రాబోయే రోజుల్లో టారిఫ్​లు పెరగొచ్చు ..మెక్సికో, కెనడాకు ట్రంప్ వార్నింగ్

రాబోయే రోజుల్లో టారిఫ్​లు పెరగొచ్చు ..మెక్సికో, కెనడాకు ట్రంప్ వార్నింగ్
  • అమెరికాలో ఆర్థిక సంక్షోభం వచ్చే చాన్స్ లేదని వ్యాఖ్య

వాషింగ్టన్: కెనడా, మెక్సికోపై విధించిన సుంకాలు.. రాబోయే రోజుల్లో మరింత పెరగొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఫాక్స్ న్యూస్​తో నిర్వహించిన ‘సండే మార్నింగ్ ఫ్యూచర్స్ విత్ మరియా బార్టిరోమో’ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. రెసిప్రోకాల్ టారిఫ్​లు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. పెంచిన టారిఫ్​ల అమలు విషయంలో మెక్సికో, కెనడాకు నెల రోజుల చిన్నపాటి బ్రేక్ ఇచ్చామని తెలిపారు. రాబోయే రోజుల్లో అమెరికా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటుందని వస్తున్న కామెంట్లపై కూడా ట్రంప్ స్పందించారు. ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశమే లేదని, ఇలాంటి అంచనాలు తనకు నచ్చవని అన్నారు. అమెరికాలో మార్పు రాబోతున్నదని తెలిపారు. దేశ ఆర్థికాభివృద్ధికి ఎన్నో సంస్కరణలు చేపడుతున్నట్లు చెప్పారు. అమెరికాలోకి సంపదను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

 అయితే, ఇది చాలా పెద్ద అంశం కావడం వల్ల దానికి కొంత టైమ్ పడుతుందని వివరించారు. ఏప్రిల్ 2 నుంచి టారిఫ్​లు అమల్లోకి వచ్చాక.. టైమ్​ను బట్టి సుంకాలు పెరుగుతాయని తేల్చి చెప్పారు. కొన్నేండ్లుగా అమెరికాను అడ్డుపెట్టుకుని చాలా దేశాలు లాభపడ్డాయని విమర్శించారు. ఇంతకు ముందు ఎన్నడూ చూడని టారిఫ్​లు విధిస్తామని హెచ్చరించారు. అమెరికాపై ఎంత టారిఫ్ అయితే విధిస్తారో.. అంతే సుంకాలు తామూ వసూలు చేస్తామని స్పష్టం చేశారు. అమెరికా గడ్డపై వస్తువుల ఉత్పత్తి, వ్యాపారం జరగాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. రక్షణ రంగంలో ఖర్చులు తగ్గించుకునేందుకే తాను ఇష్టపడ్తానని, కానీ.. ఈసారి అలా చేయనని స్పష్టం చేశారు. డిఫెన్స్ సెక్టార్​పై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నట్లు తెలిపారు. రష్యా, చైనా వంటి దేశాల్లో చాలా సమస్యలు ఉన్నాయన్నారు. కొన్ని దేశాలు న్యూక్లియర్ వెపన్స్ తయారీకి చాలా డబ్బులు ఖర్చు చేస్తున్నాయని తెలిపారు.