్తున్న యూరోపియన్ యూనియన్​ను కూడా వదలి పెట్టకుండా, ట్రంప్ విమర్శించడమే కాకుండా, అమెరికాను నిలువరించడానికే యూరోపియన్ సమాఖ్య ఏర్పడిందని దుమ్మెత్తి పోయడంతో బిత్తర పోయిన 27 దేశాల  యూరోప్ సమాఖ్య అమెరికాపై ఆగ్రహంతో రగిలిపోతున్నది.   ట్రంప్ ధోరణితో యూరోపియన్  యూనియన్  అభాసుపాలయింది.చైనా కంటే  అమెరికా ప్రస్తుతం  యూరోపియన్ యూనియన్​కు  పెద్ద తలనొప్పిగా మారింది. 

బ్రిక్స్​ దేశాలపై ట్రంప్​ అక్కసు

మెక్సికో, కెనడా, ఇండియాలపై 25 శాతం టారిఫ్ విధించిన ట్రంప్ యూరోపియన్ యూనియన్​పై కూడా అధికశాతం టారిఫ్  విధిస్తానని చెబుతున్నాడు.  కెనడాను అమెరికాలో విలీనం చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించాడు. గాజాను ఖాళీ చేయించి టూరిస్టు కేంద్రంగా మార్చాలనే ట్రంప్ ఆలోచన ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చెప్పలేం.  తనకు మిత్ర దేశమైన డెన్మార్క్ అధీనంలోని ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీపమైన గ్రీన్ లాండ్​ను కొంటానని, గ్రీన్ లాండ్​ను అమెరికాకు అప్పగించకపోతే,  ఆర్థిక ఆంక్షలతో పాటు, మిలిటరీ చర్య తీసుకుంటానని ట్రంప్ హెచ్చరించడం శోచనీయం.  

రష్యాతో అవసరార్థం చెలిమి చేస్తున్న  అమెరికా భవిష్యత్తులో  చైనాతో కూడా ఇదే విధమైన వ్యాపార పంథాతో వ్యవహరించి, వాణిజ్య ఒప్పందాలు చేసుకుని  తైవాన్​ను  చైనాకు అప్పగిస్తుందనే  అనుమానాలున్నాయి.  ఉగ్రవాదులకు స్వర్గధామమైన పాకిస్తాన్​కు ఉగ్రవాదుల ఏరివేత నిమిత్తం ఆర్ధిక సహాయం అందిస్తానని, యుద్ధ విమానాలను సరఫరా చేస్తానని చెప్పడం హాస్యాస్పదం.  

యూరప్​తో వాణిజ్య ఒప్పందం శ్రేయస్కరం

వాణిజ్య, రక్షణ, సాంకేతిక సంబంధాల్లో పరస్పర అవగాహన కోసం 2006వ సంవత్సరంలో  బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా,  సౌత్ ఆఫ్రికా దేశాలతో  ఏర్పడిన  బ్రిక్స్ దేశాలపై  కూడా ట్రంప్ అక్కసును  వెళ్ళగక్కడం,  బ్రిక్స్ దేశాలు డాలర్ కు  ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీ రూపొందిస్తే ఊరుకోనని ట్రంప్ హెచ్చరించడం విదితమే. ఇలాంటి పరిస్థితుల్లో యూరోపియన్ యూనియన్ ఇండియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం చర్చలు జరపడం విశేషం.  

రెండు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లోటును  పూడ్చుకోవడానికి ఇతర దేశాలపై టారిఫ్​లు పెంచుతూ, భయపెడుతున్న  డొనాల్డ్  ట్రంప్ ఆధ్వర్యంలో శతాబ్దాల చారిత్రాత్మకమైన అమెరికా  ప్రతిష్ట  అడుగంటిపోతున్నది. అమెరికా ఎత్తులకు, ఒత్తిళ్లకు లొంగకుండా భారత్ కూడా తనదైన ఆర్థిక, రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగాలి. ఒకవైపు  చైనాతో  విభేదిస్తూనే, మరోవైపు  వివిధ అవసరాల కోసం  చైనాపై ఆధారపడడం భారత్​కు మంచిది కాదు. యూరోపియన్ యూనియన్​తో  స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే  ఏకకాలంలో అమెరికా,  చైనాలకు  గుణపాఠం చెప్పవచ్చు. 

- సుంకవల్లి సత్తిరాజు, సోషల్ ఎనలిస్ట్-