పుతిన్​ కంటే మైగ్రేంట్లే డేంజర్​: ట్రంప్

పుతిన్​ కంటే మైగ్రేంట్లే డేంజర్​: ట్రంప్
  • రష్యా ప్రెసిడెంట్​ గురించి ఆందోళన చెందొద్దు 
  • అమెరికన్లకు ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ సూచన

న్యూయార్క్​: రష్యా ప్రెసిడెంట్ పుతిన్​ గురించి అమెరికన్లు ఆందోళన చెందొద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఆ దేశ ప్రజలకు సూచించారు. పుతిన్​కంటే అక్రమ వలసదారులే డేంజర్​ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​ ‘ట్రూత్’ వేదికగా ట్రంప్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మనం పుతిన్​ గురించి ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 

మన దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న మైగ్రేంట్స్, రేప్​ గ్యాంగ్స్​, డ్రగ్​లార్డ్స్​, మర్డరర్స్​, మానసికంగా ఇబ్బందిపడుతున్న వారిపై మనం దృష్టి పెట్టాలి” అని ప్రజలనుద్దేశించి  ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే, తన జాతీయ భద్రతా మాజీ సలహాదారు హెచ్ఆర్​ మెక్​మాస్టర్​పై ట్రంప్​ విరుచుకుపడ్డారు. ఇటీవలి పరిణామాలతో పుతిన్​ సంతోషంగా ఉండలేరు అని మెక్​మాస్టర్​ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మెక్​మాస్టర్​ ఓ బలహీనమైన, పూర్తిగా పనికిరానివాడని ముద్ర వేశారు.  

రష్యాకు అనుకూలంగా వైట్​హౌస్​: సెనేటర్​ మర్ఫీ

వైట్​హౌస్​ను డొనాల్డ్​ ట్రంప్​ రష్యాకు అనుకూలంగా మార్చేశారని డెమోక్రటిక్​ సెనేటర్​ క్రిస్​మర్ఫీ విమర్శించారు. ట్రంప్​ చర్యలతో క్రూరమైన నియంతృత్వానికి దగ్గరవుతున్నామని, ఇది విచారకరమైన రోజు అని పేర్కొన్నారు. అమెరికా చేసిన సాయానికి ఉక్రెయిన్​ కృతజ్ఞత తెలుపకుండానే వెళ్లేలా ట్రంప్​, వైస్​ ప్రెసిడెంట్​ జేడీ వాన్స్​ వ్యవహరించారని మండిపడ్డారు.