![ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్‌తో మాట్లాడిన : ట్రంప్](https://static.v6velugu.com/uploads/2025/02/trump-says-he-has-spoken-with-putin-about-ending-ukraine-war_HUChLoOFp3.jpg)
- ఇక ప్రజల చావులు ఆగాలనిఅనుకుంటున్నరని వెల్లడి
- ఇటు రష్యా, అటు అమెరికా నుంచి రాని అధికారిక ప్రకటన
వాషింగ్టన్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఫోన్ లో మాట్లాడానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. యుద్ధంలో ప్రజలు చనిపోవడం ఆగిపోవాలని కోరుకుంటన్నట్లు పుతిన్ చెప్పారని న్యూయార్క్ పోస్టుకు ట్రంప్ వెల్లడించారు. ‘‘పుతిన్ తో నాకు ఎప్పుడూ మంచి సంబంధాలే ఉన్నాయి. యుద్ధానికి ముగింపు పలకడానికి నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. అయితే, అదేంటో నేను చెప్పను. సాధ్యమైనంత త్వరగానే యుద్ధానికి తెరపడుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే, రోజూ ప్రజలు చనిపోతున్నారు. ఉక్రెయిన్ లో పరిస్థితి దారుణంగా ఉంది. యుద్ధం త్వరగా ముగిసిపోవాలని నేను కోరుకుంటున్న” అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఇప్పటివరకు ఇద్దరూ ఎన్నిసార్లు మాట్లాడుకున్నారని అడిగిన ప్రశ్నకు ట్రంప్ జవాబు చెప్పలేదు. ఆ విషయం తాను వెల్లడించకూడదని ఆయన పేర్కొన్నారు. కాగా.. ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడేందుకు పుతిన్ సిద్ధంగా ఉన్నారని గత నెలలో క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. అందుకు ట్రంప్ అంగీకరించారని పెస్కోవ్ చెప్పారు. అలాగే, రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపు కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతోనూ మరో రెండు వారాల్లో చర్చలు జరుపుతానని ట్రంప్ వెల్లడించారు.
అమెరికన్ల డేటాను యాక్సెస్ చేయడానికి వీల్లేదు
అమెరికన్ల వ్యక్తిగత, ఆర్థిక డేటాను యాక్సెస్ చేయకూడదని వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(డోగ్) ని న్యూయార్క్ ఫెడరల్ జడ్జి ఆదేశించారు. కొన్ని లక్షల మంది అమెరికన్ల వ్యక్తిగత, ఫైనాన్షియల్ డేటా ట్రెజరీ డిపార్ట్ మెంట్ వద్ద ఉందని జడ్జి పేర్కొన్నారు. కాగా.. అమెరికన్ల డేటా యాక్సెస్ చేయడానికి డోగ్ కు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అపరిమిత అధికారాలు కట్టబెట్టారని న్యూయార్క్ అటార్నీస్ జనరల్ లెటిటియా జేమ్స్ కేసు వేశారు. ఆ డేటాను డోగ్ సిబ్బంది యాక్సెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
యూఎస్ ఎయిడ్ ఏజెన్సీ చిహ్నం తొలగింపు
యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ (యూఎస్ ఎయిడ్) చిహ్నాన్ని దాని హెడ్ క్వార్టర్స్ నుంచి ట్రంప్ సర్కారు తొలగించింది. ఆ చిహ్నాన్ని తొలగించకుండా యూఎస్ ఎయిడ్ ఉద్యోగులు ఇదివరకే కోర్టులో దావా వేశారు. ఆ దావా కోర్టులో ఉండగానే యూఎస్ ఎయిడ్ చిహ్నాన్ని ట్రంప్ సర్కారు తొలగించింది. రొనాల్డ్ రీగన్ బిల్డింగ్ ముందు భాగంలో ఉన్న యూఎస్ ఎయిడ్ అక్షరాలను అధికారులు తొలగించారు.
టైమ్ మేగజీన్ ఇంకా ఉందా?
అమెరికా ప్రెసిడెంట్ కూర్చునే డెస్క్ వద్ద వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కూర్చుని ఉన్నట్లు టైమ్ మేగజీన్ ముద్రించిన కవర్ పేజీపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఆ మేగజీన్ ఇంకా ఉనికిలో ఉందా? అని ఆయన ఎద్దేవా చేశారు. ‘‘టైమ్ మేగజీన్ వ్యాపారం ఇంకా కొనసాగుతున్నదా? ఆ విషయం నాకు తెలియదే” అని ట్రంప్ చమత్కరించారు. ట్రంప్ ముఖ్య అనుచరుడిగా చక్రం తిప్పుతున్న మస్క్.. ఇప్పుడు యూఎస్ అసలు ప్రెసిడెంట్ అనే అర్థం వచ్చేలా టైమ్ పత్రిక ఈ కవర్ పేజీని రూపొందించగా.. ట్రంప్ ఇలా సెటైర్లు వేశారు.