- తల తిప్పకపోయి ఉంటే అక్కడే చనిపోయేవాన్ని
- ఇంకా స్పీచ్ ఇస్తానంటే అధికారులు ఒప్పుకోలేదు
- న్యూయార్క్ పోస్టు ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్
మిల్వాకీ (అమెరికా) : దుండగుడి కాల్పుల్లో తాను ఇక చనిపోయాననే అనుకున్నట్టు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అదృష్టమో.. దేవుడి దయో తెలీదు కానీ.. ప్రాణాలతో బయటపడ్డా అని తెలిపారు. అదొక భయంకరమైన అనుభవమని చెప్పారు. హత్యాయత్నం తర్వాత ట్రంప్ తొలిసారి న్యూయార్క్ పోస్టు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మిల్వాకీలో నిర్వహించిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో పాల్గొనేందుకు వెళ్తూ ఆయన మాట్లాడారు. ‘‘నాపై దేవుడి దయ లేకపోయి ఉంటే.. నేను ఈ టైమ్‌లో ఇక్కడ ఉండేవాడిని కాదు. దుండగుడు జరిపిన కాల్పుల్లోనే చనిపోయే వాడిని. ఆ టైమ్‌లో నేను చనిపోయాననే అనుకున్న.. కానీ, చివరికి ప్రాణాలతో బయటపడ్డా. నా పైన హత్యాయత్నం జరిగిందంటే నేనే నమ్మలేకపోతున్న. ఆ సమయంలో షాక్‌కు గురయ్య. మళ్లీ కొన్ని క్షణాల్లోనే తేరుకున్న. స్పీచ్ ఇస్తున్నప్పుడు కరెక్ట్ టైమ్‌లో నా తల కొద్దిగా తిప్పాను. అప్పుడే బుల్లెట్ నా చెవిని తాకుతూ వెళ్లిపోయింది. తల తిప్పకపోతే నా ప్రాణాలు పోయేవి. క్షణం లేట్ అయినా.. బుల్లెట్ నేరుగా తలలో దూసుకుపోయేది’’ అని ట్రంప్ అన్నారు.
ఇదొక మిరాకిల్ అని డాక్టర్లు అన్నరు
భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో దుండగుడు మాథ్యూ క్రూక్స్ చనిపోయాడని ట్రంప్ తెలిపారు. ‘‘బుల్లెట్ చెవిని తాకుతూ దూసుకెళ్లడం.. ప్రాణాలతో బయటపడటం మిరాకిల్ అని డాక్టర్లు అన్నారు. చెవి నుంచి రక్తం కారుతున్నా.. ఫైట్ చేస్తాననే నినాదాలు చేశాను. అప్పుడు తీసిన ఫొటోను మా మద్దతుదారులు వైరల్ చేస్తున్నారు. ఇదొక ఐకానిక్ ఫొటో అని కొనియాడుతున్నారు. కాల్పుల్లో నేను చనిపోలేదు.. అందుకే ఆ ఫొటో ఐకానిక్‌గా నిలిచింది’’అని ట్రంప్ అన్నారు.
బైడెన్ ఫోన్ చేసి మాట్లాడారు
కాల్పుల తర్వాత తనను భద్రతా బలగాలు రక్షణ కవచంలా ఏర్పడ్డాయని ట్రంప్ తెలిపారు. తాను ఇంకా మాట్లాడుతానని సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్లతో కోరినా.. వారు అనుమతివ్వలేదన్నారు. ఇక్కడి నుంచి హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని అధికారులు పట్టుబట్టినట్టు వివరించారు. ‘‘ప్రెసిడెంట్ జో బైడెన్కాల్ చేశారు. హెల్త్ కండీషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. నా ప్రత్యర్థిగా అయినప్పటికీ.. ఫోన్ చేయడాన్ని అభినందిస్తున్నాను’’అని అన్నారు.
జగన్నాథుడే ట్రంప్‌ను కాపాడారు: ఇస్కాన్
పూరీ జగన్నాథుడే ట్రంప్‌ను కాపాడాడని ఇస్కాన్ అధికార ప్రతినిధి రాధారమణ్ దాస్ అన్నారు. 48 ఏండ్ల కింద రథయాత్రకు ట్రంప్ సహకారం అందించారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జగన్నాథుడి రథయాత్ర ఫెస్టివల్ జరుగుతున్నదన్నారు. జగన్నాథుడికి ఆయన చేసిన సేవే.. ప్రాణాలు కాపాడిందని తెలిపారు.
నాలుగు నెలల కింద ఓ ఫాస్టర్ చెప్పినట్లే దాడి..
ట్రంప్‌పై హత్యాయత్నం జరుగుతుందని నాలుగు నెలల కిందే ఓ చర్చి ఫాస్టర్ చెప్పారు. దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మార్చి 14న పాస్టర్ బ్రాడన్ బ్రిగ్స్ ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. ఆయన చెప్పినట్లే తాజాగా దాడి జరగడం, చెవికి గాయం కావడం గమనార్హం. అప్పుడు బ్రాడన్ ఏం చెప్పాడంటే.. ‘‘అమెరికాలో త్వరలో జరగబోయే ఘటనల గురించి నాకు దేవుడు ముందే చెప్పాడు. ప్రచార ర్యాలీలో ట్రంప్‌పై దాడి జరుగుతుంది. ఇది నాకు స్పష్టంగా కనిపించింది. ఒక బుల్లెట్ ట్రంప్ తలకు దగ్గర నుంచి దూసుకెళ్తుంది. బుల్లెట్ ఆయన చెవిని గాయపరుస్తుంది. ఇయర్ డ్రమ్ దెబ్బతింటుంది. అప్పుడు ట్రంప్ మోకాళ్లపై కూర్చుని దేవుడిని ప్రార్థిస్తాడు. ఆ తర్వాత ఎన్నికల్లో ట్రంప్ గెలిచి అధ్యక్ష పదవి చేపడ్తారు’’ అని చెప్పారు.
ట్రంప్ ఆడిన నాటకమే..
ట్రంప్‌పై జరిగిన దాడిని కొందరు ఖండిస్తుంటే.. మరికొందరు ఇదొక కుట్ర అని కొట్టిపారేస్తున్నారు. గన్ పట్టుకుని దుండగుడు పైకప్పు ఎక్కుతుంటే.. అధికారులు ఏంచేస్తున్నారని ట్విట్టర్లో ప్రశ్నిస్తున్నారు. దుండగుడిని అక్కడివాళ్లు ముందే గుర్తించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా వాళ్లు పట్టించుకోకపోవడంపై సందేహం వ్యక్తం చేస్తున్నారు. సింపథి కోసం ఇలా చేశారని మరో ట్విట్టర్ యూజర్ చెప్పాడు. గన్ పేల్చిన సౌండ్ ఎవరికీ వినిపించలేదన్నారు.
నాపై దేవుడి దయ లేకపోయి ఉంటే.. నేను ఈ టైమ్‌లో ఇక్కడ ఉండేవాన్ని కాదు. దుండగుడు జరిపిన కాల్పుల్లోనే చనిపోయే వాన్ని. ఆ టైమ్‌లో నేను చనిపోయాననే అనుకున్న.. కానీ, చివరికి ప్రాణాలతో బయటపడ్డా. నా పైన హత్యాయత్నం జరిగిందంటే నేనే నమ్మలేకపోతున్న. ఆ సమయంలో షాక్‌కు గురయ్యా. మళ్లీ కొన్ని క్షణాల్లోనే తేరుకున్న. స్పీచ్ ఇస్తున్నప్పుడు కరెక్ట్ టైమ్‌లో నా తల కొద్దిగా తిప్పాను. అప్పుడే బుల్లెట్ నా చెవిని తాకుతూ వెళ్లిపోయింది. తల తిప్పకపోయి ఉంటే నా ప్రాణాలు పోయేవి. ఒక్క క్షణం లేట్ అయి ఉన్నా.. బుల్లెట్ నేరుగా నా తలలో దూసుకుపోయి చనిపోయేవాన్ని.
- అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్