US Vs China: చైనాను చావుదెబ్బ కొట్టిన ట్రంప్.. ఇకపై 245 శాతం టారిఫ్స్, ఆ తప్పే కారణం..

US Vs China: చైనాను చావుదెబ్బ కొట్టిన ట్రంప్.. ఇకపై 245 శాతం టారిఫ్స్, ఆ తప్పే కారణం..

Tariffs on China: ట్రంప్ ఆగ్రహానికి గురైన చైనా ఇప్పటికే ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ఎక్కువ సుంకాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా చైనా చేసిన పనికి ట్రంప్ కు కోపం రావటంతో ఈసారి చైనా దిగుమతులపై సుంకాన్ని ఏకంగా 245 శాతం వరకు పెంచుతున్నట్లు వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ ప్రకారం వెల్లడైంది. చైనా ప్రస్తుతం అమెరికాపై ప్రతీకార సుంకాలను విధించటంతో పాటు చైనా తన విమాన సంస్థలకు అమెరికా నుంచి విమాన విడిభాగాలు, సంబంధిత వస్తువులను కొనుగోలు నిలిపివేయాలని ఆదేశించిన వేళ పరిస్థితులు మరింతగా దిగజారాయి.

చైనా తనపై అమెరికా విధించిన 145 శాతం టారిఫ్స్ వ్యతిరేకిస్తూ బోయింగ్ జెట్స్ డెలివరీలను నిలిపివేయాలంటూ చైనా విమాన సంస్థలకు సూచించటంతో వివాదం మరింతగా ముదిరిపోయింది. అలాగే అమెరికా వాణిజ్య యుద్ధం విషయంలో తాము భయపడేది లేదంటూ చేసిన కామెంట్స్ సమస్యలను జఠిలం చేస్తున్నాయి. అమెరికా నిజంగా సమస్యను పరిష్కరించాలనుకుంటే బ్లాక్ మెయిల్ చేయటం, బెదిరింపులకు దిగటం మానుకోవాలని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన లిన్ జియన్ సూచించారు. మాటలతో సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని ఆయన అన్నారు.

►ALSO READ | TCS News: జాక్‌పాట్ కొట్టిన టీసీఎస్.. 99 పైసలకే 21 ఎకరాలు, ఏపీ సర్కార్ సంచలనం..

అయితే దీనికి ముందు నిన్న వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ లివిట్ మాట్లాడుతూ ట్రంప్ చైనాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవటానికి సానుకూలంగానే ఉన్నారని అయితే దీనికి ముందడుగు చైనా నుంచే పడాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. చైనాకు అమెరికా కస్టమర్లు, అమెరికా సంపద కావాలని ఆమె ధ్వజమెత్తారు. 

అధ్యక్షుడు ట్రంప్ మాత్రం చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తెలివైనవారని, చైనాకు మంచే జరగాలని తాను కోరుకుంటున్నాని అంటూనే.. టారిఫ్స్ యుద్ధంలో మాత్రం వెనక్కి తగ్గటం లేదు. దీంతో ప్రస్తుతం ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ట్రంప్ ప్రపంచ దేశాలకు టారిఫ్స్ నుంచి 90 రోజులు రిలీఫ్ ప్రకటించినప్పటికీ చైనాపై మాత్రం 245 శాతం టారిఫ్స్ అమలులోకి రావటం దిగజారుతున్న పరిస్థితులకు అద్దం పడుతోంది. మరోపక్క చైనాలోని అనేక చిన్న మధ్యతరహా తయారీ సంస్థల నుంచి పెద్ద కంపెనీల వరకు మూతపడే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.